Monday, October 13, 2025

 6️⃣4️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*13. యజ్ఞశిష్టాశినస్సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషై:l*
 *భుయ్జ్ఞతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్||*

యజ్ఞశిష్టమైన ఆహారమును అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినే వారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలము తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకొని తినే వారు పాపములు తింటున్నట్టు లెక్క.

మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా, మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయాలి. దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, మొదలైన పవిత్ర కర్మలు. పరమాత్మను మనకు ఇష్టమైన ఒక రూపంతో పూజించడం, అర్పించడం, ఆరాధించడం, మనం వండుకున్నది నివేదించడం, దానిని ప్రసాదంగా భుజించడం. భగవంతుని ఆరాధించి, దేవతలకు కృతఙ్ఞతలు చెప్పి, తాను వండుకున్న ఆహారమును భగవంతునికి దేవతలకు నివేదించి, సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తినే వాడు సకల పాపముల నుండి విముక్తుడు అవుతాడు. సర్వకిల్బిషై: అన్నారు అంటే ఏదో ఒకటి రెండు పాపములు కాదు సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి వాడు అసలు పాపాలే చెయ్యడు. ఇంక విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి. కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థము అయినా ముందు భగవంతునికి నివేదించి ఆరగించడం మంచిది. అలాగే సాటి జంతువులకు, కీటకములకు కూడా కొంచెం పెట్టాలి. అతిథులకు పెట్టాలి. ఏదైనా తన శక్తి కొలది మాత్రమే చేయవచ్చు. అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకొని తినేవాడు పాపమును తింటున్నట్టే లెక్క.

ఇంతకు ముందు శ్లోకంలో అలా చేసిన వాడిని దొంగ అన్నారు. ఈ శ్లోకంలో అలా దొంగ వస్తువును తినేవాడు పాపమును తింటున్నాడు అని అన్నారు. అటువంటి పాపమును తిన్న వాడికి శరీరం అంతా దుష్ట భావనలతో నిండి పోతుంది. అతడి పతనం అతడే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి స్వార్థపరులు, కృతఘ్నులు పాపమును మూటగట్టుకుంటారు. పాపమును తింటుంటారు. అందుకే పంచ మహా యజ్ఞములు ఏర్పడ్డాయి.

1. దేవ యజ్ఞము అంటే దేవతలను ఆరాధించడం,

2. పితృయజ్ఞము అంటే చని పోయిన పూర్వీకులకు జలతర్పణములు, పిండ ప్రదానములు అంటే శ్రాద్ధకర్మలు చేయడం.

3. మనుష్య యజ్ఞము అంటే సాటి మానవులకు తనకు ఉన్నదానిలో పెట్టడం అంటే అతిధులకు అన్నం పెట్టడం.

4. బ్రహ్మయజ్ఞము అంటే వేదములను శాస్త్రములను శక్తి కొద్ది అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం, ఇతరులు చెప్పే ప్రవచనములు వినడం, వాటిని ఆచరించడం.

5. భూతయజ్ఞము అంటే సాటి జంతువులకు, క్రిమి కీటకములకు ఆహారం ఇవ్వడం. మనం తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్ని చిన్ని చీములు, పక్షులు, కుక్కలు మొదలగు పెంపుడు జంతువులు మొదలగునవి తింటాయి. వచ్చని చెట్లను నరకకుండా, వాటిని నీరు పోసి పెంచి పోషించడం,

ఇదీ మనం ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలియజేసే విధానము. అలా చేసిన వారికి పాపము అంటదు. కేవలం తాను మాత్రమే తింటే, అంటే ప్రకృతిని తన స్వార్ధానికి ఉపయోగించుకుంటే వారు పాపమును తింటున్నట్టు అవుతుంది.

ఎవరైతే ఆహార పదార్ధములను ముందు భగవంతునికి నివేదించి తరువాత తాను తింటాడో, అతడు సకల పాపముల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పుకున్నాము. అందుకే భగవంతుని ప్రసాదమునకు మనం అంత విలువ ఇస్తాము. అది ఏదైనా కానీ భగవంతుని ప్రసాదం అంటే కళ్లకు అద్దుకొని ఆరగిస్తాము. అలాకాకుండా కేవలం తన కోసరం మాత్రమే వండుకుంటూ తనే తినేవాడు పాపమును తింటున్నట్టు లెక్క. పాపమును మూటకట్టుకుంటాడు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఎవరైతే భగవంతుని పూజించి, భగవంతునికి నివేదించిన పదార్థములను తింటాడో అది అతనికి అమృతముతో సమానము అవుతుంది. అతడు అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. అలా కాకుండా కేవలం తన స్వార్ధమును చూచుకుంటూ, తన కోసమే వండుకొని తినేవాడు, పాపమును తింటున్నట్టు. వాడు పాపం చేస్తున్నట్టు.

ఇక్కడ రెండు విషయములను మనం గమనించాలి. మొదటిది భగవంతుని పూజ. ఎందుకుంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, గాలి వెలుతురు, నీరు అన్నీ ఇచ్చాడు. భగవంతునికి కనీసం కృతజ్ఞత చూపవలసిన భాద్యత మనమీద ఉంది. దానిని పూజ అంటారు. పూజ తరువాత భగవంతుడు మనకు ఇచ్చిన దానిని తినేముందు భగవంతునికి అర్పించి తినడం మన కనీస ధర్మం. భగవంతునికి అర్పించడం అంటే భగవంతుని స్వరూపాలైన సాటి మానవులు, సాటి జంతువులు, పితృదేవతలు, వృక్షములు. అవి కూడా మనకు ఎటువంటి స్వార్ధము లేకుండా ఎంతోసాయం చేస్తున్నాయి. అందుకే పంచ మహాయజ్ఞములు చేయమన్నారు. వాటి గురించి మనం పైన చెప్పుకున్నాము. అటువంటి వారికి భగవంతుడు పరమశ్రేయస్సు కలుగజేస్తాడు.

ఏమిటా శ్రేయస్సు అది ఎలా కలుగుతుంది అని మనకో ప్రశ్న ఉదయిస్తుంది. మనం తినే ఆహారాన్ని భగవంతునికి, దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని మనస్సును పవిత్రం చేస్తుంది. మనసు పవిత్రం అయితే పాపాలు నశించి పోతాయి. పాపాలు నశిస్తే మనసు ఆత్మ వైపు తిరుగుతుంది. మనసు ఆత్మ వైపు తిరిగి, ఆత్మలో లీనం అవుతుంది. దాని ద్వారా మోక్షానికి మార్గం సులభం అవుతుంది. అదే మనకు కలిగే శ్రేయస్సు. ఇలా చేయకపోతే, మనం వండుకున్నది మనమే తింటే, ఎల్లప్పుడూ స్వార్థబుద్ధితో ఉంటే, మనం పాపం తింటున్నట్టు అవుతుంది. అంటే ఉన్న పాపాలకు తోడు మరి కొన్ని పాపాలు వచ్చి చేరుతాయి. దానితో మనసు మలినం అవుతుంది. అది ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛల వైపు తిరుగుతుంది కానీ ఆత్మ వైపు ప్రయాణించదు. వాడికి మోక్ష మార్గము కనపడదు. పాప మార్గంలో పడి కొట్టుకుంటూ, చావు పుట్టుకల మధ్య పడి సతమతమౌతుంటాడు. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతాభావనతో ఉండటం ఎంతో శ్రేయస్కరము.

ఈ విషయాన్నే మనం మరొక కోణంలో కూడా అధ్యయనం చేయవచ్చు. మనం కర్మలు చేస్తున్నాము. ఎందుకంటే కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. మనం చేసే కర్మలు అన్నీ ఏదో ఒక ఫలమును ఇస్తాయి. అది మంచి ఫలం కావచ్చు, చెడు ఫలం కావచ్చు. దానిని మనం అనుభవించాలి. అది మనకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలుగజేస్తుంది. సుఖం వస్తే సంతోషిస్తాం. దుఃఖం వస్తే ఏడుస్తాము. అదే కర్మలు పరమాత్మ పరంగా, ఒక యజ్ఞంలాగా, శ్రద్ధతో, ఎటువంటి ప్రతిఫలాపేక్ష, స్వార్ధ బుద్ధి లేకుండా చేసి, చేయగా వచ్చిన ఫలములను పరమాత్మకు అర్పించి, వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే, ఆ ఫలం నాది కాదు పరమాత్మ ఇచ్చింది అనుకుంటే, సుఖమూ ఉండదు, దుఖము ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనలో ఉన్న పాపాలు నశించి పోతాయి. కాని అదే కర్మఫలాలను ఈ పని నేను చేసాను, ఈ ఫలితం నావలననే వచ్చింది అనే కర్తృత్వభావనతో స్వార్ధ బుద్ధితో స్వీకరిస్తే, చివరకు దుఃఖమే మిగులుతుంది. మనస్సు వికలమౌతుంది. ప్రశాంతత కరువవుతుంది. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి.

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P164

No comments:

Post a Comment