Friday, October 10, 2025

 🔥అంతర్యామి 🔥
# అధికారం తలకెక్కితే...

☘️అధికార బలగర్వంతో అహంకరించే మనిషి అధోగతి పాలవుతాడు. భారత, భాగవతాల్లో కనిపించే నహుషుడు మహారాజు పాత్రే ఇందుకు నిదర్శనం. అత్యున్నత పదవులను అలంకరించిన వారు అరిషడ్వర్గాలకు వశులైతే అప్రతిష్ఠ పాలవుతారని అతడి ఉదంతం నిరూపిస్తుంది. చంద్రవంశానికి చెందిన నహుషుడు తొలుత ధర్మనిరతికి, పరాక్రమానికి పెట్టింది పేరు. దానధర్మాలతో, యజ్ఞయాగాదులతో పేరుప్రతిష్ఠలు ఆర్జించాడు. యయాతి వంటి ధీమంతుల తండ్రిగా అతడి కీర్తిప్రభలు దేవలోకానికి వ్యాపించాయి. ఒకసారి శాపవశాత్తూ ఇంద్రుడు దేవేంద్ర పదవిని కోల్పోతాడు. ఆ సమయంలో దేవతలందరూ యశస్వి అయిన నహుషుడి వైపు మొగ్గుచూపుతారూ ఇంద్రపదవి అధిష్ఠించిన నహుషుడిలో స్థానబలిమి అహంభావాన్ని పెంచుతుంది. బుద్ధి వక్రించి, దేవేంద్రుడి ధర్మపత్ని శచీదేవిపైనే కన్నేస్తాడు. మదోన్మత్తుడై అగస్త్యాది మహర్షులతో పల్లకీని మోయించుకుంటూ, ఆమె మందిరానికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో కొరడా ఝుళిపిస్తూ అగస్త్య మహర్షిని అవమానిస్తాడు. 'అధికారమదంతో ఉచితానుచితాలు మరచి మిడిసిపడుతున్నావు. గర్వం తలకెక్కిన నువ్వు భూలోకంలో సర్పమై సంచరిస్తావు' అని ఆ తపస్వి శపిస్తాడు.

☘️మహర్షి శాపంతో నహుషుడికి కనువిప్పు కలుగుతుంది. పశ్చాత్తాపంతో తప్పు దిద్దుకునే అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడతాడు. కొండచిలువై పడి ఉన్న నీకు ఓ ధర్మాత్ముడు తారసపడతాడు. నువ్వు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చి విముక్తి కలిగిస్తాడు' అని శాప విమోచనాన్ని ఉపదేశిస్తాడు. మునీశ్వరుడు శపించినట్లుగానే నహుషుడు కొండచిలువగా ద్వైతవనంలో సంచరిస్తూ, అటుగా వెళ్తున్న భీమసేనుణ్ని బంధిస్తాడు. తమ్ముణ్ని అన్వేషిస్తూ, వచ్చిన ధర్మరాజుకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా వివరిస్తాడు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి భీముణ్ని విడిపించుకు వెళ్లమంటాడు. 

☘️బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలేంటి? అహింస ఎందుకు పరమధర్మం? లాంటి ప్రశ్నలు వేస్తాడు. 'సత్యం, సహనం, ఇంద్రియ నిగ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, మంచిస్వభావం కలిగిన వారందరూ బ్రాహ్మణులే' అని వివరిస్తాడు ధర్మరాజు, అలాగే 'పరోపకారం, దానం, సత్యం తదితర గొప్ప గుణాలకు మూలాధారమైంది అహింస, మనసా, వాచా, కర్మణా ఆహింసను దీక్షగా ఆచరించినవారు దేవతలవుతారని స్పష్టం చేస్తాడు. నహుషుడు శాపవిమోచనం పొందుతాడు. సనాతన సారస్వతంలో యక్షప్రశ్నలతో సమానంగా జనప్రియమయ్యాయి నహుష ప్రశ్నలు. ఈ నహుష ధర్మరాజ సంవాదం అరణ్యపర్వంలో కనిపిస్తుంది.

☘️అప్రమత్తంగా ఉండకపోతే అధికార దర్పం ఎంతటి కీర్తిమంతుడినైనా కళంకితుణ్ని చేస్తుందనడానికి నహుషుడి వృత్తాంతమే తార్కాణం. ప్రాప్తించిన పదవుల్లో హుందాగా వ్యవహరించేవారే స్థితప్రజ్ఞులు. ఆ భావనతోనే ఆదిశంకరాచార్యులు తమ 'భజగోవిందం' శ్లోకాల్లో 'అధికారం, జనబలం, యవ్వనం ఉన్నాయని ఎన్నడూ గర్వించకు. ఎప్పుడో ఒకప్పుడు కాలం అన్నింటినీ హరించివేస్తుంది' అని హెచ్చరించారు. బలిచక్రవర్తి కూడా వామనావతార ఘట్టంలో 'రాజ్యాలను పాలిస్తున్నామని ఎందరో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఆ వైభవాల్ని వెంటబెట్టుకుని పోలేదు కదా! వారి ఆనవాళ్లయినా మిగలలేదు కదా! అని హితవు పలుకుతాడు.🙏

✍️- బి. సైదులు

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ

No comments:

Post a Comment