"దానం" ఎలా ఉండాలో తెలుసుకుందాం
నదులు తమ జలాలను తాము త్రాగవు. చెట్లు తమ ఫలాలను తాము తినవు. తమ మూలంగా మొలకెత్తిన ధాన్యపు గింజల్ని మేఘాలు తినవు. సంపన్నులదనం ఇతరుల ప్రయోజనం కోసమే. దానం చేయడం మంచిదని అంగీకరించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి.దానం ఎప్పుడు ఇవ్వాలి? దీనికి మహాభారతంలోనే ఒక సంఘటన సమాధానం ఇస్తుంది. ధర్మరాజు తన వద్దకు దానం కోసం వచ్చిన ఒక బిచ్చగాడితో మర్నాడు రమ్మని అంటాడు. అక్కడే ఉన్న భీముడు తన అన్న మృత్యువును గెలిచారని సంతోషంతో గట్టిగా అరిచాడు. రేపు దానం ఇవ్వడానికి తాను జీవించి ఉంటాడని మా అన్నకు తెలుసు అని భీముని ధీమా. అప్పుడు ధర్మరాజుకు ఒక సందేశం వినిపిస్తుంది. రేపు దానం చేయడానికి తాను ఉంటాడో,ఉండడో దాతకు తెలియదు కాబట్టి అనుకున్న క్షణంల్లో దానం చేస్తే మంచిది. మరో ప్రశ్న ఎంత ఇవ్వాలి? చరిత్రలో ఒక ప్రసిద్ధ సంఘటన సమాధానం చెబుతుంది.రాణా ప్రతాప్ మొగల్ చక్రవర్తితో యుద్ధం చేసి ఓడిపోయాడు. తన సైన్యాన్ని సంపదను కోల్పోయాడు. అంతకన్నా ముఖ్యమైన ఆశను పోరాడాలన్న సంకల్పాన్ని కోల్పోయాడు.అటువంటి చీకటి క్షణాల్లో అతని వద్ద పనిచేసిన మంత్రి వచ్చి తన సంపాదనంతటిని అతడు చేతిలో పెట్టాడు. రాణా ప్రతాప్ తిరిగి సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ ప్రశ్నకు జవాబు "నీవు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు" అని ఇంకొక ప్రశ్న "ఏమి ఇవ్వాలి ధనమే కాదు. ఒక పువ్వు ఇవ్వవచ్చు. ఒక అగంతగుడికి చిరునవ్వు అందిస్తే అతడికి గత అనేక వారాల్లో అందని మేలు జరగవచ్చు. మనసుతో సద్భావంతో ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి?ఇది చిక్కు ప్రశ్న. సాధారణంగా చాలామంది దానం అడగడానికి వచ్చిన వ్యక్తిలో లోపాలు ఉన్నాయని, తప్పులు చేశాడని వంకబెట్టి దాన ఇవ్వరు. అతడు దానానికి అర్హుడు కాడని భావించి తోసిపుచ్చడం న్యాయం కాదు.న్యాయాన్యాయాలు బేరీజు వేయకుండా దానం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇది అటువంటి ప్రశ్నే. దానం స్వీకరించే వ్యక్తి అవమానం పాలు కాకుండా దానం చేసే వ్యక్తులు ఏదో ఇస్తున్నానని గర్వం వ్యక్తం కాకుండా ఇవ్వాలి.
కుడి చేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా ఇవ్వాలి. ప్రచారం అట్టహాసం లేకుండా చేసేదే అత్యుత్తమ దానం. దానం ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించే వ్యక్తి తాను అల్పుణ్ణి అని భావించడానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఇచ్చే ధనం మనకు చెందినది కాదు. ఈ ప్రపంచంలోకి సంపదలతో ఎవరూ రారు. సంపదలు తమతో తీసుకుని పోరు. ఆ సంపద మనతోపాటు కొద్ది కాలమే ఉంటుంది. మనకు చెందని దాన్ని ఇవ్వడంలో ఎందుకు గర్వపడాలి?వినమ్రత హుందాతనంతో దానం ఇవ్వాలి. ఎవరికైనా దానం అవసరమైనప్పుడు దాన్ని అడక్కుండానే అతనికి ఇవ్వాలి. చెయ్యి చాపి అడిగే స్థితికి దిగజారితే అతడి ఆత్మగౌరవం లాగేసుకున్నట్లే ఆత్మగౌరవం మనం ఇచ్చే దానం కన్నా ఎన్నో రెట్లు విలువైనది. దానం ఇచ్చిన తర్వాత ఎటువంటి భావన కలగాలి? ఏకలవ్యుడి కథ అందరికీ తెలిసిందే. తన గురువు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా, నిస్సంకోచంగా తన కుడి చేతి బొటనవ్రేలును నరికి సమర్పించుకున్నాడు. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. "బ్రొటనవ్రేలును ఇచ్చినందుకు నువ్వు ఎప్పుడైనా విచారించావా" అని అడిగినప్పుడు "ఒకసారి విచారించాను. తన కొడుకు అశ్వద్ధామ మరణించాడు అన్న అబద్ధపు వార్త విని ద్రోణుడు గుండె పగిలి ఏడుస్తూ పోరాటాన్ని నిలిపివేసినప్పుడు నేను దుఃఖ పడ్డాను. నేను బ్రొటనవ్రేలు పోగొట్టుకున్నానని బాధపడ్డాను. ఆ బ్రొటనవ్రేలు ఉంటే ఎవరూ కూడా నా గురువు పై బాణం ప్రయోగానికి సాహసించేవారు కాదు" అని ఏకలవ్యుడు సమాధానం చెప్పాడు. దానం ఇవ్వాలి. అయ్యో! అనవసరంగా ఇచ్చేశానని ఎప్పుడూ విచారించకూడదు. చివరి ప్రశ్న మన వారసులకు ఎంత సంపద ఇవ్వాలి? వారు శ్రమించి పనిచేసే అదృష్టాన్ని రూపుమాపుతున్నామా అని ప్రశ్నించుకోవాలి. శ్రమకు మించిన ఆనందం లేదు. ఏ పని చేసుకోవడానికి అయినా అవసరమైన సంపద ఇవ్వాలి. ఏమీ చేయకుండా సోమరులుగా ఉండేటంత ధనం ఇవ్వకూడదు. "ఇంటిలో సంపద గుట్టలుగా పెరుగుతున్నప్పుడు, పడవలోకి నీరు వచ్చి చేరుకున్నప్పుడు వాటిని రెండు చేతులతోనూ పట్టుకుని విసిరివేయాలి "అని భక్త కబీరు అంటాడు. ఆ మాటలే మనకు తరగని సంపద.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment