ఇది నా స్వీయసృజన, అనుకరణ కానీ అనువాదం కాదు
రచన: #అంజనీదేవి శనగల
శీర్షిక: నా బాల్యం పోయింది
“ఏమైంది బంగారం ఎందుకు అలా ఉన్నావు?” అని అడిగాడు వాసుదేవ్. దిగులుగా ఏడుపు మొహంతో కూర్చుని ఉన్న ఏడేళ్ల మనవరాలు చిన్నిని చూసి.
“తాతయ్యా .. అదీ .. మరీ .. ” అని ఏడవటం మొదలుపెట్టింది చిన్ని.
“తాతయ్యా! చిన్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వ్యాన్ లో కూడా ఎవరితో మాట్లాడకుండా ఇలాగే ఏడుపు మొహం పెట్టుకుని డల్ గా కూర్చుంది.” అంది తొమ్మిదేళ్ళ స్వీటీ చెల్లి దిగులుగా ఉండటం చూసి.
“బంగారం కదూ, ఏమైందో చెప్పు” అన్నారు చిన్నిని అని
అనునయిస్తూ.
“మరీ .. అదీ… నా బాల్యం పోయింది” అని ఏడవటం మొదలు పెట్టింది.
“బాల్యం పోవటం ఏమిటి?! ” అన్నారు ఆశ్చర్యంగా వాసుదేవ్.
“ఈ రోజు స్కూల్లో మా టీచర్ ఒక లెసన్ చెప్పారు. బాల్యంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఎగురుతూ, గెంతుతూ, పరుగులు పెడుతూ, దొంగాట, కోతి కొమ్మచ్చి ఇంకేవో కొత్త కొత్త ఆటలన్నీ ఫ్రెండ్స్ తో ఆడుతారంట. అప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారoట. ఇంకా హోంవర్క్ రాసుకొని, చదువుకున్న తర్వాత అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుందంట,
నానమ్మ మంచి మంచి కథలు చెప్పి, పాటలు పాడి వినిపిస్తుందంట, ఇవేమీ లేకపోతే బాల్యం లేనట్లే, అని టీచర్ చెప్పారు. అంటే నా బాల్యం ఎక్కడో పోయింది” అని ఏడవటం మొదలు పెట్టింది చిన్ని.
“అవును తాతయ్యా! నాకు కూడా ఇవన్నీ తెలియవు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టివిలో కార్టూన్ షోస్ చూడటం, మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, గేమ్స్ అయితే ప్లేస్టేషన్ లో ఆడటమే తెలుసు. మా టీచర్ ఒక లెసన్లో కర్ర- బిళ్ళ, తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలు ఎన్నో చెప్పారు. ఆ అటలేవీ మాకు తెలియవు. ఇక్కడ ఆడుకోవటానికి పిల్లలు కూడా ఎవరూ రారు." అంది స్వీటీ అయోమయంగా.
“నా బాల్యం పోయింది” అని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది చిన్ని
“అమ్మడూ! నీ బాల్యం ఎక్కడికీ పోలేదు. నీ దగ్గరే ఉంది. కాకపోతే కాలక్రమేణా కొన్ని మార్పులు జరిగినాయి. ఇళ్ళు పెద్దవి అయ్యాయి, మనసులు చిన్నవి అయ్యాయి. పని వత్తిడితో పొరుగు వారిని పట్టించుకునే ఓపిక, తీరిక ఎవరికీ ఉండటం లేదు. పిల్లలతో పరుగులు పెడుతూ ఆడుకునే ఆటలకు బదులు ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. దానివల్ల ఎక్సర్సైజ్ లేక చిన్న వయసులోనే ఊబకాయం వచ్చేస్తుంది” అన్నారు వాసుదేవ్.
“మరి చందమామ, గోరుముద్దలు, కథలు,పాటలు? ” అని అడిగింది ఆసక్తిగా స్వీటీ.
“అదే చెప్తున్నా. చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టే స్థానంలో సెల్ఫోన్లో వీడియోస్ చూపిస్తూ తినిపిస్తున్నారు.
ఏం తింటున్నారో తెలియకుండా వీడియోస్ చూస్తూ తినేస్తున్నారు. చాక్లెట్లు జంక్ ఫుడ్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. నానమ్మ, తాతయ్యలు చెప్పాల్సిన, కథలు, పాటలు స్థానంలో మీరు టీవీలో కార్టూన్ షోలు, కిడ్స్ ఛానల్ లో వుండే దెయ్యం కథలు చూస్తూ భయపడుతున్నారు" అన్నారు వాసుదేవ్.
“నానమ్మ– అంటే ఎవరు తాతయ్యా? " అని అడిగింది చిన్ని.
“హతవిధీ! అదేనమ్మా మన దౌర్భాగ్యం. నువ్వు “గ్రానీ” అని పిలుస్తున్నావే, ఆవిడే మీ నానమ్మ. స్వచ్ఛమైన తెలుగులో నానమ్మ అని పిలవకుండా “గ్రానీ గ్రానీ” అని పిలుస్తున్నారు. ప్రకృతి ఒడిలోహాయిగా గడపాల్సిన బాల్యం, చీకటి గదిలో టీవీల ముందు గడిచిపోతుంది” అన్నారు వాసుదేవ్.
“ఆఁ..ఆఁ... నా బాల్యం పోయింది” అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది చిన్ని.
“ అమ్మా, నా చిన్ని తల్లివి కదూ, నీ బాల్యం ఎక్కడికే పోదు.నేను ఉన్నాను కదా, నీ బాల్యం భద్రంగా తిరిగి తీసుకుని వచ్చే పూచీ నాది” అన్నారు.
“ఎలా?” అన్నారు పిల్లలు ఇద్దరూ ఉత్సాహంగా.
“రోజా మీ ఇద్దరూ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నేనూ మీ నానమ్మ, మిమ్మల్ని పార్కుకి తీసుకొని వెళతాము. అక్కడ మీరు తోటి పిల్లలతో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుందురు గాని. మా ఇద్దరికీ వాకింగ్ అయినట్లు ఉంటుంది, సరేనా! ” అన్నారు వాసుదేవ్.
‘ఓ ! సరే తాతయ్యా . అయితే నేను మా ఫ్రెండ్స్ ను కూడా రమ్మని చెప్తాను” అంది సంతోషంగా చిన్ని.
“నేను కూడా మా ఫ్రెండ్స్ ను పార్కుకి రమ్మని చెప్తాను తాతయ్యా ” అంది స్వీటీ.
“మరి చందమామ గోరుముద్దలు” అని టీచర్ చెప్పిన రెండో పాయింట్ తీసింది చిన్ని,
“దానిదేముంది. మనం మేడ పైకి వెళ్లి అందరం కలిసి వెన్నెల్లో కూర్చుని చక్కటి చందమామను, వెన్నెలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం " అన్నారు.
“మంచి ఆలోచన మావయ్య” అంది రమ్య.
“అవును నాన్న” అన్నాడు రమేష్ ఆఫీస్ నుంచి అప్పుడే అక్కడకు వచ్చి.
“మరి నానమ్మ కథలు, పాటలు” టీచర్ చెప్పిన మూడో పాయింట్ గురించి ఆరా తీసింది.
“మీ ఇద్దరూ రోజు నానమ్మ దగ్గరకు వచ్చి పడుకోoడి, నానమ్మ మీకు మంచి మంచి కథలు చెప్తుంది.” అన్నారు,
“మరి పాటలు” అంది చిన్ని సందేహంగా,
“మీ నాన్నమ్మ పాట పాడితే మనం అందరం భయపడి పారిపోవాలి, వద్దులే నేనే మీకు మంచి మంచి పాటలు పాడి వినిపిస్తానులే.” అన్నారు వాసుదేవ్,
“నేను పాడితే ఇక్కడ వున్నవాళ్లే భయపడతారు. కానీ మీ తాతయ్య పాడితే ఊరంతా భయంతో గగ్గోలు పెడుతుంది, వద్దురా బాబు నేనే నీకు మంచి మంచి కథలు, పాటలు పాడి వినిపిస్తాను.” అని చెప్పింది వంటగదిలోంచి వీళ్ళ మాటలు వింటున్న వసుధ అక్కడికి వచ్చి.
వసుధ మాటలకు అందరూ నవ్వుకున్నారు.
“తమ బాల్యం తమకు తిరిగి వస్తుందని” తాత నానమ్మ, తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గెంతులువేసారు పిల్లలు.
******************
No comments:
Post a Comment