✍🏽 నేటి కథ ✍🏽
బంగారు పళ్ళెం
ఒక ఊరిలో సాహు, శీను, అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని రెండు భాగాలగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి, మధ్యాన్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటి పడక్కరలేదు.
ఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుడెసెలో ఒక అవ్వ, ఆవిడ మనవరాలు ఉండేవారు. మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ – అంత డబ్బు పాపం అవ్వ దగ్గిర లేదు.
“నా దగ్గిర ఒక పాత పళ్ళం ఉంది, దానికి మసి పట్టుకుంది, కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా?” అని అవ్వ సాహుని అడిగింది.
సాహు పళ్ళం తీసుకుని చూసాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం! చాలా విలువైనది. సాహుకి దురాశ కలిగింది. “ఈ పళ్ళమా! ఇది దేనికి పనికొస్తుంది! పూర్తిగా మసి పట్టుకు పోయింది! దీనికి గాజులు రావు కాని, కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో!” అన్నాడు.
అవ్వ పాపం పళ్ళం తీసుకుని వెళ్లి పోయింది. సాహు మళ్ళీ మర్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోక పొతే ఇంకొంచం ధర పెంచి తీసుకోవచ్చు, అనుకుని వెళ్ళిపోయాడు.
ఒప్పందం ప్రకారం మధ్యాన్నం అటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళం తీసుకుని గాజులివ్వమని అడిగింది. శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళం అని తెలుసుకున్నాడు. కానీ శీను మంచి వాడు. వెంటనే అవ్వతో, “ఇది బంగారు పళ్ళం అమ్మా! ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దగ్గిర లేదు. కాని మన సామంత రాజు దగ్గిరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దగ్గిర గాజులు కొనుక్కుని, మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు, నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు”, అని చెప్పాడు.
అవ్వ ఒప్పుకుంది.
విషయమంతా సామంత రాజుకి చెప్పారు. సామంత రాజు అవ్వ దగ్గిర పళ్ళం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శీను నిజాయితీని మెచ్చుకుని, కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు.
ఇక సాహు సంగతేమిటంటే, ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి, అతని దగ్గిర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్టపడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు కాని గిట్టుబాటు కాలేదు. వ్యాపారంలో నష్టము వచ్చి, మరే ఉద్యోగమూ దొరకక, ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది.
ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు.
No comments:
Post a Comment