Friday, July 4, 2025

 సర్దుబాటు
************
      యూనీఫారం లేని ఆకాలంలో "అమ్మా!ఈగౌను  చాలా పొట్టైపోయింది నేనువేసుకెళ్ళను దీన్ని బడికి."  చెల్లాయి.
   "అక్కది ఎర్రపువ్వులగౌను దానికి పొట్టైపోయింది,ఆగౌనుదానికంటే నీకే చాలాబాగుంటుంది.    మూడేళ్ళక్రితంనుంచీ అది వేసుకొంటున్నా, దుక్కముక్కలావుది చీటీగుడ్డకనుక. పిసరంతకూడా కసదిగలేదు, ఇప్పడు గుడ్డకొని కుట్టించినట్టు కొత్తదానిలావుంది.  అదివేసుకొనివెళ్ళు. నీ స్నేహితులంతా కొత్తగౌననుకొంటారు. నా చిన్నప్పుడు నేనుకూడా మా అక్కకి పొట్టైన బట్టలే వేసుకొనేదాన్ని." అమ్మ నచ్చచెప్పడానికి చూసేది. "ఇంకెప్పుడూ అక్కకి పొట్టైన గౌన్లూ, పరికణీలేనా నాకు, ఇంక కొత్తగౌన్లూ పరికిణీలూ అసలు కొత్తవి కుట్టించనే కుట్టించవా నాకు?"
చెల్లాయి ఉక్రోషం.
     "నాన్నా!నాక్లాసుకి పుస్తకాలు వచ్చాయి. పదిహేనురూపాయలు తెచ్చుకొమ్మన్నారు మా మాష్టారు. మళ్ళీ అందరూ కొనేసుకొంటే, నాకసలు కొత్త పుస్తకాలేవుండవు, డబ్బులియ్యి నాన్నా!"
తమ్ముడు నాన్నని దేవిరింపు.
     "అక్క నిరుడు చదివిన పుస్తకలున్నాయికదా బాబీ! మళ్ళీ కొత్తవి కొనడమెందుకు? చక్కగా పాడుచేయకుండా నీటుగా వాడుకొందది. నిరుడువేసిన న్యూస్  పేపరట్టలు  తీసేసి, కొత్త పేపరుతో అట్టలు వేసుకొన్నావంటే కొత్త పుస్తకాల్లాగేవుంటాయవి ఎంచక్కగా, అమ్మచేత అట్టలు వేయించుకో, అలాగే పోయినేడాది వాడుకొన్న నోట్సు పుస్త కాలలో వాడకుండ మిగిలిపోయిన ఖాళీ పేపర్సుతీసి, అక్కయ్యచేత చక్కగా అట్టలువేయించుకొని,దబ్బనంతో ట్వైన్దారంపెట్టి కుట్టించుకో,నోట్సులు రాసుకోడానికి  నీకూ చెల్లాయికీకూడా పనికొస్తాయి. అంతగా అయితే వాటిమీద రాయడం పూర్తైయిపోతే అప్పుడు కొత్తపుస్తకాలు కొంటాను సరేనా?"నాన్న బుజ్జగింపు.
     "ఛీ.. ఛీ.. ఈ నాన్నెప్పుడూ యింతే. ఎప్పుడూ అక్క వాడిన పాత పుస్తకాలే, కనీసంనోటు పుస్తకాలేనా కొత్తవికొనరు." తమ్ముడు నాన్నకి వినపడకుండా గొణుగుడు.
     " అమ్మా! పరికిణీమీద వేసుకోడానికి కొత్త ఓణీలు కొనితెమ్మని నాన్నకుచెప్పవా? "
అక్క అభ్యర్ధన.
      " అలాగే చెపుతానుకానీ పెద్దపాపా!నాన్నకు వాళ్ళూవీళ్ళూ పెట్టిన, పంచలమీది కండువాలు బోల్డన్ని పడివున్నాయి. నాన్న భుజంమీద కండువా వేసుకోరుకదాఎప్పుడూ! నువ్వు ఇంట్లోవున్నప్పుడు ఆ కండువాలని ఓణీల్లా వేసేసుకో, మంచి ఓణీలు పెళ్ళికెళ్ళినప్పుడో, పేరంటానికి వెళ్ళినప్పుడో  వేసుకొందువుగాని." అమ్మ బుజ్జగింపులు.
    "ఛీ ఛీ అన్నీ తెల్లకండువాలే, అవేం బాగుంటాయ్? పైగా పొట్టిగా మూరడంతుంటాయ్. నేనేసుకోనుబాబూ ఆకండువాలు.అందరూ నవ్వుతారు." అక్కయ్య చిరాకులు.
      "ఏవోయ్! పొద్దున్నే ఫష్ట్ బస్సుకి కాకినాడ వెళ్ళాలి. పంచ చొక్కా ఇస్త్రీ చేసినవి వున్నాయా?"నాన్న సందేహం.
     "ఏదీ, ఎక్కడా!పెద్దపండుగెళ్ళాకా బల్లల పండుగ చేసుకోలేదని చాకలి ఇంతవరకూ రానేలేదు. బట్టలన్నీ మాసిపోయి గుట్టలుగా పడివున్నాయి. ఇక ఇస్త్రీబట్టలెక్కడ?" అమ్మ సమాధానం.
     "పోన్లే! ఇస్త్రీ లేకపోయినా ఫరవాలేదు, ఉతికినవి వుంటేచాలు.!"
నాన్న సర్దుబాటు.
     "అమ్మా!బడికి టైమైపోతోంది. మాకు టిఫెన్ పెట్టవే!"చెల్లీ, తమ్ముడూ యుగళగానం.
    "ఈరోజుకి టిఫెన్లేమీ చేయలేదు, పెరుగేసుకొని ఎంచక్కాఆవకాయ పెచ్చు నంజుకొని చద్దన్నం తినేసెళ్ళండి.రేపు       చే స్తాను టిఫెను.అయినా ఆ టిఫెన్లు తింటే కడుపునిండేనా కాలునిండేనా? పొద్దుటే  నూనిసరుకులు తింటే దాహమెయ్యడంతప్పబలమాపాడా?చద్దన్నం తింటే కడుపులో చల్లగావుంటుంది."అమ్మ బుజ్జగింపులు.
    "  నువ్వెప్పుడూ ఇంతే అమ్మా! ఎప్పుడూ చద్దెన్నమే తినమంటావు, ప్రతీరోజూ టిఫెన్ రేపుచేస్తా, రేపుచేస్తానంటావు." బాబిగాడు, చెల్లీ సణుగుడు.
     "ఏవోయ్!ఈసారికి పెద్దపండుగకు కాకుండా,బట్టలు దసరాపండగకు నీకూ పిల్లలకూ  కొంటానోయ్, పిల్లలు పండగబట్టలని పేచీలు పెట్టకుండా నచ్చచెప్పు. ధాన్యం పట్టికెళ్ళిన మారుబేరగాడు ఇంకా ఇప్పట్లో డబ్బులిచ్చేలాలేడు."నాన్న అభ్యర్థన.
    "పోనీయండి! ఎప్పుడు కొత్తబట్టలు కట్టుకొంటే అప్పుడే పండగ పిల్లలకు. నాకిప్పుడు చీరలకేం లోటొచ్చిందీ, వాళ్ళూ వీళ్ళూ పెట్టినవి బోల్డన్ని పెట్టెలోపడి ఏడుస్తున్నాయి.మీరు ఊరికే యిదవ్వకండి. అయినా పిల్లకికూడా కష్టం సుఖం తెలియాలి. "అమ్మ నాన్నకు భరోసాకల్పించే మాటలు.
     మారోజుల్లో సాధారణంగా ప్రతిఇంట్లోనూ,ఏదో సందర్భంలో  ఇటువంటి సర్ధుబాటు సంభాషణలు వినిపించేవి.    
     మరి ఈరోజుల్లో అటువంటి సర్దుబాట్లెక్కడ? సర్దుకొనేవారెవరు? మనసులో అనుకొన్నమాట పిల్లలకైనా, పెద్దలకైనా, ఆడకైనా మగకైనా ఎటువంటి పరిస్థితిలోనూ, 'హరిమీద గిరిపడ్డా, గిరిమీద హరిపడ్డా' జరిగి తీరవలసిందే. వాళ్ళమాట నెగ్గితీరవలసిందే. 'సర్దుబాట'న్న మాట ఊసేలేదీనాడు. అమ్మిల్లైనా, అత్తిల్లైనా సరే సర్దుబాటన్నది లేనే లేదు.అందుకనే ఈరోజుల్లో మనిషికీ మనిషికీ మాటా మాటా కలవటంలేదు.
మనసూ మనసూ కలవటంలేదు.మ మనిషికి విలువలేదు, మాటకూ విలువలేదు. అలాగని తామెంతగానో అందరికంటే, అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే డబ్బుకూ విలువలేదు.అనవసరపు ఖర్చులు, అక్కరలేని భేషిజాలు. కాదంటే కయ్యాలు, ఎంతటి బంధాలైనా, ఏదో ఒక చిన్నకారణంగా పుటుక్కున తెగతెంపులే.
     దీనికంతటికీ కారణం మార్కెట్ చెప్పే, అచ్చికపు బుచ్చికపు మాటలవలలో, వ్యాపారపు కిటుకుల వలలో చిక్కుకొని మధ్యతరగతి గృహయజమాని విలవిలలాడి పోతున్నాడు నేడు.
సర్దుబాటు పాఠాలు ఏ
పాఠశాలలలోనూ, కళాశాలలో నేర్పరు.అసలు పాఠశాలలలోనుండే వ్యాపారం మొదలౌతోందీనాడు.పుస్తకాలూ, బట్టలూ, షూస్ మొదలైనవన్నీ గవర్నమెంటు ఉచితంగా ఇస్తుంటే, ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలుపోసి, ఆ పాఠశాలల్లోనే  అన్నీ కొనాలి. ఫీజులుమాట సరేసరి, లక్షలకు లక్షలే.
     మాకాలంలో ఇప్పట్లా తరచు పాఠ్యపుస్థకాలు మారకపోవడంవలన, వెనకాలపిల్లలకి ఆపుస్తకాలు పనికివచ్చేవి. లేదా బంధువుల పిల్లలకో తెలిసినవారి పిల్లలకోలేదా, పేద పిల్లకో పనికివచ్చేవి.  పిల్లలు పెద్ద పరీక్షలకు ముందే సీనియర్ల దగ్గరకు వెళ్ళి వారికి కావలసిన పుస్తకాలని, నోట్స్ పస్తకాలతోసహా ముందే రిజర్వ్ చేసివుంచుకొనేవారు కొనక్కర లేకుండా.  
           ఆవిధంగా,పిల్లలలో సర్దుబాటూ, పొదుపూ, ఇచ్చి పుచ్చుకొనే ధోరణీ అలవడేది.   పాఠశాలనుండీ, కుటుంబంనుండీ నేర్చుకోవలసిన పాఠాలివి. పెరిగి పెద్దైన తరువాత వారి సుఖ జీవనానికి,  సర్దుబాటు ధోరణి ఎంతైనా అవసరం.
    
         సత్యవాణి

No comments:

Post a Comment