Monday, October 13, 2025

 6️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ య:l*
 *అఘాయురిన్డ్రియారామో మోఘం పార్థ స జీవతిll*

ఎవరైతే పై శ్లోకంలో చెప్పబడిన విధంగా సాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించరో, అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా, ఇంద్రియలోలుడై పాపము చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్ధము.

ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకకుండా, అంటే హెూమములు, పంచమహా యజ్ఞములను చేయకుండా, తాను చేసే కర్మలను ఒక యజ్ఞము మాదిరి ఆచరించకుండా, ప్రకృతి దేవతలను తృప్తి పరచకకుండా, ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతాభావన లేకుండా, కేవలం తన కోసరమే తింటుంటాడో, స్వార్థబుద్ధితో జీవిస్తుంటాడో, వాడు పాపాత్ముడు. వాడి జీవితము పాపభూయిష్టము. కేవలం ఇంద్రియములకు వశుడై, ఇంద్రియసుఖములను అనుభవిస్తూ జీవితం వృధాగా గడుపుతున్నాడు.

ప్రతిరోజూ ప్రతి గృహస్థు హోమం చేయ్యడం అందులో ఓషధులు వేల్చడం, వాటిని దేవతలకు అందచెయ్యడం మానవ ధర్మము. దాని వలన వర్షాలు కురుస్తున్నాయి. మానవులు వర్షముల వలన నీరు పొందుతున్నారు. నీటిని ఉపయోగించి ఆహార ధాన్యాలు పండించు కుంటున్నాడు. ఫలవృక్షముల నుండి ఫలములు పొందుతున్నాడు. కాని ప్రతిగా ఏమీ చేయడం లేదు.(దేవుడు ఇచ్చిన నీటి కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి.) ఊరికినే ఇతరుల సంపదను తినేవాడు పాపాత్ముడు. ఇటువంటి వారిని పరాన్నభుక్కులు అంటారు. ఇతరులు తెచ్చిపెడితే తినే రకాలు. ఆత్మజ్ఞానం సరిగా తెలియని వారి గురించి కర్మయోగము నిర్దేశింపబడిండి. మానవులు ముందుగా కర్మయోగము అవలంబించి, కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానము సంపాదించి, ముక్తులవుతారు. కాబట్టి ఆత్మతత్వము తెలుసుకునే వరకు ఎవరెవరుచేయవలసిన కర్మలు వారు చేయవలసినదే. కర్మలు మానరాదు. పైగా ఈ కర్మలు అంటే నిత్యాగ్ని హెూమములు, పంచ మహాయజ్ఞములు, యజ్ఞయాగములు మొదలగు కర్మలు సమాజ హితం కోరి చేస్తున్నారు. అందరికీ ఆహారం సమృద్ధిగా సమకూరాలని చేస్తున్నారు. అది నిష్కామ కర్మ పరోపకారము గురించి చేసే కర్మ. ప్రతిఫలమును ఆశించకుండా చేసే కర్మ. దీని వలన జ్ఞానము కలుగుతుందే కానీ బంధము కలుగదు.

ఇప్పుడు ఒక సందేహము కలిగే అవకాశం ఉంది. ఈ పంచ మహా యజ్ఞములు హోమములు ఏమీ తెలియని వారికేనా లేక ఆత్మతత్వమును తెలుసుకున్న వారు కూడా చేయాలా అనే సందేహము రావచ్చు. కొంతమంది క్రితం జన్మలోనే యజ్ఞములు హోమములు పరోపకారములు, నిష్కామ కర్మలు చేసి ఆత్తతత్వమును తెలుసుకొని కేవలం పరమాత్మను చేరుకోడానికే ఈ భూమితో అవతరిస్తుంటారు. అటువంటి జీవన్ముక్తులకు ఎటువంటి కర్మలు చేయనవసరం లేదు. కానీ వారు కూడా సమాజ హితం కోరి చేస్తున్నారు. ఒకవేళ వారు చేయకపోయినా, సర్వసంగ పరిత్యాగులు, జీవన్ముక్తులు చేయడం లేదు కదా మనం చేయడం ఎందుకని మానకూడదు. ఈవిధంగా హెూమాలు పంచ మహా యజ్ఞులు చేయని వారు, పరోపకారం కోసం సమాజహితం కొరకు పాటుపడని వారు, కేవలం తమ స్వార్ధాన్ని మాత్రమే చూచుకొనే వారు పాపాత్ములు అని చెప్పబడ్డారు. వారిని అఘాయులు అని అన్నారు భగవానులు. అటువంటి వారు ఇంద్రియారాములు అంటే కేవలం ఇంద్రియములకు వశులై, ఇంద్రియ సుఖములు మాత్రమే అనుభవిస్తుంటారు. ఇతరుల గురించి పట్టించుకోరు. స్వార్ధపరులు, వారి జీవితములు వ్యర్ధములు. వారిని జీవచ్ఛవాలు అనికూడ అనవచ్చు.

ఈ శ్లోకంలో ఒకపదం వాడారు. ఇంద్రియారామ: అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా చేసేవాడు. కేవలం ప్రాపంచిక విషయములలో, విషయ భోగముల యందు ఆసక్తి కలిగి ఉన్న వాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తుంటాడు. బతకాలి కాబట్టి బతుకుతుంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తాడు. కంటితో చూచింది, చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణా జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడు పాపాత్ముడు. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు. అటువంటి వాడి జీవితం వ్యర్ధము. అని కృష్ణుడు ఖండితంగా చెప్పాడు.
(సశేషం)

🌹యోగక్షేమం వాహామ్యహం 🌹

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P168

No comments:

Post a Comment