Tuesday, June 17, 2025

కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ ... *‘‘కాలోహి దురతి క్రమః’’* అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం... లోకంలో ఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే.

కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా  కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు.  ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికి గానీ, మరొకరిని ఉద్ధరించడానికి గానీ పనికిరాడు...

No comments:

Post a Comment