Saturday, December 2, 2023

🔔వడ్డికాసులవాడు 🚩🦚🚩

 🔔వడ్డికాసులవాడు
        🚩🦚🚩

 లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు  ఆనందనిలయంలో నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి
" స్వామీ!  కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ రోజు రోజుకు
పెరిగిపోతున్నది. 
మన వద్ద అనంతమైన 
సిరి సంపదలున్నాయి.  సిరులకు అధిదేవతనైన ఈ లక్ష్మి మీ అర్ధాంగి.కుబేరుడి  అప్పు పూర్తిగా తీర్చేయవచ్చును కదా, ఏందుకు జాప్యం చేస్తున్నారు " అని అడిగింది. అందుకు లక్ష్మీపతి చిరునవ్వుతో
  " దేవీ,  కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కారణమే లోకకళ్యాణం కోసం. 
కలియుగంలో  భూలోకవాసులకు
 ధర్మాధర్మ విచక్షణ బోధించడానికి , నాస్తికవాదం ప్రబలకుండా వారిలో ఆధ్యాత్మిక భక్తి  చింతనను  పెంపొందించడానికి నేను కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఉపయోగపడుతుంది " అని అన్నాడు. 

శ్రీనివాసుని సతులిద్దరికీ పతి మాటలు అర్ధం కాలేదు. మరల పురుషోత్తముడే ఇలా అన్నాడు.
 
కలియుగంలో
నిష్కామ భక్తికి 
(ప్రతిఫలం
ఆశించని భక్తి) తావులేదు. మానవులు  
తమ తమ కోరికలు నెరవేర్చుకుందుకి మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు. తమ వాంఛలు తీర్చుకోవడానికి 
ఆలయాలకి వచ్చి మ్రొక్కులు మ్రొక్కి అవి నెరవేరగానే ప్రతిఫలం చెల్లించుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.
ఈ క్రమంలో మానవుడు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఆవిధంగా
కలియుగంలో  దేవుని పట్ల భక్తి  నిలిచి
వుంటుంది. మానవులు నన్ను తమ కోరికలు తీర్చే వరాలనొసగే
 స్వామిగా, ఆపదమ్రొక్కులవాడిగా నన్ను కొలుస్తారు. వారు నా భక్తులైనా , కాకపోయినా వారిని కాపాడేందుకు నేను
కలియుగాంతము వరకు యీ తిరుమలపై  నివసిస్తాను. 

" స్వామి!.మీ  దయార్ద గుణము మాకు తెలుసు. అనంతమైన
భక్తులను అనుగ్రహిస్తూవుంటే 
కుబేరునికి  అప్పు ఎలా తీరుతుంది? " అని లక్ష్మీ దేవి ప్రశ్నించినది.  

" దేవీ! కలియుగంలో మానవులకి సిరిసంపదలు
ఒక్కటే ముఖ్యంగా  కనిపిస్తాయి.  అందువలన అనేక పాపాలు చేసి, అక్రమ మార్గాన ధనం చేరుస్తారు. ఆ పాప కర్మల ఫలితంగా ఈ జన్మలోనే కఠోర వ్యాధులతో, ఎడతెగని సమస్యలతో కష్టాలపాలవుతారు.
అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి 
' గోవిందా! నన్ను రక్షించు" అంటూ నా చరణాలు పట్టుకుంటారు.
వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తామని
మ్రొక్కులు మ్రొక్కుకుంటారు.
నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి , నా వద్దకు చేరేటట్టు
చేసుకుంటాను.   అన్నాడు స్వామి. 
పాపపు మచ్చ పడిన ధనం సత్కార్యాలకు వినియోగించ తగునా ?  అని లక్ష్మీదేవి అడిగింది.
" దేవీ దానిలో  కూడా
ఒక రహస్యం యిమిడి వున్నది.
పాపులు సమర్పించిన కానుకలను  అజ్ఞానముతో ఇహలోక సంపదలు ఆశించి నన్ను ప్రార్ధించే వారికి  
అనుగ్రహిస్తాను. పవిత్రమైన ఆశయాలతో నిర్మల మనస్సు గల 
భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం మాత్రమే   నేను స్వీకరించి మూడొంతుల  భాగం కుబేరునికి అప్పుగా తీరుస్తాను. " అని శ్రీనివాసుడు వివరించాడు.

" సరే , ఇందులో  మా కర్తవ్యం   ఏమిటి 
స్వామీ ?  " అని అడిగిన లక్ష్మీదేవితో
' నన్ను  నమ్మి నా చెంతకు వచ్చేవారందరికీ వారి మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా వారి కోరికలు తీరేలా అనుగ్రహిస్తూ వుండాలి " అని పలికాడు
భగవంతుడు.
" స్వామి! మీ చిత్తానుసారమే
చేస్తాను. కాని ధనం పెరిగిన కొద్దీ వారు మరింత గర్వమధాంధులుగా, దుర్మార్గాలకు పాలుపడకుండా శిష్ట రక్షణ చేయవలసిన బాధ్యత మీదే "
అని అన్నది శ్రీదేవి. 

"ఈ తిరుమల కొండ మీద దానధర్మాలు చేసే వారికి ఒకటికి పదింతలుగా  పుణ్యఫలాలు లభిస్తాయి. 
ఇక్కడ ఏకాగ్రచిత్తంతో నన్ను పూజించి ధ్యానించే
ఉత్తములకు ముక్తిని కటాక్షిస్తాను.  నీవు
అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం పెచ్చు పెరుగుతుందని
నీవు సందేహించవద్దు." 
అని భగవంతుడు  అన్నాడు.

 పద్మ పురాణంలో లక్ష్మీ శ్రీనివాసుల ఈ సంభాషణము
వివరించబడివున్నది.  కలియుగ
దైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహానికి  గల రహస్యాన్ని
యీ విధంగా తెలుపుతున్నది.
ఇందులోని నిగూఢార్ధాన్ని సద్భక్తితో గ్రహించి 
తిరుమల దేవుని దర్శించిన వారి జీవితం శోభాయమానం 
అవుతుందని
మహాత్ముల ఉవాచ.

No comments:

Post a Comment