Tuesday, July 1, 2025

 ♠️శంకరాభరణం శంకరశాస్త్రి జె.వి. సోమయాజులు గారి జయంతి సందర్భంగా జ్ఞాపకాల సంస్మరణ నివాళులు 

స్టిల్ :- త్యాగరాజ స్వామి వారిలా  సోమయాజులు , 'త్యాగయ్య' 1981 చిత్రం లోనిది. 

ముఖాన గాంభీర్యత.. నుదుటన విభూతిరేఖలు.. సాంప్రదాయ బద్ధమైన పంచెకట్టు.. సంస్కృతిని ప్రతిబింపచేసే జీవన శైలి. ఆయన పేరు జొన్నలగడ్డ వేంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. వెండితెర పేరు జెవి సోమయాజులు, ప్రేక్షకులకు మాత్రం శంకరాభరణం శంకరశాస్త్రి, రంగస్థలంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన వెండితెరపైనా, బుల్లితెరపైనా మెరిసే ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.

శ్రీకాకుళం జిల్లా లుకలాంలో 1928 జూస్ 30 తేదీన జొన్నలగడ్డ వేంకటశివరావు, శారదాంబ దంపతులకి జన్మించిన సోమయాజులు పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. చదువుకొనే వయసులోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొన్న ఆయన తన సోదరుడు, ప్రముఖ నటుడు రమణమూర్తితో కలిసి కన్యాశుల్కంతో పాటు నాటక ప్రదర్శనలిచ్చేవారు. కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్ర వేస్తూ ప్రసిద్ధి చెందారు. 45 ఏళ్లలో 500 ప్రదర్శనలు ఇచ్చారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. 

మహబూబ్ నగర్ డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే 'శంకరాభరణం'లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందే ‘రాధా కృష్ణయ్య' చిత్రంలో కీలక పాత్రని పోషించారు. అయితే ఆ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో పేరు రాలేదు. ‘జ్యోతి’లోనూ ఓ పాత్రని పోషించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శంకరాభరణం’తో సోమయాజులు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి విశేషమైన పేరు సంపాదించారు. 'సప్తపది', 'త్యాగయ్య', 'వంశవృక్షం', 'సితార', ‘తాండ్ర పాపారాయుడు', 'మగధీరుడు', 'మజ్ను' ఇలా అన్ని భాషల్లో కలిపి 150కిగాపై చిత్రాలు చేశారు సోమయాజులు. అయితే ఇన్ని సినిమాలు చేసినా గానీ.. జెవి సోమయాజులు అనగానే.. అందరికీ గుర్తుకొచ్చే పాత్ర మాత్రం శంకరశాస్త్రి. అంతలా ఆ పాత్రకు జీవం పోసిన సోమయాజులు. 

ఒక్కొక్కరు ఒక్కో పాత్ర కోసం పుట్టారా అన్న భావం కలిగించేల ఆ పాత్ర తీరు, ఆహార్యం, వ్యక్తిత్వం, గంభీరత, సాంప్రదాయ కళాభినివేషం లాంటి  జొన్నలగడ్డ వెంకట సోమయాజులు, శంకరశాస్త్రి కోసం పుట్టినట్టు కనిపిస్తుంది. 

అంతకు ముందు ఆయన ' రారా కృష్ణయ్యా 'లో తొలిసారిగా పాత్రధారణ చేసినా, 'శంకరాభరణం'తోనే విఖ్యాతులయినారు. 

నాటకరంగం సినిమా రంగానికి పెట్టిన 'భిక్ష'లో ఆయన ఒకరు. చిన్నతనం నుంచి స్వస్థలమైన విజయనగరంలో నాటకాలు ప్రదర్శిస్తూ, ఔత్సాహికులలో విశిష్టమైన నటుడిగా ఆయన ప్రఖ్యాతి పొందారు. నాటకాల పోటీలు నడిపిన పలు పరిషత్తుల్లో ఆయన చాలాసార్లు ' ఉత్తమ నటుడు ' బహుమతి అందుకున్నారు. నాటకాలతో పరిచయం వున్నవాళ్లకు సోమయాజులు పేరు కొత్త పేరేం కాదు. 'కన్యాశుల్కం'లోని రామప్పపంతులు, 'గుమస్తా'లోని గుమస్తా, 'పంజరం'లోని డాక్టరు, 'నాటకం'లో రఘుపతి,'కాళరాత్రి'లోని నరహరి, 'పల్లెపడుచు'లోని సూరయ్య మొదలైన పలు పాత్రల్లో సోమయాజులు జీవించారు; 'కారెక్టర్ యాక్టర్'గా ప్రశంసింపబడ్డారు. సోమయాజులుది తనదీ అని ఒక ప్రత్యేక బాణీ. ఆయన బాణీని అనుకరించినవారూ వున్నారు; అనుకరించాలని ప్రయత్నించినవారూ వున్నారు. “ఆయన వయసులోని సగం వయసు రంగస్థలం మీదనే  గడిచింది" అని అయన అన్నమాటలో అతిశయోక్తి కనిపించదు. ఆ విధంగా నాటక రంగం మీద విశేషమైన అనుభవం గడించి, శంకరశాస్త్రిగా చిత్రాల్లో అవతరించారు. 

ఆయనకు ఈ పాత్ర తెచ్చిన ఖ్యాతి, ఘనత - కొలవలేనివీ, మాటల్లో చెప్పలేనివీ. విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్ హెూదాలో వున్న సోమయాజులును ఇవాళ ఎవరూ సోమయాజులుగా చూడడం లేదు; శంకరశాస్త్రిగానే చూస్తున్నారు. శంకణాల దగ్గర్నుంచి, పాదాభివందనాల వరకూ ఆయనకు లభిస్తున్న అభినందన కెరటాలు అనంతం! ఒక్క చిత్రంతోనే పెక్కు చిత్రాల పేరు తెచ్చుకున్న సోమయాజులు గారిని,

జయంతి సందర్భముగా జ్ఞప్తికి చేసుకుంటూ🙏

No comments:

Post a Comment