Tuesday, November 7, 2023

శ్రీ మహాభారతం: #దుఃఖ_విముక్తి: #బ్రహ్మ_పుట్టుక:

010323c1115.    020323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀286.

              శ్రీ మహాభారతం 
               ➖➖➖✍️
                286 వ భాగం

#దుఃఖ_విముక్తి:  
#బ్రహ్మ_పుట్టుక:

ధర్మరాజు.. “పితామహా! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు” అని అడిగాడు. 

భీష్ముడు.. “ధర్మనందనా! నేను నీకు అజగర కథచెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ‘మహారాజా! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద, కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగా కోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం. 
ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది’ అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.


#కీర్తిప్రతిష్టలు:

ధర్మరాజు.. “పితామహా ! తానుచేసే కర్మఫలం, తనకున్న సిరిసంపదలు, తనకు ఉన్న బుద్ధిబలం, బంధువులకు ఉన్న సిరి సంపదలు వీటిలో వేటి వలన మానవుడికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి” అని అడిగాడు. 

భీష్ముడు.. “ధర్మనందనా! మానవుడు తన స్వయం ప్రజ్ఞవలన మాత్రమే కీర్తిప్రతిష్టలు పొందగలడు. కనుక మానవుడికి ప్రజ్ఞ అత్యవసరం. ప్రజ్ఞవలనే మానవుడికి కార్యసఫలత కాగలదు. బలి, ప్రహ్లాదుడు, మంకి తన ప్రజ్ఞ వలనే తమ సమస్యలకు పరిష్కారం వెతికి కీర్తిప్రతిష్టలు పొందారు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకసారి ఒక గంధర్వుడు తోలే రధంతగిలి కిందపడి ఆ అవమాన భారంతో కుమిలి పోతూ ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఒక నక్క రూపంలో వచ్చి అతడికి ప్రజ్ఞ కలిగించి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించాడు. కనుక మానవుడికి ప్రజ్ఞ ఉండడమే శ్రేష్టం” అని భీష్ముడు చెప్పాడు.


#పుణ్యకార్య_ఫలం:

ధర్మరాజు.. “మానవుడు తన దైనందన జీవితంలో దానాలు, ధర్మాలు, తపస్సు, తల్లితండ్రులకు పెద్దలకు సేవ చేయడం అత్యంత నిష్టతో ఒక యజ్ఞంలా చేసినప్పుడు అవి మానవుడికి ఏ రూపంలో ఫలితాన్ని ఇస్తాయి. వివరంగా చెప్పండి” అని అడిగాడు. 

“ధర్మరాజా ! మేలు మీద మేలు కీడు వెంట కీడు ఒక దాని వెంట ఒకటి వస్తుంటాయి పోతుంటాయి. ఒక మనిషి పాపం చేసినట్లైతే ఒక కష్టం వెంట ఒకటి వస్తూనే మనిషిని దారుణంగా దెబ్బ తీస్తుంటాయి. అదే మనిషి పుణ్యాత్ముడైతే అతడికి సుఖం వెంట సుఖం వస్తూనే ఉంటుంది కనుక నిరంతర సుఖసంతోషాలలో మునిగి తేలుతుంటాడు. ధాన్యంలో తాలుగింజలు ఉన్నట్లు మనుష్యులలో పాపాత్ములు ఉంటారు. వారు సమాజానికిపనికిరారు . కాని హానిచేస్తుంటారు. మనిషి చేసిన పాపపుణ్యాలు నిరంతరం అతడిని వెన్నంటి ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు అతడు చేసిన పాపపుణ్యాలు అతడిని వెన్నంటడమే కాక చనిపోయిన తరువాత కూడా పాపపుణ్యాలు వాసనల రూపంలో అతడి వెంటవెడతాయి కనుక మనిషి బ్రతికి ఉన్నా చనిపోయినా పాపపుణ్యాల నుండి తప్పించుకో లేడు. తగిన ఋతువులలో చెట్లు చిగిరించి పుష్పించి కాయలు కాసి పండ్లుగా మారిన విధంగా మనిషి చేసిన పాపపుణ్యాలు తమ ఫలాలను కష్టసుఖాలను కలిగిస్తాయి. సాధారణంగా మానవులు మంచిప్రవర్తన కలిగి ఉంటారు. ధాన్యంలో తాలుమాదిరి అక్కడక్కడా దుర్మార్గులు ఉండి ఓర్పు వహించేవారిని, మంచి ప్రవర్తన కల వారిని చేతగాని వారిలా పరిగణిస్తారు. మంచి వారువారి మాటలు పట్టించుకొనక సన్మార్గంలో ప్రవర్తిస్తూ ఫలితంగా సుఖాన్ని పొందుతారు. కనుక ధర్మనందనా ! న్యాయధర్మాలు ఆచరించే వారు తప్పక ఫలితాన్ని పొందగలుతారు” అని చెప్పాడు భీష్ముడు.


