🌹సృష్టిధర్మము పుట్టుక మరణం 🌹 అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మరణం : పుట్టిన ప్రతివారికీ తెలుసు.
ఏ క్షణమైనా మరణిస్తామని. తెలియనిదొక్కటే...
అది ఏ క్షణమని. విచిత్రం ఏమిటంటే- ఎప్పుడనేది తెలియనిదొకటి అనుక్షణం మన వెనకే, మనతోనే ఉంటుందనేది. నీడకంటే నిజాయతీగా, శ్వాసకంటే సహజంగా, విడదీయలేని బంధంగా జీవితమంతా మనల్ని పెనవేసుకునే ఉంటుందనేది. మరి మరణం అనివార్యత గురించి తెలిస్తే మంచిదేనా? అది అనుక్షణ మరణం కాదా? కానీ... మరణం గురించి తెలియడం మంచిదేనేమో!*
ఈ లోకం నుంచే తప్పించే మరణం, అయినవాళ్లందరినుంచీ విడదీసే మరణం... అనుక్షణం గుర్తుచేస్తూ మన వెంట ఉంటే మంచిదెలా అవుతుంది?*
ఇక్కడే ఉంది అసలు కిటుకు.
వెళ్ళే మార్గంలో ఊబి ఉందని తెలిస్తే మనం ముందే జాగ్రత్త వహిస్తాం. దారి మార్చుకుంటాం. మరణం కూడా అలాంటిదే. దాని సమయం సంగతి కాకపోయినా సమాచారం తెలిస్తే అపమార్గం పట్టకుండా అప్రమత్తంగా ఉంటాం.
నిజానికి మరణం ఒక హెచ్చరికలాంటిది. జీవితం తాలూకు స్వల్పకాలిక అనుభవాన్ని, అశాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ ఉంటుంది. వర్షం వస్తుందనేది ముందుగా తెలిస్తే ఆరబోసిన ధాన్యాన్ని ఎత్తుకున్నట్లు మరణం శ్రేష్ఠమైన జీవనమార్గాన్ని ఎన్నుకుని అత్యుత్తమ జీవిత విధానాన్ని మలచుకునేందుకు ఉన్న స్వల్ప వ్యవధిని గుర్తుచేయడం ఒకటైతే, అనుక్షణం అమ్మలా మనల్ని అపమార్గం పట్టకుండా అడుగడుగునా హెచ్చరిక చేయడం మరొకటి. ఇలాంటి మరణం మన శ్రేయోభిలాషి కాక మరేమిటి?*
మరణం మనకు ఒక కాపలాదారు, సలహాదారు మాత్రమే కాదు. మరు జన్మను తీర్చి దిద్దుకునే క్రమంలో మార్గ సూచి కూడా.
జ్ఞానులు మహత్తర మరణం కోసం అన్వేషిస్తారు గాని, దాన్నుంచి తప్పించుకోవాలని చూడరు. ఎందుకంటే అనివార్యం అయినదాన్ని అత్యుత్తమ రీతిలో స్వీకరించడమే సముచితమని వారి ఉద్దేశం. ఆ శ్రేష్ఠ మరణం కోసం వారు జీవిత పర్యంతం కృషి చేస్తారు. ఈ సత్యానికి అనుగుణంగా బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆచరించి అనుభవించి అందరికీ తెలిపారు.
మన మరణం ఎలాంటిదన్నదే మనం ఎలా జీవించామన్న విషయాన్ని ప్రతిబింబిస్తుంది. మన జీవన విధానమే మన మరణాన్ని శాసిస్తుంది. ఏది ఏమైనా మరణం అనేది మనం ‘మరణం మరణం’ అని జపిస్తూ హడలిపోవలసినంత* *దారుణమేమీ కాదు. బరువును మోస్తూ, బాధను పడుతూ గర్భవతి ప్రసవించినట్లే ఇది* *కూడా ఒక జీవక్రియ. జీవన పరిణామం...
ఉద్యోగికి బదిలీలా మరో జీవిలోకి, మరో జీవితంలోకి బదిలీ... అంతే నిజం.
ఎవరికైనా కొత్తదాన్ని ఎదుర్కోవాలంటే ఎంతయినా బెరుగ్గానే ఉంటుంది. అలవాటైన పాతదాన్ని వదులుకోవడం, అసలేమీ తెలియని కొత్తదాన్ని ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగానే ఉంటాయి.
అందరికీ మరణాన్ని గురించిన, దాని ఆవశ్యకత, అనివార్యతల గురించిన అవగాహన ఉండదు. ఏది ఏమైనా అస్తమిస్తున్న సూర్యుణ్ని చూసి భయపడటంకంటే ఆ అస్తమయ సూర్యుడి రంగుల విన్యాసాలను చూసి ఆనందించడం నేర్చుకోవాలి. మరింత కొత్త హంగులతో ఆవిర్భవించబోయే రేపటి సూర్యుడి అద్భుతమైన ప్రకాశ ఝరిలో ఓలలాడేందుకు ఉవ్విళ్లూరాలి. సూర్యాస్తమయం విచారకరం కాదు. విషాదం అంతకంటే కాదు. విలక్షణ సౌందార్యారాధనకు కొత్త రంగులు వేయడానికి పాత రంగుల్ని తొలగించడం అనివార్యం. రేకులు రాలితేనే మధురఫలం అంకురిస్తుంది. పురిటి నొప్పులు పడితేనే మాతృత్వం చిగురిస్తుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment