*ఇవే‘నా’... జ్ఞాపకాలు?* -
శ్రీపతి లలిత
*ఉదయ భానుడు* ఎర్రగా- ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు.పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు, నాకే డ్రైవ్ చెయ్యబుద్ధి అవక క్యాబ్ పిలిచాను.
దాదాపు ఆరేళ్ళ తర్వాత, బాబాయి ఇంటికి వెళ్తుంటే- ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులూ చుట్టుముట్టాయి నన్ను. బాబాయి అంటే నాన్న తమ్ముడు. నాన్నకంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడు. నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం.
నేను పుట్టినప్పుడు, బాబాయి అప్పుడే ఇంజినీరింగ్‌లో చేరాడు. నాన్న దగ్గర్లోని పల్లెటూర్లో, బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నానమ్మా, తాతయ్యలతోనే అమ్మా నేనూ ఉండేవాళ్ళం. నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాట్ట. అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు.
నాకు అయిదేళ్ళు వచ్చే వరకూ, నాన్న ఆ పల్లెటూరిలోనే ఉండేవారు. అప్పట్లో నాన్నకంటే, బాబాయి అంటేనే నాకు ఇష్టం ఉండేది.
కాలేజీ నుంచి రాగానే, నన్ను ఎత్తుకుని ఆడించేవాడు, స్కూటర్ మీద కూర్చోపెట్టుకుని తిప్పేవాడు.అమ్మ, ‘కృష్ణా, వాడిని ముద్దుచేసి పాడుచేస్తున్నావయ్యా. మొండిగా తయారవుతున్నాడు’ అని కోప్పడితే, ‘ముద్దు చేస్తే పాడవుతారా వదినా? నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా?’ అనేవాడని చెప్పేది అమ్మ.
ఇంజినీరింగ్ అయ్యాక, బాబాయి ఉద్యోగం వచ్చి, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం. అప్పుడు బాబాయి కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఒకసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నాకోసం.
బాబాయి పెళ్ళికి నేనే తోడి పెళ్ళికొడుకును. ‘బాబాయికి పిన్నితో పెళ్ళి అయితే, నాకు ఎందుకు అవలేదు’ అని ఏడ్చాను. ‘పిన్నితో నాకు కూడా పెళ్ళి చెయ్యమనీ నేను వాళ్ళతోనే ఉంటాననీ’ ఏడిస్తే... నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి, ‘మనిద్దరికీ పెళ్ళి అయింది, నువ్వు మాతోనే ఉండు’ అన్న పిన్నిని మర్చిపోలేను.
ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళలో ఉన్నా ప్రతి పండగకీ అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం.తాతయ్య రిటైర్ అయ్యాక, నానమ్మతో సొంత ఊరిలో ఉండేవారు.
సెలవలు వస్తే నాకు పండగే. అటు బాబాయి దగ్గరకో, నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని. సమస్య ఎక్కడో తెలీదు కానీ, బాబాయ్‌కి పిల్లలు పుట్టలేదు. అందుకో మరెందుకో, బాబాయీ పిన్నీ నన్ను చాలా ప్రేమగా చూసేవారు. నాకూ... వాళ్ళ దగ్గర ఎంతో బావుండేది.
‘ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకోండి, లేదా ఎవరినైనా పెంచుకోండి’ అని నాన్న అంటే-‘నాకు వేరే పిల్లలెందుకు అన్నయ్యా... చిన్నా నా కొడుకు కాదా?’ అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది.
నాకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్ వచ్చి, యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వచ్చిన రోజు... బాబాయి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ, ‘మా అబ్బాయికి కంప్యూటర్స్‌లో సీటు- యూనివర్సిటీలో వచ్చింది’’ అని చెప్పి సంతోషపడ్డాడు. తెలియనివాళ్ళు, మీకు పిల్లలు లేరుగా అంటే ‘చిన్నా, అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ, వాడు నా వారసుడు’ అనేవాడు.
అమెరికా వెళ్ళాలనే కోరికని, నాలో పెంచి పోషించింది కూడా బాబాయే.తనకు అప్పట్లో కుదరలేదనీ ఎలాగైనా నన్ను అమెరికా పంపాలనీ పట్టుపట్టాడు. అమ్మానాన్నా, పెద్ద ఇష్టపడకపోయినా, నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో, ఆ అమెరికా ప్రయాణమే, నన్నూ బాబాయినీ దూరం చేసింది.
ఎమ్మెస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందర్నీ కలిసే టైమ్ లేక, వెంటనే చేరిపోయాను.మరుసటి సంవత్సరం, అమ్మానాన్నల్ని పిలిపించాను. వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్ళారు. వాళ్ళతోపాటే బాబాయినీ పిన్నినీ కూడా రమ్మంటే తాతయ్యా నాన్నమ్మా పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులూ దగ్గర లేకుండా, రెండు నెలలు ఉండటం మంచిది కాదని వాళ్ళు రాలేదు.