#భూతసృష్టి:

ధర్మరాజు.. “పితామహా ! ఈ భూతసృష్టి ఎలా జరిగింది. ఎవరి వలన జరిగింది వివరించండి” అని అడిగాడు. 

“ధర్మనందనా ! ఈ విషయం ఇంతకు ముందు భృగుమహర్షి భరద్వాజుడికి వివరించాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను. సర్వవ్యాపి ఆది, అంతం లేని విష్ణువు సృష్టిచేయ సంకల్పించి తననుండి వెయ్యోవంతు భాగంతో అవ్యక్తం అనే పదార్ధాన్ని సృష్టించాడు. అవ్యక్తమునుండి మహత్తత్వం అనే ప్రకృతితత్వం పుట్టింది. ఆ ప్రకృతిలోనుండి ఒక పద్మం పుట్టింది. పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుడి సంకల్పంతో ఆకాశం ఉద్భవించింది. తరువాత ఆకాశంనుండి జలం ఉద్భవించింది.

జలం నుండి అగ్ని ఉద్భవించింది. అగ్ని నుండి వాయువు ఉద్భవించింది. అగ్నివాయువుల సమ్మిళితంగా భూమి పుట్టింది. పంచభూతములు బ్రహ్మ అందు ఉన్నాయి. కనుక ఈ భూమి అంతా బ్రహ్మమే. కొండలు పర్వతములు బ్రహ్మకు ఎముకలు, భూమి మాంసము, సముద్రాలు నదీనదాలు బ్రహ్మదేవుడి రక్తం. ఆకాశం బ్రహ్మఉదరం, వాయువు అతడి ఉచ్వాసనిశ్వాసాలు, అగ్ని అతడి తేజస్సు, సూర్య చంద్రులు బ్రహ్మదేవుడి కళ్ళు, ఊర్ద్వలోకం బ్రహ్మశిరస్సు, పాతాళము బ్రహ్మదేవుడి పాదాలు, నాలుగు దిక్కులు బ్రహ్మదేవుడి నాలుగు చేతులు ఇలా అనంతుడైన విష్ణువు నుండి ఈ ప్రకృతి ఉద్భవించింది. అప్పుడు భరద్వాజుడు పంచభూతములు రూపం ఏమిటి ? వాటి పరిమాణం ఏమిటి ? అని అడిగాడు. భృగువు ఒక పదార్ధము నుండి పుట్టిన పదార్ధం ఆ పదార్ధం పోలి ఉంటుంది. అలాగే సర్వవ్యాపి, అనంతుడు అయిన విష్ణువు నుండి పుట్టిన ప్రకృతి పంచభూతములు విష్ణు స్వరూపంలాగే ఉండి అంతటా వ్యాపించి ఉంటాయి. చెట్టు నుండి చెట్టు, పక్షి నుండి పక్షి, జంతువు నుండి జంతువు పుడతాయి. అలా పుట్టిన సర్వమూ తాను దేని నుండి పుట్టాయో దాని స్వరూపంతో ఉండం ప్రకృతినియతి. అలాగే అనంతుడైన విష్ణువు నుండి పుట్టిన పంచభూతములు విష్ణు వలెనే సర్వత్రావ్యాపించి ఉంటాయి అని భృగువు చెప్పాడు.


