*✍🏼 నేటి కథ ✍🏼*
*కట్టెలవాడు - నక్క*
ఒక అడవిలో కట్టెల వాడొకడు ఒక ఎండిన చెట్టు నరుకుతూ వుండగా, నక్క ఒకటి ఉరుకులు, పరుగులుగా వచ్చింది. బాబూ వేటగాళ్ళు నన్నూ తరుముకొని వస్తున్నారు. ఇక పరుగెత్తే ఓపిక నాకు లేదు. ఈ పొదలో నేను దాక్కుంటాను, వాళ్ళు వచ్చి అడుగుతారు. నక్క ఇటు వచ్చిందా అని అంటే రాలేదని చెప్పి నా ప్రాణము కాపాడవూ అని అతన్ని బ్రతిమాలుకున్నది. అలాగే చెబుతానులే అని దాన్ని ఓదార్చాడు. కట్టెలవాడి మాటలు నమ్మి ఆ నక్క పొదలో దాక్కున్నది.
కొంతసేపటికి వేటగాళ్ళు అక్కడికి వచ్చారు. నలుదిక్కులా ఆ నక్క కోసం చూశారు. అది ఎటూ కనిపించనందుకు కట్టెలవాడ్ని నక్క ఒకటి మాకు అందకుండా పరుగెత్తింది. అది ఈ వైపు వచ్చిందా అని అడిగాడు. అందుకు కట్టెలవాడు రాలేదు అంటూనే నక్కదాగి ఉన్న పొదవైపు వేలు చూపాడు. వేటగాళ్ళు అతని జవాబు వినగానే మరోదిక్కున పరుగెత్తారే కానీ అతని సైగ గమనించలేదు. వాళ్ళు చూపు మేర దూరము దాటి పోగానే నక్క పొదలోంచి బయటికి వచ్చింది. కట్టెలవాడ్ని పలుకరించకుండా తన నివాసం వైపు పోసాగింది అప్పుడు వాడా నక్కతో ఇలా అన్నాడు.
పంచకమా, నీకు మాట ఇచ్చినట్లు వేటగాళ్ళకు చెప్పి నీ ప్రాణం రక్షించాను గదా, ఇంత ఉపకారం చేసిన నన్ను కన్నెత్తి చూడకుండా, పన్నెత్తి పలుకరించకుండా పోతున్నావా, కృతజ్ఞత అనేది ఎరగనే ఎరగవా అని అడిగాడు. నక్క అతనికిలా బదులు చెప్పింది.
నీకు జీవనాధారమైన కట్టెల వలన మెత్తదనం అనేది ఉండదు. వీటితో సాంగత్యం వల్ల నీ మనస్సులో కూడా మెత్తదనానికి చోటు లేకుండా పోయింది. వేటగాళ్ళతో నీవు నేను చెప్పమన్న మాట చెపుతూనే నేను దాక్కొని ఉన్న పొదవైపు వేలు పెట్టి సైగ చేశావు గదా, ఆ సైగ నేను గమనించలేదనుకున్నావు, ఇటువంటి విశ్వాసఘాతకునివి నీకు నేను కృతజ్ఞత తెలుపుకోవాలా! ఈ మాటలు విని కట్టెలవాడు తలవంచుకున్నాడు. కావున మాటల యందు తీపి, మనస్సులో చేదుంచకూడదు.
No comments:
Post a Comment