Tuesday, July 1, 2025

ఈ గజిబిజి 'బిజీ' పరుగులు ఎందుకు? ఎటు?

 ఈ గజిబిజి 'బిజీ' పరుగులు ఎందుకు? ఎటు?
‘నడవడం' అనేది మనకిప్పుడు ఒక ప్రత్యేక వ్యాయామం అయింది. ఉదయమో, సాయంత్రమో ఒక నియమిత కాలంలో పనిగా నడవాలి. కానీ ఒకప్పుడు అది జీవనవిధానంలో భాగం. మన పనులన్నీ నడకతో, వ్యాయామంతో కూడినవే. అసలు ప్రత్యేకించి నడవడం ఆశ్చర్యమే. చివరకు నడకకూ యంత్రాలొచ్చాయి. హతవిధీ! ఇప్పుడు అదో పెద్ద వ్యాపారం. అలాగే చేతులు తిప్పడం, నడుమును తిప్పడం వంటివన్నీ వివిధ ‘ఎక్సర్సైజులు’గా, యంత్రాలుగా, క్లబ్బులుగా - వాటిని నిర్వహించడం ధనార్జన సాధనలుగా కొందరికి ఉపకరిస్తున్నాయి.

పనికిమాలిన రుగ్మతలతో, మానసిక ఒత్తిడులతో నలిగిపోయే జీవనవిధానాలను ఏర్పరచుకున్నాం. వాటినుండి ఉపశమనాల కోసమని మళ్ళీ రకరకాల వ్యాయామ వ్యాపారాలు. ఇంకొన్నాళ్లకి కొత్తరకాల వ్యాయామాలు రావచ్చు. బహుశా “నమిలి తినడం ఒంటికి మంచిది” అంటారు వైద్యులు. పంటికి వ్యాయామం ఉండాలని, మనం జ్యూసులకీ, ఓవెన్ ఆహారాలకీ అలవాటుపడి ఫలాలను సైతం కొరికి తినడం మానేస్తున్నాం. ఆధునిక సుకుమార నాగరికత ప్రభావం. క్రమంగా దంతాలకు పటుత్వం కోసం మన వ్యాయామ వ్యాపారకేంద్రాలు ‘నమిలి తినుట' అనే కొత్త ఎక్సర్సైజుని ప్రవేశపెడతారేమో! లేదా అందుకు కొత్త యంత్రాన్ని కూడా కనిపెట్టవచ్చు.

మన ఇంద్రియాలన్నిటినీ సరియైన పద్ధతిలో వినియోగించే జీవనవిధానం మనకు ఉంది. అలాగని ప్రాచీనపద్ధతుల్లో బ్రతుకుతూ ప్రగతికి దూరంగా వెళ్ళమని కాదు. ప్రతి దానికీ ఒక సమన్వయముండాలి. నడవడమనే 'స్వాభావిక క్రియ' వల్ల శరీరంలో సర్వేంద్రియాలు స్పందిస్తాయి.

ఈ సహజచర్యను కాదని మనం ఒక కిలోమీటరు దూరానికి కూడా ఏ వాహనాన్నో ఉపయోగించాల్సిన సోమరులమౌతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎటు నిర్దేశమో తెలియని వ్యర్థపు పరుగులు పెడుతున్నాం. ‘సుఖం కోసం' అని సమాధానం చెప్పుకుంటే, నిజంగా సుఖపడుతున్నామా! భ్రమలతో భయాలతో, భ్రమణమే బ్రతుకుగా సాగిస్తున్నాం.

కానీ నిజానికి మనలోనే గొప్పశక్తులు దాగి ఉన్నాయి. వాటిని జాగృతపరచే ప్రక్రియలు సనాతన జీవనవిధానంలో ఇమిడ్చారు. సహజ వనరులతో, స్వాభావిక ప్రక్రియలతో సాగే వ్యవసాయ విధానాన్ని కాదనుకుని ఎరువులతో, మందులతో పండించే కృత్రిమ పద్ధతులు అలవాటై పంటలనీ, భూములనీ నిస్సారాలు చేసుకుంటున్నాం. కానీ మనకీ కృత్రిమత్వాలను అలవాటు వేసిన విదేశీయులు మాత్రం ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులైతేనే, సహజ ప్రక్రియలతో పండించినవైతేనే వారికి ఎగుమతి చేయాలని షరతులు పెడుతున్నారు. మన నేతలు కూడా కృత్రిమ ఉత్పత్తులు స్వదేశీయులకి, సహజ బలోపేత పదార్థాలు విదేశీయులకి పంపిస్తున్నారు.

ఆహారపదార్థాల పరిస్థితి ఇలా ఉంటే ప్రాణాయామం, ధ్యానం, ప్రార్థన, యోగాభ్యాసం వంటి చక్కని ప్రక్రియలు మనకున్నవి వారు గ్రహించి అభ్యసిస్తుంటే, మనం వారి వ్యాయామాలను అనుకరిస్తున్నాం. వారు అధ్యయనం చేసి మన ఔన్నత్యాన్ని స్వీకరిస్తుంటే, మనం అనుకరణతో మన గొప్పతనాలకు నీళ్ళొదులుకుంటున్నాం. అంతర్గతశక్తుల్ని ఆవిష్కరించుకుని అన్ని సమస్యల్నీ పరిష్కరించుకునే ధ్యానాది యోగప్రక్రియలు, ఉపాసన వంటి పద్ధతులున్నాయి. ఇవన్నీ మనలోని మహాచైతన్యాన్ని జాగృతపరచే విధానాలు. ఈ విషయాన్ని పరిశీలించకుండా వాటిని మూఢవిశ్వాసాల క్రింద ఒకనాడు జమకట్టిన విదేశీయులే ఇప్పుడు ఈ ప్రక్రియలనే తరుణోపాయాలుగా తలకెత్తుకుంటున్నారు.

ఆత్మవిచారణ వంటి ఉపనిషత్ జ్ఞానం, ధర్మభక్తి ప్రబోధాలతో అంతర్ముఖ ప్రయాణం, ధార్మిక విచారణ కలిగించే ప్రాచీనవిజ్ఞానాన్ని తిరస్కరించి మనలోని శాంతిని, నిబ్బరాన్నీ కోల్పోతున్నాం. మానవ సంబంధాల ధార్మిక పటిష్టతలని సడలించుకుని అస్తవ్యస్తపు ఒత్తిడులకు లోనై, చిత్ర విచిత్ర మానసిక వ్యాధులను సమాజంలో ప్రసరిస్తున్నయి.

ఈ పుత్తడి మెరుగుల నాగరికత పొట్టనిండా అనారోగ్యపు తుప్పుని నింపుకుంటోంది. విలాసాలకీ, సులభంగా సుఖపడడానికీ వెంపర్లాడుతూ శరీరానికీ, మనస్సుకీ సక్రమమైన వ్యాయామాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ దశను సవరించే ప్రయత్నం చేయాలి. "నీలో పరమేశ్వర చైతన్యం ప్రసరిస్తోంది. దాన్ని గ్రహించు” అని బోధించిన ఆర్షగ్రంథాల సారాన్ని నేటితరానికి బోధించాలి. దానిని ఆవిష్కరించుకునే మన సనాతన ధార్మిక జీవనవిధానాన్ని అలవరచాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం.

[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ” గారు రచించిన వ్యాసం]

No comments:

Post a Comment