Wednesday, February 8, 2023

ఈ నేరం ఎవ్వరిదని...!

 *ఈ నేరం ఎవ్వరిదని...!*
------------------------------------
నువ్వలా లేవు కదూ ఇంతకుమునుపు?
పల్చటి పెదాల్లోంచి చల్లని చిరునవ్వు!
మనసెల్లా ఆహ్లాదం చిందెలా
ఆ కళ్ళలో ఉత్సాహపు మెరుపు!
నవ్వే పెదాలూ, మెరిసే కళ్ళూ!!
ఒక్కసారిగా నీలోని పరిమళమేదో
చుట్టుకొని పరవశింపజేసేది!
మా ముఖాల్ని నీకళ్ళలో చూసుకునేలా
స్వచ్ఛమైన పారదర్శకత!!
కల్మషం లేదు కదూ ఇతనిలో
అని అందరికీ తెలిసేట్టు!
నువ్వు ఉన్న పరిధిలో ఆనందం చిందులు వేసేది.
నువ్వలా లేవుకదూ ఇంతకుమునుపులా?
ఏమయ్యింది నేస్తం?
నాకు దిగులుతో గుండె పగిలే జవాబు
ఇప్పటి నీ నవ్వు!
పాల నురుగులాంటి నీ నవ్వల్లా
పాము కుబుసంలా పొరలుపొరలుగా ఇప్పుడు!
దర్పణం లాంటి నీ ముఖం,
నేడు మసకేసిపోయిందేమిటి?
ఎన్ని కఠోర వాస్తవాలు చవిచూశావో,
ఎన్ని ఘోర సంఘటనలు వీక్షించావో
ఎంత దుఃఖించావో,
ఎంత తిరగబడ్డావో
ఎంతగా అణచబడ్డావో
మరెంతగా అలసిపోయావో
నువ్వు అటు తిరగేసి కళ్ళు తుడుచుకోకు
నువ్వు మారిపోతే ఆ నేరం ఎవరిదని
వెఱ్ఱి ప్రశ్న కుదిపేస్తుంది!
లోకంలోని దుర్నీతి
నిను ఖిన్నుణ్ణి చేసింది కదూ?
ఏమంటాంలే ఓ నేస్తం నిన్ను !
మాకూ వాటా ఉంది 
ఈ నేరంలో!
మాదీ భాగం ఉంది
ఈ పాపంలో!
అవునులే నేస్తం,
నిన్నేమీ నిందించలేం,
చిన్నవాడివి,పసి మనస్సు నీది!
లోకంచే వంచితుడివి,
శోకంచే బాధితుడివి,
ఇదంతా మన ఖర్మ,
తిరిగి రాలేనిది ఈ జన్మ
అంతేలే నేస్తం
ఇదింతేలే!!
------ *దండమూడి శ్రీచరణ్*
9866188266

No comments:

Post a Comment