Sunday, November 6, 2022

శ్రీకృష్ణుడే స్ర్రీజన మానసంరక్షకుడు! శరణాగతి

 021122e1216.   031122-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శ్రీకృష్ణుడే స్ర్రీజన మానసంరక్షకుడు!

                     శరణాగతి               
                  ➖➖➖✍️


భగవానుడైన శ్రీరాముడు ఒక స్త్రీ అయిన సీతాదేవి కోసం పలు ప్రయత్నాలను చేసి, లంకలో చెఱలో ఉండే ఆమెను కాపాడాడు. అతడు ఏకదారావ్రతుడు. అందరికీ రక్షకుడు. పరభార్యలను కంటితో కూడా చూడనివాడు. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. లోకప్రసిద్ధమైన విషయాలు, ఇవి.

భగవానుడైన శ్రీకృష్ణుడు ‘తాను స్త్రీలను రక్షించడం కోసమే అవతరించినవాడు’ అనే విషయాన్ని లోకానికి అంతటికి తెలియజేసినవాడు.   ఒక స్త్రీ చేసిన శపథాన్ని నెరవేర్చడం కోసమే చాలా తక్కువకార్యమైన దౌత్యాన్ని చేశాడు.

అర్జునునకు సారథి అయ్యాడు. అందుకోసమే భగవద్గీతను అర్జునునకు ఉపదేశించాడు. 

ఏమి? ఆశ్చర్యంగా ఉన్నదా? కొంచెం గమనించి చూడండి. మీకే తెలుస్తుంది.

ద్రౌపది శపథం చేసింది. తనను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసినవాడు దుశ్శాసనుడు. ‘అతనిని కానీ, ఒక స్త్రీ అయిన తనను  నిండు సభలో అవమానం చేయడానికి ప్రయత్నం చేసిన నూరుగురు అన్నదమ్ములను కానీ, వధించే తీరాలి!   దుశ్శాసనుని రక్తాన్ని తన కురులకు పూసుకుంటే కానీ, విప్పుకున్న ఆ కురులను ముడివేసుకోను!’ ౼ అని ద్రౌపది శపథం చేసింది. ఈ శపథాన్ని తప్పక పూర్తి చేయాలి. అప్పుడు  చాలా వయసులో పెద్దవారు కానీ, జ్ఞానంలో పెద్దవారు కానీ, చివరికి రాజ్యాంగం కానీ, ఎవ్వరూ దానికోసం ముందుకు రాలేదు.. ఏ ప్రయత్నం చేయలేదు. ఒక స్త్రీకి అవమానం జరిగితే, ఎవరినైనా ఎదిరించవచ్చు, ఎటువంటి ప్రయత్నాన్ని అయినా చేయవచ్చు, ఆ అకార్యం చేసినవారికి తప్పక తగిన దండన విధించి తీరాలి. అది చివరకు చాలా తీవ్రమైన దండన అయినా, మరణశిక్ష అయినా సరే, దోషం లేదు౼ అని కదా మనం శాస్త్రాల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాము. అందువల్ల ద్రౌపదికి సహాయం జరగాలి.  ఆమె శపథం నెరవేరాలి. దోషులు శిక్షింపబడాలి. అది ఆనాడు అయినా సరే, ఈనాడు అయినా సరే. అది జరిగి తీరవలసిన న్యాయం. ఇప్పుడు, ఈ కాలంలో కూడా, ఏ స్త్రీ విషయంలోనైనా, అన్యాయంగా తప్పుగా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిని అవమానం చేస్తే, ఆ అకార్యం చేసినవారికి తీవ్రమైన శిక్షణ విధించాలి౼ అని,  సంఘంలో ఉండే న్యాయం చెప్పే పెద్దవారు కానీ, స్త్రీసంఘాలు కానీ, న్యాయజ్ఞులు ఎవరైనా కానీ, గట్టిగా వాదిస్తున్నారు కదా. చట్టం కూడా, ‘ఎవరైనా స్త్రీకి అన్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తే తగిన దండన విధించాలి, అది చివరకు మరణశిక్ష అయినా తప్పులేదు!’  అని కదా, తెలుపుతున్నది. 

అందుచేత, ద్రౌపదికి న్యాయం జరగాలి, సహాయం జరగాలి, దోషులు శిక్షింపబడాలి. అయితే, ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేశారు? ధర్మపుత్రుడు ‘ధర్మం! ధర్మం!’  అని అంటూ ఆభాస ధర్మాన్ని పట్టుకున్నాడు. ‘అన్నగారి మాటను దాటకూడదు’ అని అర్జునుడు మొదలైనవారు ఊరికే ఉండిపోయారు. అయితే, ఒక్క భీముడు మాత్రం ‘ద్రౌపదికి అన్యాయం చేసిన వీరిని వధించి తీరతాను!’౼ అని అన్నాడు.

 అయితే, ఆ సభలో ద్రౌపది ఎవరినీ నమ్మలేదు;  ఎక్కడో ద్వారకలో ఉండే శ్రీకృష్ణుని నమ్మింది. అతనిని ‘శరణాగతి’ చేసింది. “ద్వారకానిలయ! అచ్యుత! గోవింద పుండరీకాక్ష! రక్ష మాం శరణాగతామ్” అని వేడింది. 
ఆ శ్రీకృష్ణుడే ఆమెను ఆ ఆపద నుండి కాపాడాడు. తానున్న చోటు నుండి ఆమెకు వస్త్రదానాన్ని చేసి, ఆమె మాన సంరక్షణను చేశాడు. ఆ విధంగా ద్రౌపది ప్రార్థించిన సమయంలో ఆమెను రక్షించి, ఆమెకు న్యాయం చేసినవాడు, శ్రీకృష్ణుడు. ఆమెకు అవమానం జరగకుండా అడ్డుకున్నవాడు, శ్రీకృష్ణుడు.

అంతటితో అతడు ఆగలేదు. ‘ద్రౌపది నన్ను నమ్మింది. నన్ను శరణాగతి చేసింది. ఆమె శపథాన్ని నెరవేర్చాలి. ఇంతే కాక, ఒక స్త్రీకి అన్యాయం జరిగితే తప్పక తగిన దండన లభిస్తుంది౼ అనే విషయాన్ని లోకానికి తెలియాలి!’ ౼అని అతడు భావించాడు. 

నిజానికి శ్రీకృష్ణుడు కాక, ఇంకా ఎవరైనా ఒకరు దూతగా వెళ్లి ఉంటే, యుద్ధ నివారణ జరిగి ఉండేదేమో! అందుచేత శ్రీకృష్ణుడే స్వయంగా పాండవ దూతగా వెళ్లి, యుద్ధం కోసం ఇరుపక్షాలను ప్రేరేపించాడు. అర్జునునకు రథసారథి అయ్యాడు. శ్రీకృష్ణుడు కాకుండా వేరొకడు అర్జునులకు సారధి అయి ఉంటే, అర్జునుడు కోరిన విధంగా రథాన్ని నడిపి ఉండేవారు, సందేహం లేదు. కానీ, భీష్మద్రోణాదులను చూసి అర్జునుడు, *నేను యుద్ధం చేయను*౼అని వెనుకంజ వేసినప్పుడు అతనిని అతడు  యుద్ధానికి ప్రోత్సహించి ఉండేవాడా !అయితే, శ్రీకృష్ణుడు యుద్ధానికి వెనుకడుగును వేసిన అర్జునుని ప్రోత్సహిస్తూ, 700 శ్లోకాలు కలిగిన భగవద్గీతను అతనికి ఉపదేశించాడు. *నీవు యుద్ధం చేసి తీరాలి*౼అని అన్నాడు. అర్జునుడు *సరే* అని అంగీకరించి, గాండీవాన్ని చేతబట్టి యుద్ధం చేశాడు, జయించాడు. ఈ విధంగా అర్జుననకు సారథియై, అతని యుద్ధానికి ప్రోత్సహించి, తాను ఏ ఆయుధాన్ని పట్టకుండా, యుద్ధాన్ని నిర్వహించి, ఒక స్త్రీ చేసిన శపథాన్ని సఫలం చేసినవాడు, శ్రీకృష్ణుడు.

       ఈ సందర్భంలో వేరొక అంశాన్ని కూడా నిశితంగా గమనించి చూడాలి; యుద్ధాన్ని ప్రోత్సహించడం కోసం అర్జునునకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడు౼ అని అన్నాము కదా? ఇది నిజంగా ఆవశ్యకమైన యుద్ధమే కదా? ఈ  యుద్ధం జరిగి ఉండకపోతే,  ద్రౌపది శపథం నెరవేరి ఉండేదా? ఉండదు కదా;  ఒక స్త్రీ చేసిన శపథం  నెరవేరాలి కదా! అది కూడా ఒక బాధింపబడిన స్త్రీ చేసిన శపథం కదా! అది నెరవేరాలి కదా! అందుకోసమే శ్రీకృష్ణుడు ఇన్ని విధాలైన ప్రయత్నాలను చేశాడు. ఆ  బాధ్యతను అంతటినీ తన తలకు ఎత్తి కొన్నాడు శ్రీకృష్ణుడు. దూతగా వెళ్ళాడు, రథసారథి అయ్యాడు, గీతను బోధించాడు. అధర్మాన్ని చేసిన అందరూ నశించారు. ఈనాడు మనం *ఒక స్త్రీకి అన్యాయం చేసినవారికి శిక్ష తప్పక విధింపబడాలి* అని అంటున్నామే!  దానిని నెరవేర్చినవాడే, శ్రీకృష్ణుడు. అందుకోసమే భగవద్గీతను బోధించాడు. అందుచేత, భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహించే శాస్త్రం౼అని అన్నా తప్పు లేదు కదా. ఈయుద్ధం ఆవశ్యకమే కదా. అది జరిగితే కదా అవమానింపబడిన స్త్రీ చేసిన  శపథం నెరవేరినట్లు అవుతుంది. దీనిని అంతా గమనించే, శ్రీకృష్ణుడు వీటిని అన్నిటిని చేశాడు. ద్రౌపదికి జరిగిన అవమానాన్ని తీర్చడం కోసం శ్రీకృష్ణుడు ఎన్ని ప్రయత్నాలు, ఎంతగా చేశాడో కదా! యుద్ధంలో చివరకు  వధింపబడిన దుశ్శాసనుని రక్తాన్ని తన కురులకు పూసుకొని, వాటిని ముడివేసుకుని, తన శపథాన్ని ద్రౌపది తీర్చుకున్నది .సఫలం చేసుకున్నది. ద్రౌపది అవమానాన్ని తీర్చి, ఆమె చేసిన ప్రతిజ్ఞను శ్రీకృష్ణుడు నెరవేర్చిన  వృత్తాంతం, ఇది.

       ఇక, ఉత్తరాదేవి విషయం. ఈమె అభిమన్యుని భార్య. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్ర ప్రభావంచేత ఆమె గర్భంలోని శిశువుకు ఆపద సంభవించింది. ఆమె కూడా శ్రీకృష్ణుని శరణాగతి చేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు శంఖచక్రాయుధ సహితుడై ఆమె దగ్గరకు వెళ్లి, ఆమెను రక్షించాడు. ఆమె గర్భంలోనే శిశువుకు హాని జరగకుండా కాపాడాడు. ఆ విధంగా ఒక స్త్రీ చేసిన ప్రార్థనకు తగినట్లు ఆమె గర్భంలోని శిశువును రక్షించి,,ఆమె  దుఃఖాన్ని తీర్చినవాడు, శ్రీకృష్ణుడు. 

        వివాహిత అయిన ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని తీర్చినవాడు, శ్రీకృష్ణుడు.

