గ్రీకు బ్రహ్మదేవుడు ఎంత అందగాడు !
...............................................
ప్రాచీన గాంధార కళాశైలికి చెందిన ఈ అరుదైన బ్రహ్మదేవుని శిల్పం కుషాణుల సామ్రాజ్య కాలానికి, సుమారు క్రీ.శ. 1వ నుండి 4వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా పండితులు భావిస్తున్నారు. గాంధార ప్రాంతం — నేటి ఆఫ్ఘానిస్తాన్ మరియు పాకిస్తాన్ వాయువ్య ప్రాంతాలను ఆవరించిన ఈ సాంస్కృతిక కేంద్రం. భారతీయ ఇరానియన్ గ్రీకు మరియు మధ్య ఆసియా కళాసంప్రదాయాల సంగమభూమిగా ఈ ప్రాంతం నిలిచింది. ఈ బ్రహ్మశిల్పం ఆ సాంస్కృతిక సమ్మేళనానికి ఒక అద్భుత సాక్ష్యంగా నిలుస్తుంది. ముఖ్యంగా కుషాణ చక్రవర్తుల పాలనలో బౌద్ధం హిందూమతం స్థానిక సంప్రదాయాలు మరియు హెలెనిస్టిక్ కళా ప్రభావాలు పరస్పరం మిళితమై ఒక ప్రత్యేక శిల్పకళా ధోరణిని సృష్టించాయి, అదే గాంధారశిల్పం.
సాధారణంగా పురాణాలు ఆగమాలు మరియు ఆలయ శిల్పాలలో బ్రహ్మదేవుడిని నాలుగు ముఖాలతో పొడవాటి గడ్డంతో వృద్ధజ్ఞాన స్వరూపుడిగా చిత్రిస్తారు. అయితే ఈ గాంధార శిల్పంలో ఆయనను యవ్వనంతో నిండిన సౌమ్యరూపంలో అందంగా మలచడం విశేషం.మధ్యలో ప్రశాంతమైన ప్రధాన ముఖం ఉండగా ఇరువైపులా కనిపించే ఇతర ముఖాలు కూడా ప్రసన్న ధరహాస రూపంలోనే వున్నాయి. మరికొందరు కనపడే మూడు ముఖాలను సృష్టి జ్ఞానం వాక్పటిమలకు రూపాలుగా వర్ణించారు.ఈ త్రిముఖ రూపకల్పన తరువాతి కాలంలో హిందూ శిల్పకళలో విస్తరించిన చతుర్ముఖ బ్రహ్మ రూపాలకు ఒక ప్రారంభ దశగా కూడా పరిగణించబడుతుంది.
విగ్రహంలో బ్రహ్మ చేతుల్లో కనిపించే కమండలం అక్షమాల అత్యంత ప్రతీకాత్మకమైన అంశాలుగా చెప్పవచ్చు. కమండలం సృష్టికి మూలమైన జలతత్త్వాన్ని ప్రాణశక్తిని యజ్ఞసంబంధ పవిత్రతను సూచిస్తుంది. అక్షమాల కాలచక్రం మంత్రోచ్ఛారణ తపస్సు జ్ఞానసాధనకు సాదృశ్యంగా భావించబడుతుంది. కొన్నిసార్లు అక్షమాలను బ్రహ్మ సృష్టించిన కాలమానం విశ్వవ్యవస్థకు సంకేతంగా కూడా వ్యాఖ్యానిస్తారు.
విగ్రహం కింద చెక్కబడిన వికసించిన పద్మపీఠం హిందూ సృష్టి సిద్ధాంతంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంది. విష్ణుమూర్తి నాభికమలంలోనుండి బ్రహ్మ ఉద్భవించాడనే పురాణగాథను ఈ పద్మం సూచిస్తుంది. పద్మం భారతీయతలో పవిత్రత సృష్టి విశ్వోత్పత్తి ఆధ్యాత్మిక వికాసానికి సంకేతం.
