Wednesday, June 3, 2026

 ఈ శాసనాన్ని ఎవరు తప్పినా అరవైవేల సంవత్సరాలు క్రిమికీటకాలుగానే...
.......................................

భారతదేశంలోని ప్రాచీన ,మధ్యయుగ శాసనాలలో అత్యంత ముఖ్యమైనమైనవి. చక్రవర్తులు రాజులు సామంతులు మంత్రులు మహామండలేశ్వరులు అమరనాయకులు అష్టాదశకులాలు మహజన గ్రామసభలు దేవాలయాధికారులు భక్తులు దేవాలయాలు, మఠాలు చెరువులు సత్రాలు బ్రాహ్మణ అగ్రహారాలు వంటి ధార్మిక ప్రజోపయోగ సంస్థలకు భూములు గ్రామాలు పన్నుల ఆదాయాలు పశువులు ధనం వజ్రవైడూర్యాలు ఆభరణాలు మరకతమాణిక్యాలు  కిరిటాలు మొదలైనవి కానుకలుగా ఇచ్చా రు.దానం చేయడం మాత్రమే కాక ఆ దానం శాశ్వతంగా కొనసాగాలని భవిష్యత్తులో ఎవరూ దానిని ఆక్రమించకూడదని రద్దు చేయకూడదని  ఆదాయాన్ని దుర్వినియోగం చేయకూడదని భావించి శాసనాల చివర ప్రత్యేకమైన శాపవాక్యాలను చెక్కించేవారు. వీటినే శాపనార్థాలు శాపవాక్యాలు దానరక్షణ వాక్యాలు ఆక్షేపణ వాక్యాలు అని పిలుస్తారు.

ఇప్పటిలాగా ఆ రోజుల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెవెన్యూ రికార్డులు భూసర్వేలు న్యాయస్థానాలు భూచట్టాలు లేవు. కనుక ప్రజలలో ఉన్న ధర్మభీతి పాపభీతి నరకభీతి వంటి భావాలే ఆస్తి రక్షణకు ప్రధాన సాధనాలుగా వారు మార్చుకొన్నారు. శాసనకర్తలు ప్రజల మనస్సులలో భయాన్ని కలిగించే విధంగా అత్యంత కఠినమైనశాపాలను ప్రయోగించారు.

ఉదాహరణకు

“స్వదత్తాం పరదత్తాం వా యో హరేత్ వసుంధరామ్ ।
షష్టిం వర్షసహస్రాణి విష్ఠాయాం జాయతే క్రిమిః ॥”

అంటే, తాను ఇచ్చినదైనా ఇతరులు ఇచ్చినదైనా దానభూమిని అపహరించినవాడు అరవై వేల సంవత్సరాలు మలములో పురుగుగా జన్మిస్తాడని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. ఇదే దక్షిణ భారతదేశ శాసనాలలో అత్యధికంగా కనిపించే దానరక్షణ శ్లోకం.

ఇంకా
“బహుభిర్వసుధా దత్తా బహుభిశ్చానుపాలితా ।
యస్య యస్య యదా భూమిస్తస్య తస్య తదా ఫలమ్ ॥”

అనే శ్లోకం భూమిని దానం చేసినవారి కంటే దానిని రక్షించినవారికీ కూడా సమానమైన పుణ్యం లభిస్తుందని చెబుతుంది. 

అలాగే
“దానపాలనయోర్మధ్యే దానాత్ శ్రేయోనుపాలనం”

అనే భావం అనేక శాసనాలలో కనిపిస్తుంది. అంటే దానం చేయడం కంటే దానాన్ని కాపాడడం గొప్ప ధర్మమని ఇందులో చెప్పబడింది.

తెలుగు ప్రాంత శాసనాలలో సంస్కృత శ్లోకాలతో పాటు ప్రజలకు సులభంగా అర్థమయ్యే స్థానిక భాషలో కూడా శాపవాక్యాలు కనిపిస్తాయి. 
ఈ ధర్మమునకు విఘాతం చేసినవాడు గోహత్యా పాతకమునొందును..గంగాతీరమందు కపిల గోవును చంపిన పాపాన బోవును. వారణాసియందు బ్రాహ్మణుని వధించిన పాపాన బోవును.
తన తల్లిదండ్రులను చంపిన పాపమునొందును. సప్తజన్మములు రౌరవనరకమున పడును.
వంటి శాపవాక్యాలు తరచుగా మనకు శాసనాలలో దర్శనమిస్తాయి.

కాశీ గంగ కపిల గోవు బ్రాహ్మణహత్య మాతాపితృవధ
భ్రుణహత్య కన్నబిడ్డలను చంపినట్లే వంటి అంశాలు శాసన సంప్రదాయంలో అత్యంత ఘోర పాపాలకు నిదర్శనాలుగా వుండేవి.అందుకే దానభంగం చేసినవారికి ఆ పాపాలు అంటుకుంటాయని శాసనాలు హెచ్చరించేవి.ప్రజలు కూడా అలాంటి దానాలను దుర్భుద్ధితో తాకేవారు కాదు.

దక్షిణ భారతదేశ శాసనాలలో అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే గర్దభ శాపాలు. గాడిదను అవమానానికి, అపహాస్యానికి ప్రతీకగా భావించిన మన సమాజం దానభంగం చేసినవారిని గాడిదతో పోలుస్తూ తీవ్రమైన శాపాలను రచించింది. అనేక సరిహద్దురాళ్లపై, గ్రామహద్దు శిలలపై, చెరువుశాసనాలపై గాడిదబొమ్మలు చెక్కి వుండటం గమనించవచ్చు.

కొన్ని శాసనాలలో కనిపించే పదప్రయోగాలు నేటి పాఠకులకు ఆశ్చర్యాన్ని అసహ్యాన్ని కలిగిస్తాయి. అయినా నాటి దేశకాల పరిస్థితులకు అవసరమైంది. 

ఉదాహరణకు

గాడిదకడుపు అనే పదం గాడిద గర్భాన్ని సూచిస్తుంది. అంటే చచ్చి గాడిదైపుడతావని.కొన్ని శాసనాలలో ఈ పుణ్యాన్ని ఎవడైనా చెరిపివేసిన యెడల గాడిద కడుపున పుట్టినవాడవును. పరమ నరకమును అనుభవించును అనే భావం కనిపిస్తుంది. 
అంటే ధర్మాన్ని భంగపరిచినవాడు నీచజన్మ పొందుతాడనే ఉద్దేశం.

గాడిద - - --- (గార్దభమేఢ్రము) అనే పదప్రయోగం  తీవ్రమైన అవమానార్థక శాపాలలో ఒకటి. శాసనాలలో మేరకాదన్న వారి నోటిలో గాడిద --- అనే వాక్యం కనిపిస్తుంది.ఇది శాపవాక్యాలలో ఉపయోగించిన అత్యంత కఠినమైన సామాజిక అవమాన పదజాలానికి ఉదాహరణ.

అలాగే గాడిదెస్తనము లేదా గార్దభస్తనము అనే పదాలు కూడా కొన్ని తెలుగు శాసనాలలో కనిపిస్తాయి. ఒంగోలు పరిసర ప్రాంతాలలో లభించిన కొన్ని శాసనాలలో 
ఈ గ్రామంవారు గాడిదెస్తనము తాగినవారు అనే భావం కనిపిస్తుంది. ధర్మాన్ని ఉల్లంఘించినవారిని సామాజికంగా అవమానించేందుకు ఇటువంటి పదజాలం ఉపయోగించబడింది.
గార్దభజన్మాన జనించి యమపురికింబోవువారు అనే వాక్యం కనిపిస్తుంది. అంటే ధర్మాన్ని భంగపరిచినవారు గాడిదగా జన్మించి అనంతరం యమలోక శిక్షలను అనుభవిస్తారని హెచ్చరిస్తుంది.

కాకతీయ రెడ్డి విజయనగర కాలాలలో ఈ విధమైన శాపవాక్యాలు మరింత విస్తరించాయి. వంశక్షయం పొందును. పుత్రపౌత్రులు నశించుదురు. కుష్ఠవ్యాధి కలుగును. శ్వానయో...లో జన్మించుదురు. సూకరయో...లో జన్మించుదురు. చండాలయో...లో జన్మించును గార్దభయో...లో జన్మించును
వంటి శాపాలు వరుసగా కనిపిస్తాయి.
ముస్లీంల నుండి దానాలకు క్షయం లేకుండా వుండేటందుకు వారిపై  కూడా  ఈ శాపవచనాల ప్రయోగించారు.

కొన్ని ప్రాంతీయ శాసనాలలో సామాజిక అవమానాన్ని కూడా శాపంగా ఉపయోగించారు. నాటి వర్ణవ్యవస్థ నేపథ్యంలో భార్య, కూతురు, వంశగౌరవం, కులమర్యాదలను ప్రస్తావిస్తూ తీవ్ర శాపాలు రచించబడ్డాయి. ఇవి నేటి విలువలతో పోలిస్తే అనుచితంగా కనిపించినప్పటికీ, ఆ కాలపు సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా నిలుస్తాయి.

మధ్యయుగ భారతదేశంలో దానశాసనాల చివర కనిపించే ఈ శాపవాక్యాలు కేవలం భయపెట్టే మాటలు మాత్రమే కావు. అవి అప్పటి సమాజంలో న్యాయవ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పనిచేసిన ఒక సామాజిక నియంత్రణ పద్ధతి. ధర్మదానాలను, దేవాలయాలను, చెరువులను, విద్యాసంస్థలను, ప్రజా ఆస్తులను కాపాడేందుకు పాపభీతిని ఒక సాధనంగా ఉపయోగించిన విధానానికి ఇవి నిదర్శనం. అందువల్ల తెలుగు దానశాసనాలలోని శాపనార్థాలు మధ్యయుగ భారతదేశ న్యాయవ్యవస్థ, ధార్మిక భావజాలం, సామాజిక విలువలు, ప్రజల మనస్తత్వం మరియు భాషా పరిణామాన్ని అధ్యయనం చేయడానికి అమూల్యమైన చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయి.

//సేకరణ//
..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

No comments:

Post a Comment