Tuesday, July 1, 2025

 డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారి రచన 

ఊరు మాటుమణిగింది. అంతవరకూ అహంకారాన్ని చూపించిన సూర్యుడు అణకువగా అణగారిపోయాడు. నిరంకుశ ప్రభువుని సాగనంపి చల్లని మారాజు మెల్లగా పైకొచ్చాడు. వెదురుదడినానుకుని అల్లుకున్న సన్నజాజులు, పక్కింటి గోడవారగా పారిజాతాలు కలిసి కుమ్మక్కై గాలిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. తన దారిన తను పోతుంటే నిలిపి, నిలదీసి పరిమళాల సొబగులద్ది, పదిమందికీ పంచమని పంపించాయి.

మనసంతా మధురమైన బాధ. అమ్మ గుర్తొచ్చింది. వెలుగుండగా అమ్మ, చీకటిపడిన పిమ్మట చందమామ! ఇవే తనకి కొండంత సేద. దీపాలు వెలిగించిన గుమ్మంలో నులకమంచం మీద అక్క ఒళ్లో పడుకుంటే బోలెడు కథలూ, కబుర్లూ చెప్పేది. అందులో రాకుమారులకి రాని విద్యా వుండేది కాదు, ఓడించని రాక్షసుడూ ఉండేవాడు కాడు. గుర్రాలు, సరస్సులు, తటాకాలు, రాకుమార్తెలు...! 

ఇంత కథా పూర్తిగా వినకుండానే మధ్యలో పడుకుండిపోయి, మర్నాడు మళ్లీ మొదట్నుంచీ చెప్పమంటూ చేసే అల్లరీ గుర్తొచ్చింది. అదెప్పటికీ సశేషమే!

ఇప్పుడెవరున్నారు? తనకు తానే! ఏం? అసలుకి తనెంత అందగాణ్ణని? వేలితో తాకితే గుచ్చుకుంటుందేమో అనేంత సూదిగా ముక్కు, అనవసరమైన కండల్లేని ఆరోగ్యవంతమైన శరీరావయవాలు. బ్రతకడానికి కావలసిన మనోధైర్యం, గొంతెత్తి పాడితే అంతెత్తుకి ఎగసిపడే మనోహరమైన గాత్రం!

‘ఒక పాటందుకోరా!’ అని అడిగిందే తడవుగా మొహమాటమెరుగని నిబద్ధత తన సొంతం. పాట మొదలయ్యేసరికి లేతపెదాలతో పాలుతాగే పసివాళ్లూ, లేగదూడలకి పాలిచ్చే పశువులూ కూడా పాట పూర్తయ్యేదాకా కాసేపు ఆగిపోయేంత మహత్తు!

అందాన్ని చూసేందుకు పనికిరాని ఆ కన్నులు మాత్రం చూసేందుకు చాలా అందంగా వుంటాయి....!

అవును. అందమైన బొమ్మను చేస్తూ, కళ్ల దగ్గరకొచ్చేటప్పటికి కళ్లల్లో నిప్పులు పోసేసుకున్నాడా బ్రహ్మదేవుడు. అదే చేత్తో అమ్మనూ పట్టుకుపోయాడు.

అంత చిన్న వయసులోనూ తత్త్వాన్ని తలకెక్కించుకుని, లలితంగా పాడేసే విద్య వాడికబ్బింది.

గోదాట్లో పడవ సాగిపోతుంటే పాటందుకుంటాడు. వాడికెవరూ చెప్పనక్కర్లేదు. 

‘నదినిండా నీళ్లు వున్నా
మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్లే
గరిటైతే గరిటెడు నీళ్లే’

అనగానే అంతవరకూ తానొక్కడే కష్టాల్లో కూరుకుపోయానని కుమిలిపోయే గుమాస్తా ఒకడు ‘నిజమేకదా?’ అంటూ చిరునవ్వొకటి చిందించేవాడు.

‘ఎవరెంత చేసుకుంటే అంతేకాదా దక్కేదీ?’

అన్న సూక్ష్మం... వినడానికి నిన్ను శాంతపరుస్తుంది. కానీ మనసుని ఉల్లాసపరచదు. అయితే వీడి గొంతులో మహత్యమేమో గానీ, అదికూడా నిజమేలే అనిపించేస్తుంది.

‘ధరతక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్తమతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువ’ అంటూ...

డబ్బుచేసిన ఆసామీల దర్పానికి కాల్చకుండా వాతలూ పెడతాడు. ఎగిరెగిరిపడే హంగుల్ని ఎండగడతాడు కూడా!

‘తమ సొమ్ము సోమవారం
ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం
ముప్పొద్దుల తింటా’రంటూ...

పేరసైట్ బతుకుల్ని పదిమందిలో పేర్చేస్తాడు.

‘పరులకింత పెట్టినదే
పరలోకం పెట్టుబడి...’

