Tuesday, February 14, 2023

విషయధ్యాస

 *అంతర్యామి - 30*
       🥀 *విషయధ్యాస* 🥀      
          ✍️ *డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

సాంగత్యం మానవ సమాజానికి సాధారణం. సాంగత్యం లేకుండా మనిషి జీవించలేడనేది యధార్థం. సాంగత్యానికి ప్రధాన ధర్మం - కలిసి జీవించడం. ఎవరితోనూ కలవకుండా మనిషి బతకలేడు కనుక పుట్టినప్పటినుంచీ అందరితోనూ కలిసిమెలసి ఉండటం, పరస్పర సహకారాన్ని కోరడం పరిపాటి. పసితనంలో తల్లితో కలిసి బతకాల్సిందే. విద్యాబుద్ధులు నేర్చుకునే ప్రాయంలో గురువులతోనూ తోటి విద్యార్థులతోనూ సాహచర్యం తప్పదు. పెళ్లయిన తరవాత భార్యతోను, పిల్లలతోను సహజీవనం అనివార్యం. ముసలిత నంలో పిల్లలెవరూ దగ్గర ఉండకున్నా, జీవిత సహధర్మచారిణితో కలిసి బతుకు వెళ్లదీయవలసిందే. ఇలా ఏ దశలోనూ మనిషికి సాంగత్యం లేకుండా పూట గడవనే గడవదు.

ఈ సాంగత్యం ఎలా ఉండాలి అన్నదానిపై అనాదికాలంగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు చెబుతూనే ఉన్నారు. ఎన్ని చెప్పినా మనిషికి అశాంతి మాత్రం తప్పడం లేదు. ఏదో వెలితి ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. తృప్తి లేనే లేదు. సంతృప్తి ఎన్నటికీ రాదు, ప్రశాంతత గగనకుసుమమైపోతోంది. 

మానవుడికి చెందిన ఈ గందరగోళానికి భగవంతుడు తానే స్వయంగా సమాధానాలు చెప్పాలనుకొన్నాడు. ఆ మానవుడికి ప్రతినిధిగా అర్జునుణ్ని ఎదుట నిలుపుకొని ఎన్నో మార్గాలను ఉపదేశించాడు భగవద్గీతలో. వాటి సారాంశం ఇలా ఉంది.-

'అర్జునా! నీలో మానవ సహజమైన ఆందోళనలు ఎన్నో ఉన్నాయి. వాటి కారణంగా నీవు యుక్తాయుక్త విచక్షణను కోల్పోతున్నావు. ఏది ధర్మమో, ఏది అధర్మమో నీకు తెలియడంలేదు. అందువల్లే నీలో అశాంతి ఏర్పడింది. నీకు ద్వైదీభావం (సంశయాత్మక స్థితి) పనికిరాదు. నీ భావనలో స్పష్టత ఉండాలి. నీవు చేసే పనిలో నిర్దుష్టత (ఏ దోషాలూ లేనితనం) నెలకొనాలి అప్పుడే నీలో శాంతి ఏర్పడుతుంది. గమ్యం దొరుకుతుంది. నీలాగే మానవులందరూ సంశయాల్లోనే మగ్గిపోతూ జీవితాలను అశాంతిమయాలుగా మార్చుకొంటున్నారు.

మనుషులు మొదట విషయధ్యాసల నుంచి దృష్టిని మరలించాలి. విషయాలంటే సంగతులు కోరికలు. అవి పెరుగుతున్న కొద్దీ అశాంతి కూడా పెరుగుతూనే ఉంటుంది. మనిషిని వెంటాడే ఆరుగురు శత్రువులున్నారు. వారే *"కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు."* ఆ శత్రువుల వల్లనే విషయధ్యాస (ప్రతిదాని పైన అమితాసక్తి) ప్రారంభం అవుతుంది. కామం అంటే కోరిక. క్రోధం అంటే కోపం. లోభం అంటే వ్యామోహం. మోహం అంటే అనురక్తి, మదం అంటే కండకావరం. మాత్సర్యం అంటే ఓర్వలేనితనం. ఈ ఆరింటిపైనా మనిషి తన ధ్యాసను నిరంతరం లగ్నం చేయడం వల్లనే అశాంతులు పెరిగిపోతు న్నాయి. స్త్రీలను కామవాంఛతో చూడటం, డబ్బును విలాసాలకోసం వాడటం, సంపదలను అపారంగా కూడబెట్టడం వల్లనే సమాజంలో అశాంతులు రగులుకొంటున్నాయి. స్త్రీ -  సహజీవన సౌందర్యాధి దేవత. ఆమె వల్లే వంశాలు అభి వృద్ధి చెందుతాయి. గృహం అంటే గృహిణి. ఆమె లేకుంటే సమాజమే లేదు. ఆమెపై కామవాంఛ అసలే పనికిరాదు. డబ్బు మనిషి అవసరాల్లో ఆదుకునే సాధనం. దాన్ని ధర్మాచరణ కోసం వినియో గించాలే తప్పు వ్యసనాలకు ఖర్చు చేయకూడదు.

ఎన్ని సంపదలను కూడబెట్టినా మరణ సమయంలో పూచికపుల్ల కూడా వెంటరాదు. చివరికి మనిషి తన శరీరాన్ని కూడా ఈ లోకంలోనే వదిలివెళ్లాలి. ఏమీ తీసుకొని పోనిదానికోసం అపారంగా సంపదలు కూడబెట్టటం ఎందుకు?

పెరిగిపోతున్న సంపదల వల్ల అహంకారం కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. కన్నూమిన్నూ కానని దుస్థితి దాపురిస్తుంది. అందువల్ల దేనిపైనా అనారోగ్యకరమైన అత్యంతాసక్తి పనికిరాదు. డబ్బు సంపాదించాలి ధర్మబద్దంగా. స్త్రీ సాహచర్యాన్ని కోరాలి ధర్మబద్ధంగా, సంపదలను పెంచుకోవాలి ధర్మబద్ధంగా, ధర్మానికి విరుద్దంగా ఏది చేసినా అశాంతికి మూలం అవుతుంది. మనిషికి మనిషి ఎదురైనప్పుడు 'ఏమిటి సంగతి?' అని ప్రశ్నిస్తాడు. అలా అడిగినపుడుచెప్పడానికి మంచి సంగతులు ఉండాలేకాని- ఒకరి కొంపను కూల్చమనో, ఒక స్త్రీని చెరబట్టమనో, అక్రమంగా ఆర్జించమనో చెప్పకూడదు. ఇదే నైతిక జీవనం అంటే. 

చెడు విషయాలు శత్రువులు. మంచి సంగతులు మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, మార్గదర్శకులు. విషయధ్యాస ఎలా ఉంటే అలాంటి ఫలితమే లభిస్తుంది. భగవంతుని చరా చర . సృష్టిలో 'యుక్తాయుక్త విచక్షణ' అనే అమూల్య వరం కలిగిన భాగ్యజీవి మనిషి. అలాంటి భాగ్యాన్ని దౌర్భాగ్యంగా మార్చుకుంటే, ఇక మనిషిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ సత్యాన్ని అనుక్షణం మనిషి గుర్తుంచుకోవాలి.

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*Courtesy* : *ఈనాడు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

No comments:

Post a Comment