ఆ తర్వాత నేను వద్దామంటే, కరోనా అడ్డం వచ్చింది. దాదాపు మూడేళ్ళు దాని భయంతోనే గడిపాం. వీడియో కాల్స్ ఉండబట్టి, అందరినీ చూస్తూ మాట్లాడటం జరిగింది.కరోనా తగ్గింది అనేలోగా, ఉద్యోగాల కోతలు ఎక్కువ అయ్యాయి. ‘నాకేం కాదులే’ అన్న ధీమాతో ఉన్న నాకు, ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగు పడ్డట్టే అయింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో, అమ్మానాన్నల కోసం కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాను. అమెరికాలో నాకోసం కారు కొనుక్కున్నాను.
అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. వీసా టైమ్ అయ్యేలోగా, కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మా వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు.వాళ్ళకి తెలీకుండా- ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. ‘అమ్మయ్యా!’ అనుకున్నా.
అప్పుడే, బాబాయికి సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. స్టెంట్ వేశారనీ ప్రస్తుతం ఫర్వాలేదన్నారనీ చెప్పారు. బాబాయి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక, దాదాపు రోజూ ఫోన్‌లో మాట్లాడేవాడు.
‘ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా చిన్నా’ అంటే, నేను ఏం చేశాను...
వీసా సమస్య ఉందనీ ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందనీ చెప్పలేక, ‘ఇదిగో వస్తున్నా... అదిగో వస్తున్నా’ అంటూ కాలం గడిపాను.
తీరా నేను బయలుదేరే సరికి, బాబాయి ఈ లోకం వదిలి వెళ్ళాడు. ప్రాణంలేని బాబాయిని చూడలేనని, చివరి చూపుకి కూడా రాలేదు. ఇది జరిగి దగ్గర దగ్గర ఆరు నెలలు దాటింది. పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా, తను ఫోన్ ఎత్తేది కాదు.
అమ్మని అడిగితే ‘ఏమోరా, మరీ పిచ్చిదానిలా అయింది. ఇక్కడికి రమ్మంటే రాదు. తాతయ్యావాళ్ళు వెళ్ళినా, ఒక మాటా పలుకూ లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటోంది. వీళ్ళకు విసుగు పుట్టి వచ్చేశారు. తనకి భర్త పోయాడు నిజమే... కానీ వీళ్ళకి కొడుకు పోయాడుగా’ అంది.
మామూలుగా, అమ్మ అలా విసుక్కోదు, స్వతహాగా పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం.
సరిగ్గా అదే టైమ్‌లో, మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్‌లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్లలోకంటే తక్కువైనా, మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకుని వచ్చేశాను. వచ్చి రెండ్రోజులు అయింది.
పిన్ని గురించి మాట్లాడితే అందరూ ‘అదో పిచ్చిది!’ అన్నారు. ఒక్కతే ఉంటోందని చెప్పారు. ఇవాళ సెలవు, ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను.
బాబాయి ఫ్లాట్ వద్దు అనుకుని, కొంపల్లి వేపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచీ చెట్లూ మొక్కలూ అంటే ఇష్టమున్న ఇద్దరూ, ఇంటి చుట్టూ అన్ని చెట్లూ వేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్నీ బాబాయి.
ఆలోచిస్తుండగానే, క్యాబ్ బాబాయి ఇంటిముందు ఆగింది. గేట్ తీసిన నాకు, ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది. తుప్పు పట్టిన గేటు, వాకిలి అంతా చెత్త, లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి.
బయట స్కూటర్, కారు కూడా దుమ్ముపట్టి ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకున్నట్టు లేదు. లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను. ఎవరూ పలకలేదు, తలుపులు దబదబా బాదాను ‘పిన్నీ!’ అంటూ.
అప్పుడు శబ్దం అయింది, నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు.రేగిపోయి నెరిసిన జుట్టు, నలిగి వెలిసిన నూలు చీర, మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ‘‘ఎవరూ?’’ అంది.
‘‘ఇక్కడ మా పిన్ని ఉండాలండీ, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’’ అన్న నన్ను చూసి- ‘‘చిన్నా!’’ అంది.
నేను తూలి పడబోయాను. చటుక్కున పట్టుకుని ‘‘లోపలికి రా’’ అని ఇంట్లోకి నడిపించింది. కుర్చీలో కూర్చున్న నేను, పిన్ని వంక చూస్తే- నాకు అంతా మసకగా ఉంది. కళ్ళు నులుముకుంటే కళ్ళనీరు తగిలింది.
నేను ఏమీ మాట్లాడలేదు, పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. తాగుదామనుకున్నా కానీ, ఒక్క గుక్క తాగేసరికి కొర పోయింది.దగ్గుతుంటే తలమీద చేయి వేసి తడుతూ ‘‘అమ్మ తల్చుకుంటోంది’’ అంది.
నేను ఆ చెయ్యి పట్టుకుని ‘‘లేదు, బాబాయి తల్చుకుంటున్నారు’’ అన్నాను. పిన్ని ఏమీ మాట్లాడలేదు. ఆమె కంట చుక్క నీరు రాలేదు.
ఇద్దరమూ అలా మూగగా ఉన్నాం. గేటు కిర్రుమని శబ్దం అయింది. మల్లమ్మ లోపలికి వచ్చింది. చాలా ఏళ్ళ నుంచీ వాళ్ళింట్లో చూస్తుండటంతో మల్లమ్మకి మేమంతా తెలుసు.
‘‘చిన్న బాబూ, బాగున్నావా... ఎప్పుడు వచ్చావు?’’ నవ్వుతూ పలకరించింది. నేను సమాధానం చెప్పకుండా ‘‘ఇల్లు ఇలా ఉంటే బాబాయి ఊరుకుంటారా మల్లమ్మా? ఇంత చెత్తగా పెట్టావేంటి? నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను’’ అంటూ వంటింట్లోకి వెళ్ళి
చెత్త ఎత్తే కవర్ తెచ్చాను. ఆరేళ్ళయినా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు.పిన్ని ఏదో అనబోతుంటే, ‘‘నేను రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం’’ అంటూ, బయట పని చెయ్యడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటికి నడిచాను.
నేనూ మల్లమ్మా, దాదాపు గంటసేపు కష్టపడితే, సుమారు పది బస్తాలకి సరిపడా ఎండు ఆకులూ కొమ్మలూ వచ్చాయి.‘‘రేపు చెత్త తీసే ఆయనకి పైసలు ఇస్తే, తీసుకుపోతాడులే చిన్నబాబూ... లోపలికి పదండి. ఎండ బాగా వస్తోంది’’ అంది, ఎర్రబడ్డ నా మొహం చూసి. పని చేస్తున్నంతసేపూ మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది- అన్నీ పిన్నీ, బాబాయి గురించే.
లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి, వంట చేస్తోంది. నేను కాళ్ళూ చేతులు కడుక్కుని వంట ఇంటి ఇవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను.
‘‘ఏవి ఎండిపోయాయి, ఏవి కొత్తవి తేవాలి, ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి’’ అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని. మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది.
ఆలుగడ్డ వేపుడూ మామిడికాయ పప్పూ చారూ అన్నం.
‘‘అబ్బా, మామిడికాయ పప్పూ... ఇందులోకి ఊర మిరపకాయలు వేయించలేదేం? నువ్వు కూడా పెట్టుకో’’ అన్న నన్ను చూసి ‘‘నేను ఇవన్నీ తినడం మానేశాను, ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే... అదీ, ఒక పూటే’’ అంది పిన్ని.
నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను. భోజనం అయ్యాక నేను నెమ్మదిగా ‘‘పిన్నీ... బాబాయి పోయి దాదాపు ఆరు నెలలు దాటింది. ఆ స్కూటరూ కారూ అలానే ఉంచావు. అలమరలో బాబాయి బట్టలన్నీ అలానే ఉన్నాయి, ఆ రాక్‌లో చెప్పులు కూడా...’’ అన్నాను.
‘‘నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్నా. మీ బాబాయి కారూ స్కూటరూ అలాగే ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలూ చెప్పులూ కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది.’’
‘‘ఓకే. మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా? ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా?’’ అడిగిన నన్ను వింతగా చూసింది.
‘‘నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి?’’
‘‘మరి... నువ్వు జీవితం మీదా నీ శరీరం మీదా ఏ మాత్రం శ్రద్ధ లేకుండా, సన్యాసినిలా ఉన్నావు. బాబాయి సడన్‌గా పోయారు. ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది. అందులో నువ్వూ బాబాయీ ఒకరికి ఒకరుగా బతికారు. అది తట్టుకోవడం కష్టమే. కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా, ఆత్మహత్య చేసుకోవుగా? ఒంటరిగా ఉంటున్నావు, మనవాళ్ళు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చెయ్యవు, ఇల్లు శుభ్రం చెయ్యనియ్యవు. చెట్లలో అంతా చెత్త, ఏ పాములో రావచ్చు. స్కూటరూ కారూ జ్ఞాపకాలతో వాటిని మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా. రేపుఅవి తుప్పు పట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా!
బాబాయి బట్టలూ ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామానూ... ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు? అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా? ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు, ఆయనకి ఏమిష్టమో
తెలీదా నీకు? నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా? ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి, సర్వసంగపరిత్యాగిలా ఉంటే, ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా, లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా?’’ నాది కోపమా ఉక్రోషమా దుఃఖమా... నాకే తెలీదు, పిన్నికీ అర్థం కాలేదు.
నా వంక అయోమయంగా చూస్తూ ‘‘నా భర్త పోతే బాధపడడం తప్పా... ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా?’’
‘‘ఆయన జ్ఞాపకాలు ఉండాలి, అవి నీలో బతికుండాలి. కానీ ఆ జ్ఞాపకాలే, నీకు దుఃఖాన్నీ అనారోగ్యాన్నీ చావునూ ఇస్తే... అదేనా ఆయనకి ఇష్టం? మాకు నిన్ను చూస్తే, బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి. ఆయన జీవితంలో ఏమి సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి. ‘నేనూ మీ పిన్నీ అర్థనారీశ్వరులం’ అనేవాడు బాబాయి. ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలూ ఇంగ్లిషూ చెప్పడం ఇష్టం.
నువ్వు అవి చెప్పలేకపోతే, మనిషిని పెట్టి చెప్పిద్దాం. బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం, నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం. నువ్వు సంగీతం పాడితే ఇష్టం...
ఒకవేళ నువ్వు పోయి, ఆయన ఉండి, ఇలానే ఇల్లు ఉంచి, నీలానే విరాగిలా ఉంటే... అవే ‘నా’ జ్ఞాపకాలు అంటే...’’ ఆగాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ. ఏమీ మాట్లాడకుండా, రూములోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని. నేనూ కామ్‌గా ఇంకో రూమ్‌లోకి వెళ్ళి నిద్రపోయాను. ఒళ్ళు తెలీకుండా నిద్రపట్టింది.
నిద్ర లేచి చూస్తే, ఒక నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు.మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది. పిన్ని స్పెషాలిటీ అది.
‘‘పిన్నీ, పకోడీ చేశావా?’’ వంటింట్లోకి, దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది.
‘‘వాసనకి లేచావా, మొహం కడుక్కుని రా... ఇద్దరం పకోడీ, టీ తీసుకుందాం.’’
‘‘నీకు కోపం రాలేదా?’’ ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి, ‘‘కోపమెందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు... నీ బోధలు విన్నాక, నాకూ జ్ఞానోదయం అయింది. నేనూ ఆలోచించాను... నిజమే, మీ బాబాయి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే, ఇలా చెయ్యక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాం, బట్టలూ మిగిలిన వస్తువులూ కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను. వస్తూ అత్తయ్యనీ మామయ్యనీ కొన్ని రోజులు ఇక్కడకి తీసుకువస్తాను. బాబాయి సంవత్సరీకంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను. మళ్ళీ చెట్లన్నీ పూలూ కాయలతో కళకళలాడేలా చేస్తాను.
నాకు కారు నేర్పించు. స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను.’’
ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి ‘‘పిన్నీ, నిన్ను బాధపెట్టానా?’’
‘‘కొంచెం కఠినంగా చెప్పావు... అప్పటికి కానీ నాకర్థం కాలేదుగా? నీలాగా, నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవరికీ ఇవ్వలేదు అని అర్థమయింది. నువ్వన్నట్టు, నాకు భర్త పోయాడు నిజమే. కానీ- తాతయ్యా నానమ్మలకి కొడుకూ, మీ నాన్నకి తమ్ముడూ, మీ అమ్మకి కొడుకులాంటి మరిదీ- పోయాడు. నేనే, ఆ షాక్ నుంచి తేరుకోలేక, అందరినీ దూరంపెట్టి, మూర్ఖంగా ప్రవర్తించాను’’ అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను.
అప్పుడు ఏడ్చింది పిన్ని... తెరలు తెరలుగా, మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది... కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి, దుఃఖమంతా లావాలాగా, బయటికి తన్నినట్లుగా ఏడ్చింది. ‘మొగుడు పోతే కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రాక్షసి’ అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది.
చుట్టూ చెయ్యి వేసి ‘‘పిన్నీ, నేను మీ కొడుకుని. ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు’’ అన్న నన్ను చూసి, నెమ్మదిగా తేరుకుని, మొహం కడుక్కుని వచ్చింది.
‘‘ఇంక నేను... మీ బాబాయి ఎక్కడున్నా, సంతోషంగా ఉండేట్లు బతుకుతాను.
నా సంగీతం క్లాసులు మొదలుపెడతాను, పేద పిల్లలకు చదువు చెప్తాను, ఇంకా ఏమైనా చేయొచ్చా ఆలోచిస్తాను. మీ బాబాయి జ్ఞాపకాలు- మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను’’ చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి,
‘‘ఇవన్నీ కూడా బాబాయి జ్ఞాపకాలే పిన్నీ’’ సంతోషంగా అన్నాను.
నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయి సంతోషించాడన్నట్టు, ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది.
👉 Collected by : Sairam... 🌺
👉 Credits: Eenadu magazine.🌹
No comments:
Post a Comment