శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మలేదు.
అందరు ఈ మాట చెప్పుకుంటూ దిగి వస్తున్నారు. పార్వతీదేవి శంకరునితో ఇంతమంది చూస్తున్నారు కదా అందరి పాపములు పోయాయా? అని అడిగితే విశ్వాసము ఉన్నవారికి పోయాయి అని చెపితే వారిలో విశ్వాసము లేని వారున్నారని అనుకుంటున్నారా అని అడిగింది. చూపిస్తాను రమ్మని వృద్ధ బ్రాహ్మణ వేషము వేసుకుని వచ్చాడు. ఆమె వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఆయన ప్రాణోత్క్రమణము అయిన వాడిలా భార్య వడిలో పడిపోయి ఉంటే ఆమె ఏడుస్తూ అరుస్తున్నది. ఎవరైనా ఒకరు నా భర్తను ముట్టుకోండి. అప్పుడు నా భర్తకి ప్రాణము లభిస్తుంది. అందరు వచ్చి ముట్టుకోబోతే ఆమె ఎవరు పడితే వాళ్ళు కాదు, పాపము లేని వాళ్ళు ముట్టుకుంటే నా భర్త బతుకుతాడు. పాపము ఉండి ముట్టుకుంటే ఇబ్బంది వస్తుంది అనగానే అందరూ వెనక్కు వెళ్ళిపోతున్నారు. ఒక వేశ్య ముందుకు వస్తుంటే అందరు ఆమె ఒక వేశ్య ఆవిడ వెడుతున్నదేమిటి అన్నారు. ఆమె వచ్చి నేను ముట్టుకుంటాను నీ భర్త బ్రతుకుతాడు అన్నది. పార్వతీదేవి నీకు పాపము లేదా? అని అడిగితే నాకు పాపము లేదు. ఎందుకు లేదు? అనగా పాపము పుణ్యము నశించిపోతే కదా పుట్టడానికి శరీరము లేకుండా ఉండటము. ఆ రెండూ ఉంటేనే ప్రారబ్ధము అనుభవించడానికి ఉపాధి స్వీకరించాలి. శ్రీశైల శిఖరము చూసినప్పుడే నాకు పుణ్యము పాపము రెండూ పోయాయి. అందుకని ముట్టుకుంటాను అన్నది.
No comments:
Post a Comment