Tuesday, July 1, 2025

 రచయితలు తమ అనుభవాలను అభిప్రాయాలను పాళీల్లో నింపి మన కందిస్తారు.

కొంత మంది రాతలను చదివి మనం ఎంతలా ప్రభావితం అయి పోతామంటే వాళ్ళని మన సొంత వాళ్ళు గా మన ఇంట్లో వాళ్ళు గా కలిపేసుకునేంత... ముఖ్యంగా నాలాంటి పుస్తకాల పురుగులు

ఓ సారి నేనొక రచయిత గారి ఆత్మ కధ చదివా అది చదివాక నాకు ఆయన రచనల పైనే కాదు తెలుగు భాష పైన కూడా ఎంతో అభిమానం కలిగింది ఎంత అంటే మాటల్లో చెప్పలేను

ఆ పుస్తకం ఏంటి అంటారా" కొతి కొమ్మచ్చి"

తెలుగు భాష లోకి కొన్ని కొత్త పదాలను చేర్చి మనందరం ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే లా చేసుకున్నారు. 

ఆ పదాలేంటంటే "అమ్యమ్య" ,"తీత","తుత్తి".

ఈయన పుట్టింది, చిన్నతనం లో కొన్నాళ్ళు పెరిగింది, తూర్పు గోదావరి జిల్లాలో.... అందుకే కామోసు ఎటకారాన్నీ, వ్యంగ్యాన్ని కూడా తన పదాల విరుపు ల్లో అద్భుతంగా ప్రదర్శించగలరు....

" ఈస్ట్ ఈస్టే  ఎస్ట్ ఎస్టే"అని తేల్చాశారు కూడా ఉభయగోదావరి జిల్లాల గురించి

చిన్న ప్పుడు అంటే ఈటీవీ మన టీవీ ల్లో ప్రసరించడం మొదలైన రోజుల్లో మా అమ్మ" ఈ సినిమా చూద్దామే సినిమా చాలా బావుంటుందే"అని చూపించిన సినిమా " ముత్యాల ముగ్గు" అందులో అప్పుడు బాగా నచ్చింది " భజన సంఘం" బిట్టు.
ఆ తర్వాత బాగా ఊహ తెలిసిన తర్వాత నచ్చింది.
" సిఫార్సులు రికమండేషన్ల తో కాపురాలు చక్కబడవు " మామగారు అనే‌ వాక్యం.
అది నాకు ఓ కధానాయిక మాటల అనిపించలేదు ఎప్పటికీ గుర్తుంచుకుని మన నడవడిక లో కలుపుకోవాల్సిన వాక్యం లా అనిపించింది.

అలాగే " గోరంత దీపం" లో తండ్రి కూతురికి పెళ్ళి చేసి పంపేటప్పుడు చెప్పే మాటలు , ఆ  మాటల్లోనే తండ్రి అంటాడు " ఇవాళ్టి నీ అత్తిల్లే రేపు నీ కూతురికి పుట్టిల్లు అవుతుంది అని గుర్తుంచుకో అంటాడు ఎంత బరువైన నర్మగర్భితమైన మాట

"రాధాకళ్యాణం" సినిమా క్లైమాక్స్ లో ఈ క్రింది మాటలతో ఎంత అందంగా ముగుస్తుందో
" ప్రతి ఆడపిల్ల హృదయం పెళ్ళికి ముందు ఓ అద్దం లాంటిది. పెళ్ళైన తర్వాత అది భర్త ముఖంతో ఓ చిత్రం లా మారుతుంది" అని 

ముళ్ళపూడి వారి ఉవాచ లు కొన్ని

1. అమ్మకానికి పునాది నమ్మకం

2. ఏ బంధానికైనా పునాది నమ్మకం గౌరవం

3. కాల్లో ముల్లు గుచ్చుకుందని బాధ పడడం ఎందుకు కంట్లో గుచ్చుకోలేదనీ సంతోషించక

4.మంచివాడు చెడ్డవాడు అని వేరే ఉండరు అవకాశం వస్తే మంచి వాడు చెడ్డవాడు గా మారొచ్చు అవకాశం రాక చెడ్డవాడు మంచి వాడు గా ఉండి పొవచ్చు

 ఇలా ఎన్నో, బాపు గారు మెదడైతే ఈయనది హృదయం లేక ఈయనది మెదడైతే బాపు గారిది హృదయం. ఇద్దరిదీ విడదీయరాని బంధం.

"అజ్ఞానం ఇచ్చిన ధైర్యం విజ్ఞానం ఇవ్వలేదని" ఇల్లేరమ్మ ఉవాచ కానీ " కోతి కొమ్మచ్చి" చదివాక నాకు ఈయన ఈ ఉవాచకు పూర్తి గా వ్యతిరేకం అని తెలిసింది.

అందరినీ అదుపు ఆజ్ఞ ల్లో ఉంచే మన చండీరాణీ గారు ముచ్చట గా రాసిన" అత్తగారి కధలు" లకు పాతిక రూపాయల పారితోషికం పంపిన సంపాదకుడు ఈయన. శంబు ప్రసాద్ గారే ఏం చెప్పాలి అని ఆలోచించే పరిస్థితి అది.ఆవిడ అందుకు చాలా సంతోషించి వేల రూపాయల పారితోషికం కూడా ఇంత సంతోషం ఇవ్వలేదు రవణ గారు అని దాన్నావిడ ఎలా కర్సెట్టారో నవ్వుతూ వివరించారనుకోండీ

తన అప్పుల బాధలను కూడా హాస్యం గా రాసి మనల్ని  నవ్వించిన ఘనుడీయన

మనకందరికీ బాగా తెలిసిన మన తెలుగు వాళ్ళుం మన సొంతం చేసుకున్న "బుడుగు"మాటలు ఈయన వైతే రూపం బాపు గారిది.

అలా ఓ రాధ, ఓ గోపాలం,ఓ సి గానపెసునాంబ, ఓ బామ్మ, ఓ బుడుగు గాడి బాబాయ్ ఇలా మనందరికీ ఇష్టులై ఈయన రాతల్లో పుట్టి బాపు గారి గీతాల్లో తేలి మన వాళ్ళైపొయారు. రాతలాయన గీతలాయన ఈ రోజు భౌతికంగా మనతో లేక పోయినా వీళ్ళని మాత్రం మన మనసుల్లో ఎప్పటికీ నింపేశారు.

నాకు బాపు గారన్నా రమణగారన్నా చాలా ఇష్టం.ఇద్దరూ సమానమే. కానీ రమణ గారీ భాషలో చెప్పాలంటే రమణ గారు ఇంకొంచెం ఎక్కువ సమానం అన్నమాట.

ఆయన్ని కేవలం ఓ సినిమా రచయిత గా పరిగణిస్తే  నేను అస్సలు ఒప్పుకోను. ఓ గొప్ప రచయిత ఆయన... 

"కోతి కొమ్మచ్చి" చదివాక ఆయన నాకు రచయిత లా కూడా అనిపించలా నా పెత్తండ్రో, మేనమామో తన జీవిత పాఠాలను అనుభవాలను పక్కన కూర్చుని చెపుతున్నట్లు అనిపించింది. అందులో కొన్ని మాటలు కొన్ని సంఘటనలు నా మనస్సు లో ముద్రించుకుపోయాయి.
  

ప్రతి ఒక్కరూ జీవితం లో ఒక్కసారైనా చదవాల్సిన  పుస్తకం " కోతి కొమ్మచ్చి"

మహా మనిషి రమణ గారి జయంతి సందర్భంగా .....

No comments:

Post a Comment