#బ్రహ్మపుట్టుక:

భరద్వాజుడు భృగుమహర్షిని మహర్షీ ! బ్రహ్మ పద్మమునుండి పుట్టాడు కదా ! అంటే బ్రహ్మ కంటే ముందే పుట్టిన పద్మాన్ని ఎవరు పుట్టించారు ? ఎలా పుట్టింది ? అని అడిగాడు. భృగువు భరద్వాజా ! సర్వవ్యాపి అయిన విష్ణుమానస పుత్రుడు ఆద్యుడు. బ్రహ్మకు ఆసనంగా పద్మము పుట్టింది అంతే కాని ఈ సృష్టిలో ముందు వెనుకలు లేవు. పద్మము అంటే మనం అనుకునే పద్మముకాదు పద్మము అంటే భూమి. భూమిపైన ఉన్న ఎత్తైన మేరుపర్వతం పద్మానికి కర్ణిక. పద్మము నుండి సమస్త చరాచర జగత్తు ఉద్భవించింది’ అని భృగువు చెప్పాడు. 

భరద్వాజుడు… “మహర్షీ ! పంచభూతాలు దేని నుండి ఉద్భవించాయి ? అవి అయిదురూపాలుగా ఎలా మారాయి ?” అని అడిగాడు. 

భృగువు… “భరద్వాజా! వాయువు నిరంతరం కదిలేది. చైతన్య రూపమైన ఆకాశం శబ్ధస్వరూపం. నీరు ద్రవస్వరూపము. అగ్ని వేడిమికి వెలుతుకు ప్రతీక. భూమి ఘనస్వరూపముకు ప్రతీక. వీటి అయిదింటి వలన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలో ఉన్నవి రెండుజాతులు. ఒకటి స్థావరం అంటే స్థిరమైనవి. రెండవది జంగమములు అంటే జీవముతో కదిలేవి.”


#పంచభూతముల_గుణాదులు:

భరద్వాజుడు… “మహర్షీ ! పంచభూతములు ఎలా ప్రవర్తిస్తాయి” అని అడిగాడు. 

భృగువు… “భరద్వాజా ! కదలని వాటికి ప్రతీక అయిన చెట్టు పిడుగుపాటుకు అల్లాడుతుంది కనుక వృక్షాలకు వినికిడిశక్తి ఉన్నట్లేకదా! గాలికి అనుకూలంగా కదులుతుంది కనుక వృక్షం గాలినిగ్రహిస్తుంది. సూర్యరశ్మి ఉన్న వైపుగా పెరుగుతుంది కనుక వృక్షానికి వెలుతురును గ్రహించే శక్తిఉంది. వేళ్ళతో నీటిని గ్రహించిన వృక్షం అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది కనుక వృక్షాలకు నీరుతాగే గుణం ఉంది. వృక్షం సుగంధపూరితమైన పుష్పాలను పుష్పించి కాయలు పండ్లు ఇస్తుంది కనుక వృక్షానికి భూమికి ప్రతీక అయిన ఘ్రాణశక్తి ఉంది. అలాగే కొండలు, పర్వతాలలో కూడా పంచభూత లక్షణాలు ఉంటాయి.”


#రసము వాసనా తేజము గురించి వివరించండి:

“పంచభూతగుణాలైన రసము, వాసనా, తేజము వేటిలో ఉంటాయి. వాటిని ఎలా అనుభవిస్తారు” అని అడిగాడు. 

భృగువు “భరద్వాజా ! విషయములు, ఇంద్రియములు, మనసు. మనలో ఉన్న అంతరాత్మ విషయవాంఛలను మనసు ద్వారా సంకల్పించి ఇంద్రియముల ద్వారా అనుభవించి వాటి వలన కలిగే సుఖదుఃఖములను అనుభవిస్తూ ఉంటుంది. జీవుడు క్షేత్రజ్ఞుడనే పేరుతో మనిషి శరీరం అంతా వ్యాపించి ఉంటాడు. ఈ క్షేత్రజ్ఞుడు మానవ సహజమైన సత్వతమోరజో గుణాలకు అతీతంగా సాక్షీభూతంగా ఉంటాడు. ఈ జీవుడు తన జన్మస్థానమైన కైవైల్యంవైపు చూస్తూ ఉంటాడు. విజ్ఞులైన వారు సూక్ష్మమైన నిర్మల బుద్ధితో క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకుని అనంతుడిమీద మనసు లగ్నం చేసి పరమ శాంతివంతమైన చివరకు శాశ్వత ఆనందంపొందుతారు.


