Friday, March 15, 2024

అష్టసిద్ధులు

 అష్టసిద్ధులు
భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు.
అవి
1. అణిమ : సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.
2. మహిమ : భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు
3. గరిమ : ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.
4. లఘిమ : ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు
5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు
6. ప్రాకామ్యము : అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.
7. ఈశత్వం : ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది
8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి
ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.
అష్టసిద్ధులు అనే మాట వినిపిస్తూంటుంది .అయితే వాటిలో కొన్నిటి పేర్లే వినవస్తుం టాయి . ఆ అష్ట సిద్ధుల పేర్లు
అణిమ – అతి చిన్న వాడిగా మారిపోవడం
మహిమ – పెద్ద రూపం పొందడం
గరిమ – బరువుగా మారడం
లఘిమ – తేలికగా మారిపోవడం
ప్రాప్తి – ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం
ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం
ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి
వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ
కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం
సిద్ధులు చాలా ఉన్నాయి . అందు వల్ల అష్ట సిద్ధుల్లో కొందరు గరిమను చేర్చి కామావసాయతను పేర్కొనరు .మరికొందరు కామావసాయతను చేర్చి గరిమను పేర్కొనరు . ఏది ఏమైనా అష్ట సిద్ధులు ఇవే .ఈ అష్ట సిద్ధులని పురాణ పురుషులు ప్రదర్శించారు .
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు .
మహిమా సిద్ధిని హనుమంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు .
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శించాడు . ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది .
ఇక వామనావతారంలో విష్ణువు మూడడుగులతో భూమ్యా కాశాలను ఆవరించినపుడు కూడా ఇదేవిధంగా పెరిగాడు .
గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు . వాడిని కృష్ణుడు చంపివేశాడు .
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు .
లఘిమా అంటే తేలికగా అయిపోవడం . ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు .
ఈసిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది .
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు . దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది .
ఆదిశంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు . తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు . అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు . 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు .
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు . ఏసత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు . సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామస్మరణవల్ల ఉత్తమగతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం .
యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు . తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు . భగవద్గీతలో అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది . పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి . పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక గనుక మన శరీరమే ఒక ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి .
అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి . అష్టమాయల్ని జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట . అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు .

No comments:

Post a Comment