Tuesday, November 7, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #గాంధారి భీముని నిందించుట:

 120223c.          130223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀269.

                శ్రీ మహాభారతం 
                 ➖➖➖✍️
                   269 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

 #గాంధారి భీముని నిందించుట:

“కృష్ణా! ఆ భీముడు నాడు కుఱుసభలో ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా సహించాడు భరించాడు.   సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు.  యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గధతో మోది చంపాడు. పగతీర్చుకోవడం న్యాయమే,  ఇలా గుండెలు చీల్చడం న్యాయమా! మహా వీరుడైన భీముడికి ఇది తగునా! ఇందు వలన భీముడికి కీర్తి కలుగుతుందా? చూడవయ్యా కృష్ణా !  నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లాచెదురైన అవయవములను చూడు. సింహం గోళ్ళతో చీల్చినట్లు   ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలి పోకుండా ఎలా ఉంటుంది కృష్ణా !”


#గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట:

“అయ్యో ! వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా ! ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణా ! వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలు తున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తోంది చూడవయ్యా ! కృష్ణా ! ఇలాంటి స్థితిలో కొడుకులను, కోడళ్ళను చూసే ధౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా ! ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కునే దుర్ముఖుడు. అలాంటి వీరుడు భీముడి గధాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా ! నా కొడుకు శూరసేనుడిని చూసావా ! అతడి భార్యలను చూడు భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా! కాకులూ గద్దలూ పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా ! కృష్ణా ! నా కుమారుడిని వివిశంతిని చూసావా ! వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంశులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు.” అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తోంది.


#గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట:

కుమారుల కొరకు విలపిస్తున్న గాంధారి అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె మనసు బాధతో "కృష్ణా ! వాడేనయ్యా అభిమన్యుడు శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి అరి వీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధాను యోధులందరూ అతడిని చుట్టు ముట్టి కడతేర్చారయ్యా ! చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిపోతున్నట్లున్న సుభద్రాపుత్రుడి ముఖం చూడవయ్యా ! అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్థిస్తుందయ్యా ! అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారి పోయే ఆ సుకుమారి… ఇప్పుడు పది మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకుని నెత్తీ నోరూ బాదుకుంటూ రోదిస్తుందయ్యా ! ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా ! "ఓ అభిమన్య కుమారా ! మీ అమ్మ సుభద్ర, మీ నాన్న అర్జునుడు ఎదురు చూస్తున్నారు వారిని వదిలి ఎక్కడకు వెళ్ళావు? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు లేవవయ్యా! ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలుకవేమి ఆర్యపుత్రా ! అయ్యో దైవమా! గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టిముట్టి తుద ముట్టించడం న్యాయమా ! ధర్మమా ! వారిదీ మగతనమేనా ! ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో ! తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మమంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలి పోయిందో ! నీ మరణం కలిగించిన దుఃఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవంశం చేసుకున్నా ఉపశమించ లేదు కదా ! నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మసెలా ఒప్పింది" అంటన్న ఉత్తరను చూడు కృష్ణా ! ఇంత చిన్న వయసులో భర్తృవియోగం ఉత్తర ఎలా సహించగలదు. మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుధేష్ణ ఎలా రోదిస్తుందో చూడవయ్యా ! ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా చచ్చిన కుమారుడి కొరకు విలపింస్తుందా ! చెప్పవయ్యా కృష్ణయ్యా !”


#గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట:

“కృష్ణా! అదుగో చూడు కర్ణుడి కళేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఈ కర్ణుడిని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా ! కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చూడవయ్యా ! ఆమె రోదన వినవయ్యా ! ‘నాధా ! పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా !’ అంటూ విలపిస్తుందయ్యా ! అడుగో మహావీరుడు బాహ్లికుడు, చచ్చినట్లు ఉన్నాడా ! గాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా ! కృష్ణా !”


#గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట:

“కృష్ణా ! అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రధుడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆ నాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈ నాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా ! పాపం దుస్సల 
భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటోందయ్యా ! కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా ! కృష్ణా ! నీకు తెలుసో లేదో అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో" అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగు లేదు. నా మాట విని ధర్మరాజును శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు" అని పరి పరి విధముల వేడుకున్నా! సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. "ఏ శుభకార్యానికి వెళ్ళ లేకుండా చేసారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా ! కృష్ణా ! అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి ? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, ధర్మరాజు లను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా, బాలుడైన అభిమన్యుడు యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా! అతడి తొందరపాటే అతడి మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా! ధర్మమా? అర్జునుడికే అది తెలియాలి. కృష్ణా ! మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు. అటువంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారథ్యం వహించి అతడిని సూటి పోటీ మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరుకార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే ! అలాంటి శల్యుడూ మరణించక మానలేదు. శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు. అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా!


#గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట:

“అడుగో కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా ! అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న   అతడిని జయించడం మానవమాతృల తరమా ! కృష్ణా ! అతడికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకు వచ్చి దాహార్తి తీర్చిన మహా వీరుడు అర్జునుడే కదా!   సూర్యుడే భూమి మీదకు దిగి వచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కుఱు కుమారులకు దిశా నిర్ధేశం చేయగల సమర్ధుడెవ్వడు. ఇంద్రుడితో సమానమైన ద్రోణుడు వేదవేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాశన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్యనేర్పిన వాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణా ! భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది. ద్రోణుడి భార్య భర్తశవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చెయ్యడానికి వెళుతున్నారయ్యా !


#గాంధారి అర్జున సాత్యకులను నిందించుట:

“కృష్ణా ! సాత్యకి అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి, కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! అర్జునుడు భూరిశ్రవసుడి భుజము నరికాడు. సాత్యకి తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన అర్జునుడు, సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా ! సాధువు మంచి వాడు అయిన భూరిశ్రవసువును చంపినందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! సాత్యకి సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా !" అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.


#గాంధారి శకునిని నిందించుట:

కృష్ణుడు ఒక్క మాట కూడా మాటాడ కుండా గాంధారి ని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. గాంధారి "కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు శకునిని చూసావా ! వీడొక మాయావి.  వీడి మాయలు నీ ముందు పని చేయలేదు. నాడు మాయా జూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఓడిపోయాడు. కుఱు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు.


#గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట:

“కృష్ణా ! అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణా ! ఇరుగో కేకయ రాజులు. ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు.  తన సహాద్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా! అతడి శ్వేత చ్ఛత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా ! కృష్ణా ! ఆ మహారాజుల భార్యలు, కొడుకులూ వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంత మంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణా ! ఇతడిని గుర్తు పట్టావా ! వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు'. అతడి కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా ! తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! అవంతీ పాలకులు విందానువిందులను చూడు. పెను గాలికి కూలిన వృక్షములవలె ఎలా కూలి పోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణా !✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment