*శిల శిల్పం అవుతుంది... మానవుడు మహర్షి అవుతాడు*
సంపదలు రావచ్చు, పోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు, తగ్గవచ్చు.
ఇవన్నీ బాహ్యమైనవి. అంతరంగం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.
ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాల్లో స్థితప్రజ్ఞత గురించి తరచూ చెబుతుంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ధైర్య స్థైర్యాలతో ఎదుర్కోవడమే స్థితప్రజ్ఞత అని ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం నిర్వచించింది. అది అంత సులువేమీ కాదు.
అన్ని సమయాలూ, సందర్భాలూ మన నియంత్రణలో ఉండవు. అలాంటప్పుడు కూడా కుంగిపోకుండా సంయమనం పాటించి పరిస్థితిని చక్కబరచుకోవాలని పురాణ పురుషుల కథనాలు తెలియజేస్తాయి.
జీవన పయనంలో అనుకున్నది జరగనప్పుడు లేదా ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు విధి అనే పదం గుర్తుకొస్తుంది. ఆ విధిని మార్చడం మన చేతుల్లో లేకపోవచ్చు కానీ, అలజడిని తట్టుకుని, నిలకడగా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది.
విజయం హోదాలోనో, సంపదల్లోనో లేదు, ఎదురయ్యే సవాళ్లను నిబ్బరంతో ఎదుర్కోవడంలోనే ఉంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండే సమతౌల్య స్థితే స్థితప్రజ్ఞత.
నిప్పులో కాలితేనే బంగారం మెరుస్తుంది, శిలను చెక్కితేనే శిల్పం అవుతుంది. అలాగే ఎదురయ్యే సవాళ్లు మరింత దృఢత్వాన్ని చేకూర్చి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు ‘దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే’ అన్నాడు.
కష్టాల్లో మనసు కలత చెందకుండా, సుఖాల్లో అతిగా ఆశపడకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడన్నది భావం. విధి నిర్ణయాన్ని మనం మార్చలేం. కాలం అనే చక్రం తిరుగుతున్నప్పుడు రాత్రి, పగలు, ఎండ, వాన వస్తాయి, వెళ్తాయి.
ప్రకృతిలో ఈ మార్పులు ఎలాగైతే సహజమో, జీవితంలో ఆనందాలు, విషాదాలు కూడా అంతే సహజం. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి, కష్టాల గురించి ఫిర్యాదులు చేయడం మానేసి, తన అంతర్గత శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెడతాడు.
గాలికి చెట్టు ఊగుతుందే కానీ వేరు కదలదు. అదే స్థితప్రజ్ఞతకు నిదర్శనం. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా హృదయం చలించకూడదు, భయాలకు లోనవకూడదు.
ఈ గుణాన్ని అలవర్చుకున్న వ్యక్తే నిజమైన విజేత. విధి నిర్ణయాన్ని శిరసావహించి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే మనోస్థైర్యమే జన్మకు సార్థకతను చేకూరుస్తుంది. ఈ నిశ్చలత్వమే పరమార్థం, ఇదే జీవన పరమ గమ్యం.
అననుకూల పరిస్థితుల్లో నిరుత్సాహంతో కుంగిపోకుండా భగవంతునిపై భారం వేసి కర్తవ్యాన్ని నిర్వహించాలి. మేధను మించినది విజ్ఞత. బాహ్య ప్రపంచంపై మనకు అధికారం లేదని గుర్తించడమే విజ్ఞత.
విధి అనేది సముద్రం అనుకుంటే.. అలలను మనం నియంత్రించలేం, కానీ ఆ అలలపై ప్రయాణించే పడవను ఎలా నడపాలో నేర్చుకోవచ్చు. ఒక విపత్తు సంభవించినప్పుడు కుంగిపోవడం బలహీనతకు నిదర్శనం.
దానికి బదులుగా, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించడమే స్థితప్రజ్ఞతకు తొలి అడుగు. ఈ నిబ్బరమే మనిషిని మహోన్నతుడిగా మారుస్తుంది.
No comments:
Post a Comment