🪔🪔 సత్య ధర్మాల ప్రతిరూపాలు🪔🪔
🌹మంచి మాటకు మంచి పనికి మించిన ధర్మం లోకంలో లేదంటారు. మనిషికి మానవతా ధర్మాన్ని మించిన ఆభరణం లేదని చెబుతారు. మనసు మంచిదైతే, మనిషి మాటా చేతా ఆ బాటలోనే సాగుతాయి. ఆ మనసే అడ్డదారి పడితే, బతుకు బండి బోల్తా కొడుతుంది. మనిషి అంటే మనసున్న వాడన్న గీతార్ధం మానవ ధర్మానికి గీటురాయి.
🌹ఉపకారం, అపకారం రెండూ మనిషి చేతుల్లోనే ఉన్నాయి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అన్న జీవన సూత్రాన్ని అందించడానికే వ్యాసుల వారు మానవచరితమైన మహాభారత సంహిత రచనకు పూనుకొన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని చెప్పడమే ఆ రచనోద్దేశం.
🌹సత్యం పలకమని ధర్మం పాటించమని వేద వాఙ్మయం చెబుతోంది. వేదం తొలి చదువు, సత్యధర్మాలు వేరు కావని, ఒకే కొమ్మ కాయలని తొలి చదువులు చెబుతున్నాయి.
🌹పూవు తావిలాగా సత్యధర్మాలు జంటపదాలుగా తాము ఒకే నాణిపు బొమ్మ-బొరుసు అని చాటి చెబుతున్నాయి. ఒక మంచి ఆలోచనను అమలు చేయడమే సత్యధర్మాల ఆచరణకు ఒక చక్కని ఉదాహరణ. సత్యమే జయిస్తుంది. ధర్మమే గెలుస్తుందని రామాయణ భారతాలు రుజువు చేశాయి. రాజధర్మం మొదలు మానవధర్మం వరకు శాస్త్రాలు పద్నాలుగు ధర్మాలను ప్రతిపాదించాయి.
🌹త్యాగాన్ని మించిన ధనం, దానాన్ని మించిన గుణం లోకంలో లేవు. శిబి చక్రవర్తిని మించిన త్యాగధనుడు, బలి చక్రవర్తిని మించిన దాత ఉండరు. వారు మానవజాతికి మార్గదర్శకులుగా చరిత్రలో నిలిచిపోయారు. సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు ఆచంద్రతారార్కం మానవ హృదయాల్లో గూడుకట్టుకుని ఉంటారు.
🌹కాలాన్ని బట్టి సత్యధర్మాలు మారవలసిందే అంటారు దర్మధ్వజులు. పాటించకపోయినా పటాటోపంగా ప్రదర్శనలు చేపట్టేవారిని ధర్మధ్వజులు అంటారు.
🌹ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పవచ్చునని శుక్రనీతి బోధిస్తోంది.
🌹స్త్రీ, వివాహం, ప్రాణం, ధనం, మానం, ప్రమాదంలో పడ్డ సమయంలో బొంకవచ్చు.
🌹రాజనీతికి, శుక్రనీతికి చుట్టరికం ఉండవచ్చు. గురువు ద్రోణాచార్యులు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. పోరు | ఘోరంగా పరిణమిస్తోంది. అపజయం కన్నా ఆడి తప్పినా ఫరవాలేదన్నాడు ఆపద్బాంధవుడు.
🌹కురుక్షేత్రంలో సమయానికి సరిగ్గా, అశ్వత్థామ అన్న పేరున్న ఏనుగు చనిపోయింది. సమయస్ఫూర్తితో ధర్మరాజు 'అశ్వత్థామ హతః' అని గట్టిగా, 'కుంజరః' అని మెల్లగా పలికాడు. ఆ మాట చెవిన పడగానే తన కొడుకు చనిపోయాడనుకొని ద్రోణాచార్యులవారు. ప్రాణాలు వదిలారు. ధర్మరాజు అటూ ఇటూ కాకుండా అర్ధ సత్యం చెప్పినందుకు తగిన శిక్ష అనుభవించక తప్పలేదు.
🌹నిజం నిప్పులాంటిది. ధర్మం పర్వతం లాంటిది. నిజం దాగదు. ధర్మం మారదు. ప్రియమైన సత్యం పలకవచ్చు. అప్రియమైన సత్యాన్ని చెప్పకపోవడం మంచిది అంటున్నది లౌకికవాదం.
🌹ఒక సాధువు- చూసే కళ్లు చెప్పలేవు, మాట్లాడే పెదాలు చూడలేవు అని తన లౌక్యంతో ఒక ప్రాణం కాపాడాడు. చట్టానికి భయపడి సత్యానికి, ధర్మానికి దూరంగా ఉండిపోతే సమాజం నైతికంగా దిగజారిపోతుంది. అన్యాయం, అధర్మాలను చూస్తూ తటస్థంగా ఉండిపోవడం అసమంజసమే అవుతుంది. సమాజంలో అసత్యం, అధర్మం, పెరగడానికి స్వార్థం, పేరాశ మూల కారణాలు.
🌹మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు రాగద్వేషాలు.
🌹మంచితనానికి మించిన ధర్మం లేదు.
🌹మంచిమాట, మంచి చేత- విడివిడిగా చూడవలసిన అవసరం లేదు.
🌹 సత్యధర్మాలు పడుగుపేకలు... సత్కర్మ సత్యానికి, సద్ధర్మం ధర్మానికి చిరునామాలు.
🌹నలుగురికి హితమైన మాటే సత్యం. నలుగురూ మెచ్చిన పనే ధర్మం.
🌹మంచిమాట, మంచిచేత- సత్యధర్మాల ప్రతిరూపాలు.
✍️ఉప్పు రాఘవేంద్రరావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment