Thursday, October 9, 2025

*****భగవద్గీత* ➖➖➖✍️``` (సరళమైన తెలుగులో)```

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-169.
106d3.;910e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣6️⃣9️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                 *భగవద్గీత*
                 ➖➖➖✍️```
     (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*28. వ శ్లోకము:*

*”యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।*
*సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే” ॥28 ॥*


“పైన చెప్పిన విధంగా మన మనసులో ఉన్న అన్ని కల్మషములను తొలగించుకొని ఆత్మను దర్శిస్తే, మనసును ఆత్మలో లీనం చేస్తే అటువంటి యోగి అంతము లేని, పరమమైన సుఖమును అత్యంత సులభంగా పొందుతాడు.”
```
ఇంత కష్టపడి మనసులో నుండి కల్మషములను అన్నీ తొలగించి, దానిని విగత కల్మషం చేసి, మరలా లాలించి బుజ్జగించి పట్టుకొని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. అది అత్యన్తమ్ సుఖం అంటే అంతము లేని సుఖం కలిగిస్తుంది. అంటే బ్రహ్మానందము సులభంగా లభించే ఉపాయం ఇది అని స్పష్టంగా చెప్పాడు భగవానుడు.

మొట్ట మొదట మనసును కల్మష రహితంగా చేయాలి. అంటే మనసులో ఉండే దుర్గుణములను, పాప ఆలోచనలను, కోరికలను, మనలో చెలరేగే విపరీత భావనలను వాటి వలన కలిగే రాగద్వేషములను, కోపమును సమూలంగా పోగొట్టుకోవాలి. ఇవన్నీ రజోగుణము, తమోగుణము వలన వచ్చేవి. కాని ఆత్మ తత్వము సత్వగుణ ప్రధానము. సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ ఆత్మ సాక్షాత్కారం కలుగదు. ఆత్మను అంటే బ్రహ్మను దర్శించాలంటే సత్వగుణం అలవరచుకోవాలి. ప్రశాంత చిత్తంతో ఉండాలి. అప్పుడు ధ్యానయోగంలో కూర్చుని ఆ మనసును ఆత్మలో నిలపాలి. ఈ ప్రయత్నం ఏదో ఒక రోజు కానీ ఒక నెల కానీ, ఒక సంవత్సరం కానీ చేస్తే చాలదు. సదా అంటే ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అప్పుడే అతని చిత్తము బ్రహ్మకు చేరువవుతుంది.

బ్రహ్మ అంటే నాలుగు తలల బ్రహ్మ కాదు. ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ అని అర్థం. సాధన చేసే వారికి ఇది సులువుగా దొరుకుతుంది. అనాయాసంగా, ఎటువంటి ఖర్చు లేకుండా ఏ బాబాలను, స్వామీజీలను సేవించకుండా వారి పాద పూజలకు ధనం వ్యయం చేయకుండా, ఏ మాత్రం కష్టపడకుండా దొరుకుతుంది. కాక పోతే సాధన చేయాలి. సాధన చేయని వారికి ఈ సుఖం, శాంతి ఎన్నటికీ దొరకదు బ్రహ్మ సంస్పర్శ పొందడం సామాన్యం కాదు. అది కనపడదు. కేవలం చిత్తములోనే దర్శించాలి. బ్రహ్మ సంస్పర్శ కలిగింది అనే దానికి తార్కాణం మనకు అనంతమైన సుఖము శాంతి లభించడమే. అదే గుర్తు.```


*29. వ శ్లోకము:*

*”సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।*
*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః” ॥ 29 ॥*

“ఇటువంటి సాధన చేసి పరమ సుఖమును పొందిన యోగి, ఈ అనంత విశ్వంలో ఉండే చరాచర జీవరాసుల యందు సమదృష్టి కలిగి ఉంటాడు. ఈ సమస్త ప్రపంచమును తనలో, తనను సమస్త భూతములలోనూ చూచుకుంటాడు.
```
బ్రహ్మ సంస్పర్శ కలిగిన యోగి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ…
ఈ శ్లోకంలో యోగయుక్తాత్మ అని వాడారు. అంటే యోగముతో యుక్తమైన మనసు కలవాడు. అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేసిన వాడు. అటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతడు సకల జీవరాశులలో పరమాత్మను దర్శిస్తాడు. తనలోనే అన్ని జీవరాశులను దర్శిస్తాడు. అందరినీ సమంగా చూస్తాడు. భేదబుద్ధి ఉండదు. ఇది ఎలా కలుగుతుంది.

మనం బయట ప్రపంచాన్ని కళ్లతో చూస్తున్నాము. చర్మంతో తాకుతున్నాము. చెవులతో వింటున్నాము. నాలుకతో రుచి చూస్తున్నాము. మంచి వాసనలను ముక్కుతో ఆస్వాదిస్తున్నాము. ఈ ఐదింటి వలన బయట ప్రపంచం మన లోపలకు వెళుతూ ఉంది. కాని ఈ ఇంద్రియములు జడములు. వీటి వెనక మనసు ఉండి నడిపిస్తూ ఉంది. మరణించిన తరువాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి కానీ అవి ఆయాపనులు చేయలేవు. కాబట్టి బయట ఉన్న ప్రపంచం అంతా మనస్సు యొక్క సృష్టి మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది.