ప్రధాన విగ్రహానికి ఇరువైపులా కింద భాగంలో చేతులు జోడించి నిలిచిన చిన్న పరివార మూర్తులు చెక్కబడ్డాయి.వీరు దేవలోక సహాయకులు ఋషులు ల బ్రహ్మారాధకులుగా భావించబడుతున్నారు. ఈ విధమైన చిన్న ఉపమూర్తులను ప్రధాన దేవతకు భక్తి సేవాభావం తమ దైవాధీనతను తెలియజేసే ప్రతీలుగా గాంధార మథుర శిల్పాల్లో చూడవచ్చు.
కొంతమంది కళాచరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ శిల్పం ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన ప్రధానమూర్తి కాకుండా ఒక పెద్ద శిల్పసముదాయం లేదా ధార్మికస్థూప నిర్మాణంలో భాగంగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ శిల్పంలో కనిపించే వస్త్రధారణ శరీర నిర్మాణంలోని సహజత్వం నాజూకైన కండరాల ఆకృతి ముఖంలోని ప్రశాంతత మృదువైన కేశాలంకరణ వస్త్రాల మడతల తీరు వంటి లక్షణాలు గాంధార కళాశైలికి ప్రత్యేకమైన గ్రీకు-రోమన్ ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా వస్త్రాల మడతలను ల చెక్కిన తీరు గ్రీకు శిల్పకళలో కనిపించే టోగా వస్త్రశైలిని గుర్తుకు తెస్తుంది. అలెగ్జాండర్ దండయాత్రల అనంతరం భారతదేశం వాయువ్య ప్రాంతాల్లో ఏర్పడిన హెలెనిస్టిక్ కళాసంప్రదాయాలు స్థానిక బౌద్ధ హిందూ భావజాలాలతో మిళితమై గాంధార కళకు రూపం ఇచ్చాయి. అందువల్ల గాంధార కళను కేవలం బౌద్ధ కళగా మాత్రమే కాకుండా బహుసాంస్కృతిక నాగరికతల సంగమంగా కూడా అధ్యయనం చేస్తారు.
ఈ బ్రహ్మ శిల్పం మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా సూచిస్తుంది. గాంధార ప్రాంతంలో బౌద్ధమతం ప్రధానంగా ఉన్నప్పటికీ హిందూ దేవతల ఆరాధన కూడా అక్కడ సమాంతరంగా కొనసాగినట్లు ఇది తెలియజేస్తుంది. ఇందుకు అక్కడ దొరికిన శివ విష్ణు స్కంద హారితీ వంటి దేవతల గాంధార శిల్పాలు కూడా ఆధారాలుగా నిలుస్తాయి.ఈ నేపథ్యంలో బ్రహ్మ విగ్రహం గాంధార సమాజంలో మతపరమైన సహజీవనం సాంస్కృతిక మార్పిడి మరియు కళాత్మక ప్రయోగాలకు నిలయంగా భావించబడుతుంది.
అంతిమంగా ఈ శిల్పం కేవలం ఒక మతపరమైన ప్రతిమ మాత్రమే కాదు. ఇది ప్రాచీన భారతదేశం మధ్య ఆసియా మరియు గ్రీకు ప్రపంచాల మధ్య జరిగిన సాంస్కృతిక సంభాషణకు కళాత్మక పరిణామానికి ఆధ్యాత్మిక సమన్వయానికి నిలువెత్తు చారిత్రక సాక్ష్యం.
బ్రహ్మదేవుని తూర్పు ముఖం ఋగ్వేదాన్ని పఠిస్తుంది.ఇది భౌతికప్రపంచాన్ని జాగ్రదావస్థను సూచిస్తుంది.దక్షిణ ముఖం యజుర్వేదాన్ని పఠిస్తుంది. ఇది సృష్టి యొక్క క్రమాన్ని ధర్మాన్ని సూచిస్తుంది. పడమర ముఖం సామవేదాన్ని పఠిస్తుంది. ఇది సంగీతాన్ని, భక్తిని, సుషుప్త్యవస్థను సూచిస్తుంది. ఇక ఉత్తర ముఖం అథర్వణ వేదాన్ని పఠిస్తుంది.ఇది విజ్ఞానాన్ని రహస్య విద్యలను, తురీయావస్థను అంటే ఉన్నత ఆధ్యాత్మిక స్థితినిసూచిస్తుంది.
II శ్రీ సుబ్బారెడ్డి॥
Deputy Director of State Archeology
lIఅనువాదం & విస్తరణ॥
............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
No comments:
Post a Comment