#చాత్రుర్వర్ణ_సృష్టి:

తొలుత బ్రహ్మదేవుడు సత్యము, ధర్మము, సదాచారము, తపస్సుకు ప్రతీకగా బ్రాహ్మణ సృష్టి చేసాడు. తరువాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను సృష్టించాడు. వారికి తగిన వర్ణములు కల్పించాడు. బ్రాహ్మణులు తెల్లగానూ, క్షత్రియులు ఎరుపురంగు లోనూ, వైశ్యులు పసుపురంగు లోను, శూద్రులను నలుపురంగు లోనూ పుట్టించాడు. ఈ నాలుగువర్ణాల వారు తమవృత్తి వదిలి వేరువృత్తి చేసిన ఆ వృత్తి కొనసాగించాలి. అలా కాక అనేక వృత్తులు చేసిన జారవృత్తి చేసిన వారు ఔతారు. చత్రుర్వర్ణాల వారు వారి వృత్తులను బట్టి ఒకరికంటే ఒకరు తక్కువగా పరిగణించ పడతారు.


#త్రిగుణములు:

అన్ని ధర్మముల కంటే సత్యము ఉత్కృష్టమైనది. సత్యమేబ్రహ్మము, సత్యమేతపము, సత్యం ప్రజలను సృష్టిస్తుంది. సత్యంవలన సృష్టి నిలిచి ఉంది. సత్యము అసత్యము చేత మరుగునపడుతుంది. ఫలితంగా ధర్మము అధర్మము, వెలుగు చీకటి, జ్ఞానము అజ్ఞానము, స్వర్గము నరకము, సుఖము దుఃఖము అని రూపాంతరం చెంది ఉంటాయి అని పెద్దల వలన తెలుసుకుని పెద్దలు అసత్యముకు దూరంగా ఉండి నియమ నిష్టలతో గడుపుతుంటారు. బాధలు రెండురకాలు. వ్యాధులు రెండువిధాలు.

తన శరీరానికి వచ్చే వ్యాధులు, ముసలితనం అనేది ఒకటి. రెండవది బంధువులకు వచ్చేది అయిన మానసికబాధ. వాటిని మానవుడు తన నియమ నిష్టలతో అధికమించి సుఖపడవచ్చు. స్థిరచిత్తుడు ఈ రెండు బాధలను జయించి వాటికి లొంగక వైరాగ్యంతో పరమపదము పొందుతాడు” అని భృగువు చెప్పాడు.


#ఆచారవిధానాలు:

భరద్వాజుడు.. “మహర్షీ ! నాకు ఆశ్రమ ధర్మముల గురించి వివరిస్తారా !” అని అడిగాడు. 

భృగుమహర్షి… “భరద్వాజా ! బ్రహ్మచారి లక్షణములు వివరిస్తాను. బ్రహ్మచారి గురుభక్తి కలిగి పరమ శ్రద్ధతో వేదాధ్యయనం చేస్తూ, శుచిత్వంతో, వినయంతో, మూడు వేళలలో హోమహుచేస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. గృహస్థు ధనమును, ధాన్యమును ధర్మబద్ధంగా సంపాదించాలి. అతిధిసత్కారములు చేయాలి. అన్నపానములు భోగములు పరిమితంగా చేయాలి. ఇది గృహస్తాశ్రమ ధర్మం. వానప్రస్థులు కంద మూలములు, ఆకులు, ఫలములు భుజించాలి, భూశైనము చేయాలి. సన్యాసి భిక్షాటన చేస్తూ దొరికినదానిని తిని ప్రశాంతంగా జీవించాలి. ఫలాపేక్ష లేకుండా ఈ నాలుగు ఆశ్రమాలను నిర్వర్తిస్తే మోక్షపదము లభిస్తుంది” అని భృగువు చెప్పాడు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment