Xx2.xi. 1-5. 291022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అమ్మ…!*
* కొట్టను గాక, కొట్టను!*
➖➖➖✍️
నువ్వు లేచింది మొదలు నిద్రపోయే వరకు నీ అల్లరికి అంతులేకుండా ఉంది. ఉదయం లేవగానే ముఖం కడుక్కోమని టూత్ పేస్ట్ నీ చేతికి ఇస్తే, అదంతా పిండి కాలవలో పారేశావు.. పళ్ళు తోముకోకుండా నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి తూనీగలని పట్టుకుంటూ పరిగెత్తేవు…
నీకు స్నానం చేయించడం అంటే నాకు ఓ యజ్ఞం !
సబ్బు బిళ్ళ బకెట్ లో పడేసి నీళ్లన్నీ పాడు చేసావు…
నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావడం లేదు!
స్కూలుకు పంపిద్దాం అని డ్రెస్ వేస్తే, క్షణాల్లో మురికి చేసుకున్నావు… నీ పలకా, పలక పుల్లా ఎక్కడున్నాయో వెతికి ఇచ్చేసరికి నా తల ప్రాణం తోకకు వస్తుంది! వాటికి రోజూ చావు పుట్టుకే!! నువ్వు స్కూల్ కి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవరకూ నాకు శాంతి! కాస్త ఊపిరి పీల్చుకుని బలం పుంజుకుంటాను.!!
స్కూల్ నుంచి వచ్చాక భోజనం చేయడానికి ఎంత అల్లరి? కలిపి తినిపిస్తానంటే ఒప్పుకోవు! నువ్వే కలుపుకోవాలంటావు… కలిపిన అన్నం కంచంలో వదిలేసి వెళ్ళిపోతావు. ఇవాళ పెరుగూ అన్నం ఏం చేశావ్? నేను నీకు అన్నం కలిపి, బట్టలు ఉతుక్కునేందుకు పెరట్లోకి వెళ్తే, ఆ అన్నం కాస్త కుక్కపిల్లకు పెట్టేసావ్! అది తోక ఆడించుకుంటూ తింటూ ఉంటే, చప్పట్లు కొడుతూ దాని చుట్టూ తిరిగేవు!
అన్నం చేతులు కడుక్కోకుండా తలకు పులిమేసుకున్నావు. నేను చూసి నీ నడ్డి మీద ఒక్కటి అంటించాను! ఏడుస్తూ నేల మీద దొర్లేవు! మళ్లీ ఐదు నిమిషాలకు మామూలే!!
ఈ ఒంటిపూట బడులు కాదుగానీ, మధ్యాహ్నం అంతా నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేను ఒక వైపు నుంచి ఇల్లు సర్దుకుంటూ వస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి నువ్వు అన్ని పాడు చేస్తావు! తిలకం సీసా తీసి దాన్ని అద్దం మీద ఒంపేసావు. ‘ నేను చూస్తాను’ అనే భయంతో అదంతా నాన్న చొక్కా పెట్టి తుడిచేసి ఆ చొక్కా కనపడకుండా అలమార్లో కూరేశావు . ‘ఏమిటే చేస్తున్నావు?’ అంటూ నేను వచ్చేసరికి నాకు అందకుండా తుర్రున పెరట్లోకి పారిపోయావు.
పెరట్లో ఒక్కమొక్కనీ సవ్యంగా ఉండనివ్వవు!
చక్కగా పువ్వులు పూస్తున్న పూల మొక్కల్ని పీకి ఇసుక లో పాతిపెట్టావు…. నిమ్మ చెట్టు పిందెలను తెంపి గోలీలు ఆడేవు…. మల్లెమొగ్గల్ని ముదరకుండానే తెంపి, ఇసుక తో గుడి కట్టి దానిమీద గుచ్చావు… సాయంకాలం నీ ఒంటికున్న ఇసక అంతా చక్కగా దులిపి స్నానం చేయించి కొత్త రిబ్బన్లతో జడలు వేసి, కొత్త గౌను తొడిగాను.
“ఇంక మట్టిలో ఆడకూడదు కదూ.. ఆడితే మళ్లీ మట్టి అంటుకుంటుంది !మట్టి అంటుకుంటే, కురుపులు వస్తాయికదూ… ” అంటూ నా ముఖంలోకి చూస్తూ నంగనాచిలా అడిగావు .
నేను నిన్ను ముద్దు పెట్టుకుని బొమ్మలు ఇచ్చి ఇంట్లోనే ఆడుకొమ్మన్నాను . రెండు నిమిషాల్లో బొమ్మలు విసిరేసి, నా కళ్ళు కప్పి వీధిలోకి పారిపోయావు!
అరగంటలో ఒంటినిండా బురద పులుముకొని వచ్చావు. రెండు జడలూ విప్పేసుకుని, రిబ్బన్లు ఎక్కడో పారేసావు. గౌను తోలుముక్కలా అసహ్యంగా తయారు చేసుకున్నావు!
అన్నం పెడితే పెరుగు లేదని మారాం చేసి కంచం దూరం గా తోసేశావు. కంచం టేబుల్ మీద నుంచి కింద పడిపోయి అన్నమంతా తుళ్ళి పోయింది! నేను కోపం పట్టలేక ఆ చెంపా ఈ చెంపా గట్టిగా వాయించాను! ఏడుస్తూ వెళ్లి మంచం ఎక్కే సావు. అన్నం తినకుండా ఎక్కిళ్ళతో అలాగే నిద్ర పోయావు. నీ అల్లరితో ఎలా వేగను!?’
బేబీని మెల్లగా జోకొడుతూ సుశీల పడిన ఆవేదన అంతా ఆమె పెదాల కిందే ఉండిపోయింది!
నిద్రలో అప్పుడప్పుడు ఎక్కిళ్ళతో ఉలిక్కిపడుతోంది ఐదేళ్ల బేబీ! జోకొట్టడం ఆపి బేబీ చెంపల వంక చూసింది సుశీల. ఎఱ్ఱని ఆమె లేత చెంపల మీద మూడు వేళ్ళ గుర్తులు పడి ఉన్నాయి! బీబీ కనుకొలకుల్లోంచి జారిన కన్నీటి గుర్తులు ఇంకా తడిగా కనిపిస్తున్నాయి! రెండు నిమిషాలు తదేకంగా బేబీ వంక చూస్తూ ఉండిపోయింది సుశీల. ఆ పసి దాన్ని అంతలా కొట్టినందుకు మనసు విలవిల్లాడి పోయింది!
బేబీ మీద ప్రేమతో మనసు మూలిగింది! కందిపోయిన కపోలాలు చూసే సరికి హృదయం ద్రవించి పోయింది!!
‘నేను అమ్మను కాను, రాక్షసిని! లేకపోతే, ఈ లేత బుగ్గల మీద ఇంతలా కొట్టడానికి నాకు చేతులు ఎలా వచ్చాయి?’ అనుకుంది.
బేబీ బుగ్గల మీద పెదాలతో స్పృశిస్తూ, వణికే స్వరంతో గొణుగుతున్నట్లుగా మెల్లగా అంది సుశీల ” అల్లరి నువ్వు చేయకపోతే, ఎవరు చేస్తారు? నువ్వు నీ వయసుకు తగినట్లు ప్రవర్తిస్తున్నావు. నీ మనసుకు తగినట్టు ఆలోచిస్తున్నావు. నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నేర్పకపోవడం నాది తప్పు!
నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు చెప్పకపోవడం నా లోపం! అయినా, నీ వయసు ఇంకా కేవలం ఐదేళ్ళు!… నాలాగే ముఫై ఏళ్ల దానిలా నిన్ను ఆలోచించమనటం ఎంత అన్యాయం?! నాకున్నంత పరిజ్ఞానంతోనూ నువ్వు నడుచుకోవాలని నేను కోరడం ఎంత అవివేకం!? అందుకుగాను నిన్ను శిక్షించటానికి నేనెవర్ని?… రేపటి నుండి నిన్ను నేను కొట్టను!… అస్సలు కొట్టనుగాక, కొట్టను!”
బేబీ బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని దుప్పటి సవరించి కప్పింది సుశీల. బేబీ అమాయకమైన మొహం లోకి అలాగే చూస్తూ ఉండిపోయింది కొంతసేపు..✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment