291022d2139. 301022-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀125.
ఓం నమో భగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ:-125
➖➖➖✍️
రాధాదేవి కారుణ్యం
1888 ఆగస్టులో స్వామీజీ బృందావనం చేరుకున్నారు.బృందావనం కృష్ణునికి చెందినదే అయినా అక్కడ రాజ్యపాలన చేస్తున్నది. రాధాదేవి. కృష్ణునికై తన దేహాత్మలను అర్పించి కృష్ణమయంగా రూపొంది భక్తికి మారుపేరుగా విరాజిల్లింది రాధ. బృందావనంలోని భక్తులు సైతం కృష్ణుని పేరు చెప్పకుండా, "రాధే రాధే" అనే స్మరిస్తారు. ఒక రోజు స్వామీజీ గోవర్ధన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆహారం కోసం ఎవరినీ యాచించకూడదనీ, యాదృచ్ఛికంగా లభించేది మాత్రమే స్వీకరించాలని ఆయన సంకల్పించుకొన్నారు.
మొదటి రోజు మధ్యాహ్నమయ్యేసరికి ఆయనకు బాగా ఆకలి వేయసాగింది. ఇంతలో హఠాత్తుగా పెద్దవాన కురిసింది. ఆకలీ, వాన
ఉదృతితో ఆయన స్పృహతప్పి క్రిందపడిపోయే స్థితికి చేరుకొన్నారు. అయినప్పు టికి ఆహారం కోసం ఎవరినీ యాచించలేదు. వానను కూడా ఖాతరు చేయ కుండా ముందుకు నడవసాగారు. హఠాత్తుగా వెనుక నుండి ఎవరో పిలిచినట్లయింది. కాని ఆ పిలుపును విననట్లే స్వామీజీ నడచిపోసాగారు. పిలిచిన కంఠం ఆయనను సమీపించింది.
వచ్చిన వ్యక్తి ఒక భక్తుడు. *"స్వామీజీ! మీకు ఆహారం తెచ్చాను, తినండి" అంటూ అతడు ఆయనను వెంబడించాడు. ఇది నిజంగానే రాధాదేవి కృపాకటాక్షమేనా అని తెలుసుకోగోరి స్వామీజీ తమ శక్తి మేరకు వేగంగా నడవసాగారు. అప్పటికీ భక్తుడు వదలలేదు. ఒక మైలు దూరం నడిచిన తరువాతే ఆ భక్తుడు స్వామీజీని సమీపించగలిగాడు. ఆయన ఎదుటకు వచ్చి ప్రణమిల్లిన ఆ భక్తుడు వారికి ఆహారం సమర్పించాడు. రాధాదేవి కారుణ్యాన్ని తలచుకొని కళ్లు చెమ్మగిల్లగా స్వామీజీ, "జై రాధే, జై కృష్ణా" అంటూ భక్తుడు సమర్పించిన ఆహారాన్ని స్వీకరించారు.*
*రాధాదేవి పెట్టిన పరీక్ష*
ఒక రోజు స్వామీజీ రాధాకుండంలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ రోజుల్లో ఆయన కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించేవారు. ఆయన వద్ద మారు గుడ్డ కూడా లేదు. ఆయన కౌపీనం ఉతికి ఆరవేసి, స్నానానికి నీళ్లలో దిగారు. స్నానం ముగించి గట్టు మీదకు వచ్చిచూస్తే కౌపీనం కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికి చూడగా చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ కౌపీనం చేతిలో ఉంచుకొని హాయిగా కూర్చుని ఉంది. ఆ కోతి వద్ద నుండి ఆ వస్త్రాన్ని రాబట్టుకోవడం అంత సులభమా? ఆయన వద్ద మరో వస్త్రం కూడా లేదు. ఇక ఊళ్లోకి వెళ్లడం ఎలా?
స్వామీజీ కోపం రాధ మీదకు మళ్లింది; 'తల్లీ! నేను ఊళ్లోకి వెళ్లలేను. కనుక అడవిలోకి పోతున్నాను. అక్కడే పడివుండి ఆకలితో, పస్తులతో అలమటించి చచ్చి పోతాను' అని అనుకొని వడిగా అడవిలోకి నడిచిపోసాగారు. ఇక్కడ కూడా ఒక భక్తుడు వచ్చాడు. అతడి చేతిలో క్రొత్త కాషాయ వస్త్రం ఒకటి ఉంది. దానిని స్వామీజీకి సమర్పించాడతడు. కళ్ల వెంట నీరు ధారగా స్రవిస్తూ స్వామీజీ ఆ వస్త్రం పుచ్చుకొన్నారు. తిరిగి కొలను గట్టు వద్దకు వచ్చి చూస్తే, ఆశ్చర్యం! స్వామీజీ కౌపీనం ఆయన ఆరవేసిన చోటే ఉంది!
*భగవంతుణ్ణి చేయూతగా చేసుకొని, మరో ఆసరా ఏదీ లేకుండా జీవించే వ్యక్తికి ఇలాంటి సంఘటనలు ఎంతో ప్రధానమైనవి. అవి ఆ వ్యక్తి విశ్వాసాన్ని పటిష్టం చేస్తాయి. అడవిలోను, సముద్రంలోను, గుట్టమీద, కొండమీద, గుహ లోను ఎక్కడ జీవించినప్పటికీ, ఎక్కడకు వెళ్లినప్పటికీ భగవదనుగ్రహం తనపై ఉంది. ఆ అనుగ్రహం తనను ఎటువంటి పరిస్థితులనుండైనా కాపాడుతుందనే విశ్వాసానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. మునుపటికన్నా తీవ్రంగా అతడు జపధ్యానాలు అనుష్ఠిస్తాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment