Monday, November 6, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

 110223c0959.    120323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 శ్రీ మహాభారతం 
                  ➖➖➖✍️
                  268 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు…

“ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత గాంధారి యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తోంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాలకళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహించింది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.


#గాంధారి బాధ:

ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిల్లాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణహోమానికి దారి తీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళి పోయాడు. 

పాండవులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ తీసుకు యుద్ధభూమికి తీసుకు వచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్థినాపుర స్త్రీలు కూడా తమ భర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులనూ, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంత మంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించ లేక హాహాకారాలు చేస్తూ మూర్ఛ పోయారు. మరి కొంత మంది చని పోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు.


#గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట:

ఇది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి "కృష్ణా ! చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా ! నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా! వీరంతా ఏమి పాపం చేసారని వీరికి ఈ శిక్షవేసారయ్యా మీరు. అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా ! అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ! వంది మాగధులు కైవారముతోగాని నిద్ర లేవని ఈ మహా మహులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా ! హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాధిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా ! నానా విధ సుగంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాధిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా!   కృష్ణా! ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా! ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా !  అటు చూడవయ్యా ! కొంత మంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా ! మరి కొందరు తలలు చేత పట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా ! మరి కొందరు ముక్కలై పోయిన తమ భర్తల శరీరభాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడు స్తున్నారయ్యా ! మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా ! ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏపాపపం చేసానో కృష్ణా ! నా కొడుకులను, కోడళ్ళను, తమ్ముళ్ళను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను"అంది.  కాని కృష్ణుడు మాటాడక నిశ్శబధంగా గాంధారి వెంట నడుస్తున్నాడు.


#గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట:

ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలి పోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ "నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా! 
నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా !   కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా! 
నాకు పాదాభివందనం చేసాడయ్యా! అప్పుడు నేను ధర్మం జయిస్తుందని ఆశీర్వదించాను.    అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా! నాడు కుఱు సభలో   జూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు "ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు" అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా! నేను ఇంకా ఇలా అన్నాను… యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా ! నా కుమారుడు రెండవది నిజంచేసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గురించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమివయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందేనన్నదే నా బాధ.   కృష్ణా! నా కుమారుడు అభిమానధనుడు. అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త, కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కుఱు సామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది" అని…


#గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట:

“కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్న   నా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందన చర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళకు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను, నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా ! అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దుఃఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.


#గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట:

ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో "కృషా ! వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు. మహాబలసంపన్నుడు. భీముడి గదా ఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలుచీల్చి రక్తంత్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా ! భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే … 
వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికేపోతుందా! అందుకే దిక్కు లేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో "కుమారా! ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా! ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా ! భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా ! తక్షణమే ఆమెను విడిచి పెట్టండి. కౌరవకులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు వాడి మాట వినకు,    వాడి స్నేహం వదులు కౌరవవంశాన్ని రక్షించు" అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణా! విధిరాతను తప్పించ ఎవరి తరం కృష్ణా !✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment