Sunday, November 6, 2022

పరిణితి చెందిన వ్యక్తి ఎలా ఉంటారో ఈరోజు తెలుసుకుందాం

 పరిణితి చెందిన వ్యక్తి ఎలా ఉంటారో ఈరోజు తెలుసుకుందాం

వయసుతో పాటు మాటలో, ప్రవర్తనలో వృద్ధి చెందాల్సిన లక్షణం పరిణతి. ఇది నాణానికి ఒకవైపే దానితోపాటు సత్సంబంధాలు ఇంటా బయటా ఏర్పరచుకోవాలి. వాటిని దీర్ఘకాలం కాపాడుకోవాలి. ఇది నాణానికి రెండోవైపు. వ్యక్తిత్వం పారదర్శకంగా ఉండాలంటే, అంతరంగ దర్పణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆలోచనలు, భావాలు పారదర్శకంగా ఉన్నప్పుడే బింబం (అంతరంగం), ప్రతిబింబం(బాహ్యం) ఒకటిగా ప్రకాశిస్తాయి.

శ్రీరాముడు సుగుణాభిరాముడు రామ వనవాసంతో ప్రధాన రామాయణ గాథ ఆరంభమై, రావణ సంహారంతో, రామ పట్టాభిషేకంలో అంతమవుతుంది. ఈ రెంటి రాముడి మనో పరిస్థితి ఏమిటి? ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మధ్య భార్యను కోల్పోయాడు. అడుగడుగునా కష్టాలే. అయినా ఎక్కడా వాటి తాలూకు నైరాశ్యం రాముడి వదనంలో కనిపించదు. ప్రతి సందర్భంలోనూ సహనం, సౌశీల్యాలతో పరిణతిని ప్రదర్శిస్తూ ఎన్నో ఇక్కట్లను దాటాడు. వినడం, నమ్మడం, నమ్మకాన్ని పొందడం- రాముడి పరిణతికి చిహ్నాలు.. ఇవి ఏ వ్యక్తికైనా ఆత్మవికాసాన్ని కలిగిస్తాయి. 

మన లోపాల్ని ముందు మనం అంగీకరించాలి. అప్పుడే ఇతరుల లోపాలను అవగతం చేసుకోవడం అలవాటవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించ గలిగేవారు బంధంలోనైనా ఇమిడిపోగలుగుతారు. పరిణతికి అడ్డుపడే తొలి అవరోధం అసూయ . అసూయాపరులు ఎప్పుడూ ఏకాకులుగానే మిగిలిపోతారు. మృదువైన పలకరింపు, పరస్పర అభినందన, ప్రోత్సాహం, అప్యాయతలు పరిణతిని ప్రకాశింపజేస్తాయి. ఇవి ఉన్నప్పుడు అసూయ అనే పొర వైదొలగి పోతుంది. ప్రేమ పంచడం, ప్రేమను పొందడం తెలుస్తుంది. పరిణతి పరిఢవిల్లుతుంది. మనిషికి మనిషికి మధ్య మమతల చిగుళ్లు వేస్తాయి.

ఎదుటివారిని యథాతథంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. అలా స్వీకరించ లేకపోవడం మానసిక వ్యాధి అంటారు నిపుణులు .తరచూ ఇతరులకు సలహాలు ఇవ్వడం, ఆజమాయిషీ చేయడం వల్ల మానవ సంబంధాలు మొహం చాటేస్తాయి. కాలమాన పరిస్థితులను బట్టి జీవన విధానం మారుతుంది. బాహ్య రూపాలూ మారతాయి. స్థాయీ భేదాలు మారతాయి. వీటితోపాటు పరిణతి మారుతుంది. ఆ మార్పులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే శాశ్వతమైన విలువలు నిలకడగా ఉండాలి. వాటిని పాటించాలి. పాత్ర __మారడం వల్ల పాయసం, కట్టెలు మార్చడం వల్ల అగ్ని మారవు కదా! అలా

బాహ్య ప్రలోభాల వల్ల అంతరంగ పరిణతి దిగజారకూడదు. దినదిన ప్రవర్ధమానం కావాలి. వాక్కులో శక్తి, అనురక్తి, శుద్ధి ఉండాలి. ఈ మూడూ పరిణతికి ప్రమాణాలు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో సమాత్మా అనే నామానికి రాగద్వేషాదుల వల్ల దూషితం కాని మనసు కలవాడు, సమః అనే నామానికి సర్వ కాలాల్లో సర్వ వికారరహితుడు అని ఆదిశంకరులు వ్యాఖ్యానించారు. పరిణతికి _ఇంతకుమించిన ఉదాహరణలు చెప్పగలమా?.

జీవన విధానాన్ని బట్టి అతను ఎలాంటి వ్యక్తో చెప్పవచ్చు. అంతరంగంలో ఆశావాదం నిండి నిస్వార్ధంగా ఉండాలి. అలాంటి వ్యక్తి బయటా ఆనందంగా ఉంటాడు. తన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటాడు. అప్పుడే ఎవరూ దొంగిలించ గలవికాని ఆధ్యాత్మిక సంపద(పరిణతి) వృద్ధి చెందుతుంది. 

- ఎం.వెంకటేశ్వరరావు
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment