Wednesday, February 8, 2023

🧘‍♂️93 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* 🕉 *మేధావుల నిర్లిప్తత*

 *🧘‍♂️93 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*
🕉

*మేధావుల నిర్లిప్తత*

కీర్తికాముకత్వము ఉన్నవారు తత్త్వజ్ఞానాన్ని ప్రేమించలేరు. మొదటిది ఇహలోకంతో ముడిపడ్డది; రెండవది చర్మచక్షువులకు కనిపించే ఈ లోకానికి అతీతమైనది. మానవాళిలో అధిక భాగం ఇహలోకంతోనే సరిపెట్టుకుంటుంది.

 కాకపోతే మానవుల్లోనే పలు రకాల శ్రేణులు, వారిలోనే తరతమ భేదాలు ఎన్నో కనిపిస్తాయి. సామాన్య ప్రజల దృష్టి యావత్తూ వసతి మీద ఉంటుంది. ఉండక తప్పదు కూడాను. ఇవి అవసరం లేని వారు ఎవరు? అయితే ఈ కనీసావసరాలు తీరగానే, మనిషికి సంఘంలో తన స్థానమేమిటి, దానిని ఎలా అభివృద్ధి పరచుకోవాలి అనే ఆలోచన ప్రారంభమవుతుంది.

 విద్యావంతులు, మేధావి వర్గాల వారికి వృత్తి ఉద్యోగాల ద్వారా కనీసావసరాలు అప్పటికి తీరే ఉంటాయి కాబట్టి, వారి కాంక్షలన్నీ భాగ్యమూ కీర్తి మొదలైన వాటిని చుట్టుముడుతాయి. ఇవి కూడా తీరిన కొందరు అదృష్టవంతులు ఇక ఇక్కడ సాధించవలసింది ఏమీ లేదు కాబట్టి “ఆధ్యాత్మికత” అనే దానిని సాధిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభవం కూడా పొంది చూద్దామనుకుంటూ ఉంటారు.

 మిగతా లౌకికానుభవాలతో విసిగినందు వల్ల ఈ ఆధ్యాత్మికానుభూతి ఎలాంటిదోనని 'ఐడిల్ క్యూరియాసిటీ'యే కానీ, ఇది వారిలో ఏర్పడిన నిజమైన ‘దాహం' కాదు; జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించిన కారణంగా ఏర్పడిన జిజ్ఞాస కాదు. ఈ తరహావారిలో జీవితంపట్ల నిజమైన “సీరియస్ నెస్” ఉంటుందని మనం భావించనక్కరలేదు.

సీరియస్ గా ఉండడమంటే గంభీరవదనంతో కనుబొమలు ముడివైచి దృక్కులు సారించడం, 'అధరము కదలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతు'డై ఉండడం', చిరునవ్వులేని విచారగ్రస్తమైన ముఖంతో తిరుగాడుతూ ఉండడం కాదు; 

ఒక విషయాన్ని పట్టువదలని విక్రమార్కునిలా తదేక దీక్షతో అన్వేషిస్తూ పరిశోధిస్తూ జీవించడం, విసుగూ విరామం లేకుండా రేబవళ్ళూ సంతోషంగా స్వేచ్ఛగా “టెన్షన్ ఫ్రీ"గా తన లక్ష్యాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకొని కృషిచేస్తూ ఉండడం 'సీరియస్ నెస్' అనిపించుకుంటుంది.

పెద్ద చదువులు చదివి, పదిమందిలో ప్రసంగించి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన వారు కూడా నే చెప్పేటువంటి సీరియస్ మనుషులు కాకపోవచ్చు. వీరిలో కొందరైతే భారతీయ వేదాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సుప్రసిద్ధ వేదాంతులు అయినప్పటికీ వీరికి ఆ చదివిన విషయాన్ని తమ జీవితాలలో ప్రయోగంచేసి చూడాలనిపించలేదు.

“ధనం సంపాదించడానికి వేయి మార్గాలు” అనే పుస్తకం రాసి దాని ద్వారా డబ్బు చేసుకుందామని ప్రయత్నించి విఫలుడైన మనిషిలాగా లోకమంతటికీ భారతీయ వేదాంత ప్రాశస్త్యాన్ని ప్రకటించి ఆ వేదాంతం ద్వారా స్వయంగా తామేమీ లాభం పొందలేని స్థితిలో పడుతూ ఉంటారు. 

హిందూమతం విశిష్టతను, ఔన్నత్యాన్ని దేశ దేశాలకూ తెలియజేసి ప్రసిద్ధ గ్రంథకర్తగా గొప్ప ఫిలాసఫర్గా, వక్తగా పేరొందిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర రాస్తూ మేధావి, చరిత్రకారుడు అయిన ఆయన కుమారుడు శ్రీ సర్వేపల్లి గోపాల్ ఇలా అంటాడు. 'మంచంలోనే ఉండిపోయిన ఆయన (తన తండ్రి) చివరి రోజుల్లో మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయనే ఒకప్పుడు అన్నట్లు 'మానసిక ఒంటరితనం' 'డిప్రెషన్'కు దారితీస్తుంది. వైఫల్యాన్ని కలగజేస్తుంది. మన మనసుకూ, దృష్టికీ ఒక లక్ష్యమంటూ, చేయతగిన పనంటూ ఏమీ కనిపించదు”

చరిత్రకారుడు శ్రీ గోపాల్ ఇంకా ఇలా రాస్తాడు: "బ్రిటిష్ ఫిలాసపర్ బెర్ట్రాండ్ రస్సల్ లాగానే, ఈయన (శ్రీ రాధాకృష్ణన్) కూడా జీవితానికి అర్థమేమిటో కనుగొందా మనే, ఫిలాసఫీని అధ్యయనం చేశారు. 

ఈ లోకాన్ని గురించి ఆయనకో శక్తివంతమైన తీక్షణమైన దర్శనం (Vision) ఉండేది. కానీ ఇది 'దైవం ద్వారా బయల్పడిన రహస్య విషయం [Divine revelation] అనే దానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యమివ్వలేదు. 

అందువల్ల ఈ ఫిలాసఫీ అనేది కేవలం ఈశ్వర విషయకమైన దాని పనికత్తె (Handmaid of Theology] అని గ్రహించక, ఫిలాసఫీ మనిషి చిత్తము, ఇచ్ఛపై ఆధారపడి [autonomous) ఉన్నదని భావించారు" అంటారు శ్రీ గోపాల్.

పండిట్ నెహ్రూ, రవీంద్రనాథ్ టాగోర్ మొదలైన వారిచేతగాక, ప్రపంచ మేధావులందరిచే కీర్తింపబడిన శ్రీ రాధాకృష్ణనన్ను ఈ శతాబ్దపు ప్రముఖ వేదాంతిగా మనం పరిగణించక తప్పదు.

 కానీ ఆత్మజ్ఞానం ఆర్జించే బదులు ఫిలాసఫీని కూలంకషంగా అధ్యయనం చేసినందువల్ల కీర్తి దక్కిందే కానీ, మనశ్శాంతి లభించలేదు. ఒక టన్ను ఫిలాసఫీకన్నా, ఒక ఔన్సు ఆత్మజ్ఞానం మనిషికి సుఖశాంతులు, స్థిరత్వం, దృఢత్వం ప్రసాదించగలదని ఆయనకు తట్టకపోయినందుకు మనకొకింత విచారం కలుగుతుంది.

రాధాకృష్ణన్ మార్గం వేరనేది, అందరికీ అంతకు మునుపే తెలుస్తూ ఉండే దనుకుంటాను. శ్రీ రమణాశ్రమ లేఖల్లో శ్రీమతి నూరి నాగమ్మగారు ఇలా తెలియజేస్తారు: “నిన్న ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారు, కుటుంబంతో వచ్చారిక్కడికి. వారంతా భగవాన్ దర్శనం చేసుకుని అరుణాచలేశ్వరాలయానికి వెళ్ళి వచ్చి, భోజనానంతరం కొంచెం విశ్రమించి సాయంత్రం మూడింటికే ఊరికి వెడతామని బయలుదేరి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి సెలవడిగారు. 

