Wednesday, November 16, 2022

దుష్కర్మ-సుకర్మ

 దుష్కర్మ-సుకర్మ

సాధకుడు తన కుటీరంలో తాను ప్రశాంతంగా జీవించాలి.
కనీస అవసరాలకై కనీస కర్మ చేస్తే చాలు. 
మనం Limited గా ఉంటే, సుఖం Un-Limited గా లభిస్తుంది.
మనం అనవసరంగా అవసరాలను పెంచేసుకున్నాం. 

ఏ కర్మ మరో కర్మకు దారితీస్తుందో ఆ కర్మ దుష్కర్మ.
ఏ కర్మ అకర్మకు(జ్ఞానానికి) దారి తీస్తుందో ఆ కర్మ సుకర్మ. 

* * * 

ప్ర: మిగతావాటిని పొందటానికి ప్రయత్నం అవసరమేగాని,
దేవుణ్ణి పొందటానికి ఏ ప్రయత్నమూ అవసరం లేదన్నారు గురువుగారు. మరి పూజలు చేస్తున్నాం...నైవేద్యాలు పుడుతున్నాం...!

జ: మనం పెట్టే నైవేద్యాలకు మోసపోయేవాడు కాడు భగవంతుడు.

ప్ర: ఇంతకీ మన పని ఏమిటి?

జ: ఏమీలేదు.

ప్ర: మరెందుకు ఇంత జనాలు సృష్టింపబడ్డారు?

జ: కనబడేదంతా కల. కనేవాడొక్కడే సత్యం.
అమృత కూడా నీవు కనే కలలో భాగమే.

ప్ర: అయితే నేనెవర్ని?

జ: కలను కనే నీవే నీవు.

ప్ర: నేను చేసేది ఏమీ లేనప్పుడు 
నేనెందుకు ఈ భూమ్మీదకు వచ్చాను?

జ: ఆయన పనిగా మీరొచ్చారు. 
మీ పని ఏమీ లేదిక్కడ.

ప్ర: ఆయనకు ఏం పని?

జ: తెలియదు. 
నీకు ఇష్టమున్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం 
పూర్తయ్యే తీరుతుంది.....అంటారు భగవాన్.

ప్ర: కనిపించేదానిని కల అంటున్నారు.
కనబడనిదానిని ఆత్మ అంటున్నారు.
ఏమీ అర్థం కావడం లేదు...

జ: నీకు ఏది అర్థమౌతున్నదో అది మాయ.
నీకు ఏది అర్థం కావడం లేదో అది ఆత్మ.

ప్ర: దానిని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి కదా!

జ: ధ్యానం వలన తెలియదు.

ప్ర: మీరేమైనా దీక్ష తీసుకున్నారా?

జ:  ఏ సాధనా చేయకూడదని దీక్ష తీసుకున్నాను.

ప్ర: మరి ఎలా తెలుస్తుంది ఆత్మ గురించి?

జ: తెలియబడేదంతా మాయే.
ఆత్మ తెలియబడదు.
ఇదే ఆత్మజ్ఞానం.

ప్ర: ఇంతకీ మన కర్తవ్యమేమి?

జ: ఏ కర్తవ్యమూ లేకపోవడమే మన కర్తవ్యము.

ప్ర: ఏ ప్రయత్నమూ అవసరం లేదా?

జ: నీ పుట్టుకలోనే నీ ప్రయత్నం లేదు...
జీవితంలో నీ ప్రయత్నం ఎలా ఉంటుంది?

ప్ర: మరి జరిగేదంతా దేవుడే చేస్తున్నాడా?

జ: అవును.

ప్ర: నేను అరుణాచలం రావడం కూడానా...?

జ: అవును.

అరుణాచలం పెద్ద అయస్కాంతం.
మీరొక గుండుసూది.

నేను అరుణాచలం వెళ్లాను అని తాను కర్తగా చెప్పడం అజ్ఞానం.
అరుణాచలేశ్వరుడే నన్ను తన వద్దకు రప్పించుకున్నాడు
అని ఈశ్వరుణ్ణి కర్తగా చేసి చెప్పడం జ్ఞానం.

అమృత: నిజం.

* * *
ఇప్పటివరకు పరాన్ని ఇహంగా చూస్తున్నాం.
ఇప్పట్నుంచి ఇహాన్ని పరంగా చూస్తే సరి.
ఇప్పుడే ఇక్కడే ఉన్నపళంగా ముక్తి లభ్యం.

నిర్మొహమాటంగా చెప్పాలంటే-
ఇప్పుడే ఇక్కడే పొందటం మనకు ఇష్టం లేక
ఎప్పుడో ఎక్కడో అంటూ వాయిదా వేస్తున్నాం; దూరం చేస్తున్నాం.

అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు.
కొడుకు బాగుండాలి, కోడలు ముండ మోయాలి అంటే కుదరదు.
బ్రతికుండగానే, మరణభీమా పొందాలంటే కుదరదు.

ఒకటి కావాలంటే, మరొకటి వదులుకోవాలి.
ఒకటే కోరుకో...లోకమా? లేక లోకేశుడా?
ఏకకాలంలో బొమ్మ బొరుసును చూడలేవు.
ఏకకాలంలో నదికి ఇవతలి గట్టున, అవతలి గట్టున ఉండలేవు.
ఏకకాలంలో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు.
సర్వేశ్వరుడు కావాలంటే, సర్వాన్ని వదలాలి.

కనుక అమృతతో సహా సర్వాన్ని వదిలేసి  అచలంగా ఉండండి.

***

No comments:

Post a Comment