మంచి మాట 9.
*కీర్తి సంపాదన*ఎలా ఉండాలో తెలుసుకుందాం.
కుండలను పగలగొట్టి అయినాసరే బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరచి అయినా సరే, ఏదో ఒకవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడుపనులను అయినా చేసి ఏదో విధంగా అందరి కళ్లలో పడితే, తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొందరు.
బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తికండూతి అవుతుంది. కండూతి అంటే దురద కీర్తి సంపాదన అనేది సహజసుందరంగా లభించేది. అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తికోసం తపించలేదు. తాము నమ్మిన మంచిపనులను చేసుకుంటూ పోయారు. అలాంటివారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు.
మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసం శ్రమించవలసి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తి కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే . వ్యసనం మంచిదైనా, చెడుదైనా మనిషిని వెంటాడుతుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది.
పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంత రాజులదాకా ఎందరో కీర్తికోసం తపించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకొన్నవారు కొందరైతే, వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు కొందరు.
నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడివేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి, ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో కనిపిస్తారు.
ఇలాంటివారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు- 'ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా! ఏమి మీ అందం వర్ణనాతీతం' అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరుకుంటాయా! ఓ మిత్రులారా! ఆహా! ఏమి మీ కంఠధ్వని... ఎంత మధురంగా ఉందో? అని ప్రశంసించాయట.
కీర్తికాంక్ష, కీర్తి కండూతి. ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒక్కటే! ఒక రూపాయి దానం చేసి, వేయి రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కొందరు! _వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా, చేసింది. అణుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా ఆదే. మనిషి కీర్తికాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరీటధారి కావాలి.
*
అలాగే ఎలాంటి ఖర్చులేనిది స్వర్గం!*
ఒకరోజు వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*
*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*
ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*
*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, వ్యసనాలకు డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి,కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*
*దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి . అనగానే చాలా చక్కగా చెప్పారండి .ఈ జ్ఞానం అందరిలో ఉంటే మనుషులందరూ ఎంత ఆనందంగా ఉంటారో కదా అనుకుంటూ వెళ్ళాడు.
*సత్సంగత్వే నిస్సంగత్వం !*
*నిస్సంగత్వే నిర్మోహత్వం !!*
*నిర్మోహత్వే నిశ్చలతత్వం !*
*నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!*
సేకరణ మీ రామిరెడ్డి
No comments:
Post a Comment