దేహాభిమానమే బ్రహ్మానుభవం
"ముక్తస్థితిని పొందాలంటే,
దేహాభిమానాన్ని వదలాలి" అని అంటుంటారు కదా!
మరి మీరేమో 'దేహాభిమానమే బ్రహ్మానుభవం' అంటున్నారు...! అని సందేహాన్ని వెలిబుచ్చారు రాధిక...
* * *
'నేను రామారావు అభిమానిని' అంటాను.
అంటే నేను వేఱు, రామారావు వేఱు అనే కదా!
'నేను ఈ దేహాన్ని అభిమానిస్తున్నాను' అంటే,
"నేను" వేఱు, ఈ దేహం వేఱు అనే కదా!
దేహానికి నేను వేఱుగా ఉంటేనే,
నేను ఈ దేహాన్ని అభిమానించగలను.
దేహాభిమానం ఉండడం దోషమేమీ కాదు,
'నేను ఈ దేహాన్ని కాను' అనే సత్యాన్ని అది తెలుపుతోంది...
బ్రహ్మము తానెవరో మరచిపోయేంతగా బాబు అనే బొమ్మను అభిమానించి, బొమ్మే తానైపోయింది. సుఖదుఃఖాలను అనుభవిస్తోంది.
మళ్లీ ఇప్పుడు 'నేనెవడను' అని తనలో తాను విచారించుకొని, తానెవరో తెలుసుకొని జగత్తంతా తోలుబొమ్మలాటే అని తెలుసుకుని యధాస్థితికి చేరుకుంటుంది.
నేనెవడను? అనే సాధన చెప్పింది బ్రహ్మానికే;
ఈ బొమ్మకు కాదు.
బొమ్మ జడం - దీనికసలు ఉనికే లేదు.
ఈ బొమ్మకు బంధమూ లేదు, మోక్షమూ లేదు.
ఈ బొమ్మకు సాధనా లేదు, సిద్ధీ లేదు.
మరి ఈ బొమ్మే కదా ఈ వ్యాసం వ్రాస్తోంది?
అని సందేహం రావొచ్చు.
కాదు...
బ్రహ్మమే వ్రాస్తోంది...
తానెవరో తాను తెలుసుకోవడంలో భాగంగానే జరుగుతుంది....ఈ పుస్తకపఠనం, వ్యాస రచనం, సద్గురు సహవాసం, ఆత్మవిచారం...
వాహనంలో వాహకుడు ఉన్నప్పుడు మాత్రమే
వాహనంలో చైతన్యం ఉన్నట్టు,
దేహంలో బ్రహ్మం ఉన్నప్పుడు మాత్రమే ఈ జడ దేహంలో చైతన్యం కనిపిస్తుంది.
ఆయన కదలికే మన కదలికగా కనబడుతుంది.
ఆయన పలుకే మన పలుకుగా ఉంటుంది.
అందువల్లనే రమణులు ఈ దేహాన్ని చిత్-జడ గ్రంథి అన్నారు.
గ్రంథి అంటే ముడి.
ముడిలో చిత్-జడముల రెంటి స్పర్శా ఉంటుంది.
పూర్తిగా చిత్తు అయిపోయినా కదలిక ఉండదు.
పూర్తిగా జడం అయిపోయినా కదలిక ఉండదు.
చిత్-జడముల కలయిక ఈ దేహం.
దేహం వల్లనే సంసారం.
సంసారం వల్లనే దుఃఖం.
దుఃఖాన్ని మాపేది ఆత్మవిచారం.
సంసారంలో-
నేను-నాది విడివిడిగా ఉంటాయి.
స్వరూపంలో-
నేను-నాది ఏకమై ఉంటాయి.
పూర్తి చిత్తుకూ సాధన అవసరం లేదు.
పూర్తి జడానికీ(శవానికీ) సాధన అవసరం ఉండదు.
చిజ్జడగ్రంథికే అన్నీను...
బొమ్మలాటలో పడి, తానెవరో మరచిపోయిన బ్రహ్మమే చిజ్జడగ్రంథి.
నిజానికి చదరంగంలో రెండువైపులా తానే ఉండి, బ్రహ్మము ఆడే ఆటే ప్రపంచం.
ఓటమీ తనదే, గెలుపూ తనదే.
ఆట అనేది మరిస్తే సుఖదుఃఖాలు రెండూ దుఃఖమే.
ఆట అనే గుర్తుంటే సుఖదుఃఖాలు రెండూ సుఖమే.
మరపే బంధం, ఎరుకే మోక్షం.
బ్రహ్మానికి; మనకు కాదు.
మనకసలు ఉనికే లేదు.
అనే తెలివి కూడా బ్రహ్మము యొక్క స్పర్శ వలన కలుగుతోంది...
* * *
బ్రహ్మమే దేహాన్ని అభిమానించి, దానికి తోడునీడగా ఉండి నడిపిస్తోంది, డ్రైవరు బస్సును నడిపిస్తున్నట్లుగా...
"అదిగో బస్సు వస్తోంది..." అంటామేగాని,
అదిగో డ్రైవరు వస్తున్నాడు...అని ఎవరూ అనరు.
అలా 'బాబు వస్తున్నాడు' అంటారేగానీ, బాబు లోపలుండి నడిపే బ్రహ్మాన్ని ఎవడూ గుర్తించడు.
అంటే వాహనానికి ప్రాముఖ్యతనిచ్చి,
వాహకుణ్ణి మరిచిపోతున్నాం.
* * *
'నేను బాబు' అని అనేది బ్రహ్మమే.
'నేను బ్రహ్మమును' అని అనేదీ బ్రహ్మమే.
బ్రహ్మమునకు-
నేను బాబు అని అనుకుని బాబు అయ్యే శక్తీ ఉంది.
అహంబ్రహ్మాస్మి - నేను బ్రహ్మమును అనుకుని తిరిగి బ్రహ్మమయ్యే శక్తీ ఉంది.
బ్రహ్మము సర్వశక్తిమంతము - చైతన్యము.
బాబు అస్వతంత్రుడు - జడము.
* * *
కాబట్టి-
బాబు బ్రహ్మము కావడానికి చేసే సాధన కంటే,
బ్రహ్మమే బాబు అయివున్నది అనే అవగాహన సిద్ధినిస్తుంది.
ఉన్నది "ఒక్కటే" లేదా "ఒక్కడే" అన్నాక...
రెండవది లేదు అన్నాక...
ఇక ఎవడి మీద కేసు పెట్టగలం...!
* * *
-జ్ఞానశిశువు
No comments:
Post a Comment