కాబట్టి ఈ దేహము వేరు అందులో ఉన్న ఆత్మతత్వము వేరు. అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటే. దేహములు, వాటి ఆకారములు, పేర్లు, వేరుగా ఉంటాయి. మనకు దేహములు, వాటి ఆకారములు, వాటి పేర్లు కనపడతాయి కానీ అన్ని దేహములలో అంతర్లీనంగా వెలుగుతున్న ఆత్మ చైతన్యం కనపడదు. ఎలాగంటే పెద్ద పూలమాల ఉంది. అందులో రకరకాల పూలు ఉన్నాయి. ఆ పూలు అందంగా ఉన్నాయి. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. కాని ఆ పూలను అన్నిటినీ అందంగా కనపడేటట్టు కట్టి ఉంచిన దారం మనకు కనపడదు. మనం కేవలం పూలను వాటి అందాలను, సువాసనలను మాత్రమే చూస్తాము. ఆస్వాదిస్తాము. లోపల ఉన్న దారం గురించి తెలుసుకోము. అలాగే ఈ చరాచర జగత్తులో ఉన్న అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపంగా అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానము.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించు కుందాము. మనకు రెండు కళ్లు ఉన్నాయి. శివుడికి మూడోకన్ను ఉంది. అది తెరిస్తే ఈ లోకాలన్నీ భస్మం అయిపోతాయి అని మనకు తెలుసు. దీని అర్ధం ఏమిటి. మనకు ఉన్న రెండు కళ్లతో ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులను, జంతువులను, పక్షులను, చెట్టు, కొండలు, పర్వతములు చూస్తున్నాము. ఈ కళ్లు మూసుకుంటే మనలో ఉన్న మూడవ నేత్రం అంటే మనో నేత్రం అంటే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనకు బయట ప్రపంచం కనపడదు. అంటే బయట ప్రపంచం, అందులోని విషయ వాంఛలు అన్నీ భస్మం అయి పోతాయి. మూడవ నేత్రంతో మనం ఆత్మను దర్శించగలము. అప్పుడు అంతులేని ప్రశాంతత అనంతమైన సుఖము కలుగుతాయి. అందుకే శివుడిని ‘ఆనంద స్వరూపుడు’ అని అన్నారు. త్రినేత్రుడిని ఇలా అర్థంచేసుకోవాలి.

విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యం అయితే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యము. కాబట్టి ఈ దేహమే నేను అనే స్థితి నుండి నేను వేరు, దేహము వేరు అనే స్థితికి రావాలి. మనస్సు ఆత్మతో కలిస్తే ఆ స్థితి వస్తుంది. జ్ఞాన నేత్రంతోనే ఆత్మను దర్శించగలము. అప్పుడు ఆ యోగి ఈ ప్రపంచాన్ని తనలో చూసుకుంటాడు. తనను అన్ని జీవులలో చూసుకుంటాడు. అదే యోగయుక్తుని లక్షణము. అదే సమదర్శనము. అతడే యోగయుక్తాత్ముడు.

మనం ఒకరికి ఒకరికి మధ్య భేదభావముచూపిస్తాము. యోగి అందరినీ సమంగా చూస్తాడు. బంగారాన్ని రాయిని ఒకటిగా చూస్తాడు. మనం గ్రాము బంగారాన్ని దాచిపెట్టుకుంటాము. కిలో బరువు ఉన్న రాయిని వీధిలోకి విసిరేస్తాము. మనలో ఉన్న ఈ భేదబుద్ధి మనలో అశాంతికి కారణం అవుతూ ఉంది. ఈ భేదబుద్ధి మనుషుల మధ్య ద్వేషమునకు కారణం అవుతూ ఉంది. ఈ భేదబుద్ధి వన్యప్రాణులను వేటాడటానికి కారణం అవుతూ ఉంది. అడవులలో ఉన్న చెట్లలో పరమాత్మను చూచేవాడు చెట్టనుకొట్టడు. జీవులను చంపడు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినదు. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడిన సమదర్శనము, అంటే అన్నిటిలో భగవంతుని చూడగలగడం, తనలోనే అన్నిటినీ చూడగలగడం అలవాటు చేసుకోవాలి. అతడే యోగ యుక్తుడు.

ఈ భావన కేవలము ఆధ్యాత్మికమే కాదు. మనలో నైతిక విలువలు పెంపొందించు కోడానికి, ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడానికి వన్యప్రాణుల సంరక్షణకు కూడా ఆస్కారం కలిగిస్తుంది.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.

No comments:

Post a Comment