భగవాన్ ప్రసన్నతతో తల ఊపారు. ఆడవారితో కలిగిన పరిచితివల్ల కారు వరకూ సాగనంపి వచ్చాను. నేను కూచోగానే, “ఏం వెళ్లారా, వారంతాను?” అన్నారు భగవాన్. “వెళ్ళారు” అన్నాను. “వీరు పదేళ్ళకిందట ఒకసారి వచ్చి వెళ్ళారు. ప్రణవానంద స్వామికి వేలు విడిచిన అన్న కుమారుడే” అన్నారు భగవాన్. "అట్లాగా?” అన్నాను.

ఇంతలో నా పక్కన కూచున్న యూరోపియన్ స్త్రీలూ, గుజరాతీ స్త్రీలూ, 'రాధాకృష్ణన్ భగవాను ఏమైనా ప్రశ్నించారా? భగవాన్ ఏమి సెలవిచ్చారు?" అని మెల్లగా హిందీలో నన్నడగడం భగవాన్ గమనించి, “ఏమది?” అన్నారు. 'రాధాకృష్ణన్ భగవాన్నేమైనా ప్రశ్నించారా?” అని అడుగుతున్నారు, అన్నాను. “అదా, వారంతా బాగా చదివినవారు. విషయమంతా తెలుసుకునే ఉన్నారు. ఏమడుగుతారు?” అన్నారు భగవాన్.

“లోగడ వచ్చినప్పుడు ఏమైనా ప్రశ్నించారా?” అన్నారొక ఆంధ్రులు. “ఊహు. అప్పుడూ ఇంతే. ప్రణవానందుల ద్వారా మన విషయమంతా విని వారితోనే వచ్చారు. వచ్చి కూర్చున్నారంతే. పెదవి కదపలేదు" అన్నారు భగవాన్.

"బయట అంతంత ఉపన్యాసాలిస్తారు కదా, ఇక్కడ ఏమీ చర్చించక పలక్కుండా కూర్చున్నారెందువలనో” అన్నారా భక్తులు.

భగవాన్ నవ్వుతూ, “1938లో రాజేంద్ర ప్రసాదు ఇక్కడికి వచ్చారు. వారూ అంతే. నాల్గయిదు రోజులున్నా ఒక్కసారైనా ప్రశ్నించలేదు. పలక్కుండా పిల్లిలాగా కూచునేవారు. వెళ్ళేటప్పుడు మాత్రం 'మహాత్మునికి ఏమి సందేశం ఇస్తారని అడిగారు. అంతే అదీ పక్కనున్నవారి చేత అడిగించారు" అన్నారు భగవాన్.

రమణ మహర్షి వద్దకొచ్చినప్పుడు ఈ మేధావివర్గం ఆయనతో మాట్లాడదగింది ఏమీలేదని ఊరుకునేవారో, తీరా మాట్లాడితే తాము ధరించే 'సర్వజ్ఞత్వపు’ శాలువలోని చిరుగులేమైనా కనిపిస్తాయేమోననే సంకోచమో మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ వీరి మూగనోము వెనకాల ఏదో ఇరుకు, ఇబ్బంది ఉన్నట్లు మనం గ్రహించగలం.

'మహాత్మునికి మీ సందేశమేమిటన్నప్పుడు రమణుడు ఆ ప్రశ్నను ఎంత అలవోకగా పక్కకు నెట్టేశాడో, ఆనాటి రాజకీయ ప్రముఖులు జ్ఞానజ్యోతి అయిన శ్రీ రమణుడికి ఎలా దూరం తొలిగేవారో, రాబోయే వ్యాసంలో తెలుసుకుందాం. 

No comments:

Post a Comment