Saturday, May 30, 2026

 3️⃣3️⃣

*_🌞☀️గీతావాహిని☀️🌞_*

*⚔️🔱 12వ భాగం 🔱⚔️*

*_🔆మనస్సు ఏది చూచినా అది అంతా కావాలని కోరును. ప్రతి దానినీ ఆశించడమే దానికి పని:_*

దారములో పూసలు గ్రుచ్చబడినట్లు ఆనాహత ధ్వనియైన ప్రణవములో వేదములనెడి పూసలు గ్రుచ్చబడినవి. రసస్వరూపమైన తనలో జలము చేర్చబడినది. ఇట్టి సర్వాధారమైన ప్రణవములోనే మనస్సును లీనము చేయవలెననే కృష్ణపరమాత్మ యొక్క బోధ. శబ్దములో మనస్సును లయము చేసే స్వభావము కలదు. మనస్సు ఏది చూచినా అది అంతా కావాలని కోరును. ప్రతి దానినీ ఆశించడమే దానికి పని. అట్టి చంచల మనస్సునే శబ్దమున లయము చేయవచ్చును. అందువలననే మనస్సును సర్పమునకు పోల్చిరి.

పాముకు రెండు పిచ్చి గుణములు కలవు. ఒకటి వంకరి టింకరి నడక, రెండవది చూచినదానినంతా, అడ్డము వచ్చిన వాటినన్నింటినీ కరచుట. ఈ రెండునూ మానవునిలో అక్షరాల ప్రత్యక్షమగుచున్నవి. చక్కని నడకలేదు, చూచినవన్నింటినీ పట్టుకొనుటకు ప్రయత్నించును. అయితే పాములో ఒక పవిత్రమైన స్వభావమున్నది. అది ఏదనిన నాగస్వరము పట్టిన ఎట్టి విషసర్పమైనా ఆనందముగా అందులో పడగవిప్పి ఆడుతూ, తన సర్వస్వమునూ ఆ స్వరమున లీనము చేయును. అటులనే మానవుడును అభ్యాసము ద్వారా ప్రణవములో మనస్సును లీనము చేయవచ్చును. కనుక శబ్దోపాసన పరమాత్ముని పొందుటకు ప్రధాన మార్గమై యున్నది. శబ్దమే పరమాత్మ. అందుకనే మానవునియందలి పురుషార్థ శక్తిని నేనే అని పరమాత్ముడు తెలిపెను. పురషాకారమే మానవుని
ప్రాణము, అట్టి పురుషాకారమునకు ప్రాణమే లేకున్న మానవత్వమే లేదు. ఎట్టి ప్రారబ్ధమయిననూ పురుషాకారమునకు అణిగి మణగి ఉండవలసినదే. ప్రారబ్ధమున కంటే పురుషాకారము ముందుగలదు. ఇది తెలియక ప్రారబ్ధము ప్రారబ్ధమని ప్రారబ్ధమును బట్టి ప్రాకులాడుదురు వెట్టి మానవులు! ప్రతి  మానవుడూ పురుషాకారమును అనుసరించియే తీరవలెను. చేయకుండిన అట్టివాడు లోకమున అర నిమిషము కూడనూ నివసించలేడు. ఈ లోకమున పురుషార్ధమును అనుసరించి దాని శక్తిలో ధన్యుడవు కమ్మనే మానవుని పరమాత్మ సృజించెను. కాని, ఊరికే తిండికి చేటు, భూమికి బరువుగా సార్థకము కాని పనులతో పశువాంఛలతో భోగములు అనుభవింపమని పంపలేదు. నడుమువంచి పనిపాటులు చేయక, సోంబేరియై కండలు పెంచుకొని, లొట్టలు కొడుతూ, దిట్టంగా బలవమని పంపలేదు.

పరమాత్ముని మరచి ఆత్మవిశ్వాసమును కోల్పోయి పశువువలె జ్ఞానహీనుడయి అనుభవించినంత వరకూ ఆ ఫలితమును స్మరించి తదుపరి దానికి కృతజ్ఞతలేక క్రూరుడయి తిరుగుమని సృష్టించలేదు. ప్రకృతి అంతయూ పరమాత్మ రూపముగా భావించి, విశ్వసించి, చక్కగా వినియోగించుకొమ్మని కూడా తెలిపెను. కానీ ఇది నాది, అది నాది, నావారిది అని అహంకారముతో ప్రకృతిని వినియోగించుకొంటూ ప్రకృతియొక్క చట్టమును ఉల్లఘించి తన ఇచ్ఛాను సారముగా ప్రవర్తించు వారికి ప్రకృతే తగిన ప్రాయశ్చిత్తము చేయును. పతనానికి దారితీయును. అందుకనే కృష్ణపరమాత్మ తనను ఉపాసించు విషయమును విపులముగా అర్జునునకు తెలుపుచున్నాడు.

బావా! అనేకమంది నన్ను ఉపాసించుటకు కారడవులకు పోవుచుందురు; అది ఒక విధమైన వెర్రితనము, మూఢనమ్మకము. ఉపాసించవలెనన్న ఎక్కడికో, ఏ అడవులకో పోనవసరంలేదు. నేను లేని స్థానముకాని, నాది కాని రూపము కాని, లేదు. పంచభూతములూ నేనే. ఏ భూతము లేనిచోటు ఎచ్చట ఉన్నది? అంతటా నిండియున్న నన్ను అనుభవించుటకు ప్రత్యేకించి ఒక స్థానమనునది లేదు. విను! భూమిలోని గంధము నేను, అగ్నియందలి తేజస్సు నా స్వరూపం. సర్వ
భూతములలోని జీవినీ నేనే అయి ఉన్నాను. ఇంతియేకాక బలవంతులలోని కామ రాగ రహితమైన బలమును నేనై ఉన్నాను. సర్వభూతములలోని ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపముగా నున్నది (ఇచ్చట బలమనగా బుద్ధి బలమని తలంచవలెను). లోకమున అనేక విధములైన బలములున్నవి; ధనబలము, బుద్ధిబలము, విద్యాబలము, జనబలము, మనోబలము, దేహబలము అని కలవు. ఇవన్నియూ పరమేశ్వరుడనైన నా బలమనే భావించవలెను. కానీ అవి కామ రాగ రహితమై ఉండవలెను. అట్టివి మాత్రమే భగవత్ స్వరూపములనబడును. అట్లు కాక కామరాగ సహితమైన బలములు పశుబలములనవచ్చును. కాని పశుపతి బలము కానేరదు. కామమనగా లభించే అవకాశము, దాని చిహ్నములు కనిపించకున్ననూ, లేకపోయిననూ వస్తువులు కోరే ఆశను కామమందురు.
(సశేషం)

*🌼హరే కృష్ణ హరే కృష్ణ    కృష్ణ కృష్ణ హరే హరే🌼*

*(భగవాన్ శ్రీ సత్యసాయి బాబా)*

No comments:

Post a Comment