ఇహలోకంలో అనుభవాలకి పరలోకంలో పరిహారాలు వుంటాయని నమ్మేవాళ్లందరూ వాడి మాట విని వెంటనే ఎదురుగా కనబడే దీనులకి ఒక డబ్బు దానం చేసేవారు. 

అప్పటికప్పుడే ఎంతో పుణ్యాన్ని మూటకట్టేసుకున్న భావన. గోదాట్లో నాణాలు విసిరి దణ్ణం పెట్టుకునే అమాయక ప్రజకి పాపభీతి వుండడం సహజమే కదా?

తనకి తోడుగా ఆ కాలు విరిగిన కుర్రాడొకడు తోడయ్యాడు. వాడి మొహమంతా దైన్యం. చూపులెప్పుడూ శూన్యం. కానీ ఆ నడకలో ఒక ధైర్యాన్నీ, మనోనిబ్బరాన్నీ నింపిన ఘనత మాత్రం మనవాడిదే!

ఏదోలా డబ్బుతెచ్చి తనకు చూపు తెప్పిస్తానంటూ మాటిమాటికీ అంటున్న వాడితో ‘నీవుంటే వేరే కనులెందు’కంటూ ఆపేశాడు.

‘నా ఎదురుగ నీవుంటే తొలిపొద్దు
నువు చెంతన లేకుంటె చీకటి
నీచేయి తాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు’

అంటూ వెలుగురేఖల్నీ, చీకటిపొరల్నీ, పాలవెన్నెలల్నీ, తేనెజల్లుల్నీ కూడా తన సాంగత్యంలోనే వున్నాయంటూ నిరూపణ చేసి ఒప్పించేశాడు.

‘నిన్న రాతిరీ ఓ కలవచ్చిందీ
ఆకలలో ఒక దేవత దిగివచ్చింది
చందమామ కావాలా 
ఇంద్రధనువు కావాలా
అమ్మనవ్వు చూడాలా
అక్క ఎదురు రావాలా
అంటూ అడిగిందనీ...

నాకవేవీ అవసరం లేదనీ..

నీవుంటే వేరే కనులెందుకని
నీబాటలో అడుగులు నావని
నా పాటలో మాటలు నీవనీ’

సర్దిచెప్పాడు.

తినడానికి తిండే దొరక్క అలమటిస్తోంటే వీడి ధైర్యం చూడండి....

అడిగితే అయిదిచ్చారు
పనిచేస్తే పదొస్తుంది
దేశంనిండా దేవుడి ఏజెంట్లున్నారు....

‘పోనీరా, పోతే పోనీరా
పోయింది పొల్లు.. మిగిలిందే చాలు!’
అంటూ ఇంకా ఇలా సెలవిచ్చాడు...

‘కష్టాలే కలకాలం కాపురముంటాయిట
సౌఖ్యాలు చుట్టాలై వస్తూపోతుంటాయిట
వెళ్లాలి బహుదూరం మోయాలి పెనుభారం
ఏమైనా కానీరా మనయాత్ర మానం... అంటూ నొక్కిమరీ చెప్పాడు.

ఎందుకాపాలి బ్రతుకుని? అన్నిటికంటే ఎంతో విలువైన మనసనేది మనిషి సొంతం. దాన్ని నీ చెప్పుచేతల్లో పెట్టేసుకుంటే కాలూచెయ్యీ లేకపోయినా, కావలసినవాళ్లు కాదనేసినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు. 

దేశం నిండా దేవుడి ఏజెంట్లు... అంటే మనచుట్టూ ఉండే ప్రపంచంలో కేవలం మంచినే చూసే ఆశావాద ధోరణి కనబడ్డం లేదూ? ఎవరో ఏదో అన్నారనీ, ఏ ఒక్కరూ సాయం రారనీ కుమిలిపోయే హృదయాలకి కొండంత అండగా నిలబడే పసివాడు వీడు.

‘ఎంత మబ్బు మూసినా
ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే వుంటుంది

ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా
నీలోపలి ఉద్దేశం
అల్లాగే వుండా’లంటూ భుజం మీద చెయ్యేసి ముందుకి నడిపిస్తాడు వీడు. 

‘స్నేహం’ చిత్రం కోసం ఆరుద్ర, సినారె అలవోకగా రాసిపడేసిన ఈ ఆణిముత్యాలు వింటోంటే ఏదో తెలియని ఆశావాదం. నిజమైన కష్టకాలంలో ఈ పాటల్ని విని, మనసుని నా అధీనంలో నిలబెట్టుకున్న అనుభవంతో చెబుతున్నాను....

సినీ సాహిత్యానికి మళ్లీ చందమామలు, వెన్నెలలు, ఆశాజ్యోతులు కావాలి. రావాలి. 

అవి ఆరిపోబోయే దీపాల్ని తప్పకుండా నిలబెడతాయి. 
ఆవిరైపోయే అవకాశాల్ని చమురల్లే అందిస్తాయి.

బ్రతకండి హాయిగా!

........కొచ్చెర్లకోట జగదీశ్

No comments:

Post a Comment