        గర్భవతి అయిన ఉత్తర గర్భానికి ఏర్పడిన ఆపదను తీర్చి కాపాడినవాడు, శ్రీకృష్ణుడు.

       ఇంత మాత్రమే కాదు, రుక్మిణీకల్యాణ వృత్తాంతాన్ని గమనిద్దాం. రుక్మిణికి కల్యాణం కాని కన్య.  ఆమె శ్రీకృష్ణుని ఆశ పడినది, అతనిని వివాహం చేసుకోవాలని అనుకున్నది. అయితే, ఆమె మనోరధథానికి విరుద్ధంగా, ఆమె సోదరుడు రుక్మి అన్యాయంగా దుర్మార్గుడైన శిశుపాలునకు ఆమెను ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నించాడు. దానిని చూచి సహించలేక, రుక్మిణి ఏడు శ్లోకాలతో కూడిన ఒక లేఖను శ్రీకృష్ణునకు పంపుతూ, తనను రక్షించమని, తనను వివాహం చేసుకోమని శరణాగతి చేసింది. శ్రీకృష్ణుడు ఆ లేఖను చూశాడు. ఆమె శరణాగతిని స్వీకరించాడు. 

ఒకే రాత్రిలో ద్వారకా నగరం నుండి విదర్భదేశానికి వచ్చి, రుక్మిణి దేవిని తన రథంలో కూర్చుండబెట్టుకొని, తనను ఎదిరించిన  అందరినీ జయించి, ఆమెను  వివాహం చేసుకొని, ఆమె మనోరథాన్ని తీర్చాడు. ఆ విధంగా వివాహం జరగని, తనను ఆశపడిన కన్య చేసిన  ప్రార్థనను మన్నించి, ఆమెను కాపాడి, వివాహం చేసుకొన్నవాడు కూడా, శ్రీకృష్ణుడే.

       వివాహిత అయినప్పటికీ, తనకు అన్యాయం జరిగేటప్పుడు, తన భర్తలు సైతం రక్షించలేని స్థితిలో ద్రౌపదిని కాపాడినవాడు, శ్రీకృష్ణుడు భర్తను కోల్పోయి, తన బిడ్డకు ఆపద సంభవించేటప్పుడు, ఉత్తర చేసిన ప్రార్థనను మన్నించి ఆమెను రక్షించినవాడు, శ్రీకృష్ణుడు. ఆమె  కుమారుని రక్షించి, ఆమె వంశక్రమాన్ని కాపాడినవాడు, శ్రీకృష్ణుడు. కన్య అయిన రుక్మిణి శరణాగతిని మన్నించి, ఆమె మనోరథాన్ని తీర్చినవాడు, శ్రీకృష్ణుడు. ఈ విధంగా, స్త్రీలకు జరిగిన అన్ని విధాలయిన అన్యాయాలను తీర్చి, వారిని కాపాడినవాడు శ్రీకృష్ణుడే. ఆ స్వామి విషయంలో శరణాగతి చేసినవారు కోరినది  ఏమి నెరవేరదు? ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా ద్రౌపదికి ఈ విధంగా తెలియజేశాడు. *ద్యౌః పతేత్  పృథివీ శీర్యేత్  హిమవాన్ శకలీ భవేత్, శుష్యే త్తోయనిధిః  కృష్ణే! న మే మోఘం వచో భవేత్* ౼ *ద్రౌపదీ! ఆకాశం ఏనాడూ కింద పడదు, అయినా, అది పడినప్పటికీ,  భూమి ఏ నాడూ బ్రద్దలు కాదు, అది బ్రద్ధలు అయినప్పటికీ, హిమవత్ పర్వతం ఏ నాడూ  పొడిపొడి కాదు, అది ఆ విధంగా అయినప్పటికీ, సముద్రం ఏ నాటికీ ఎండిపోదు, అది ఎండిపోయినప్పటికీ, నా మాట మాత్రం వ్యర్థం కాదుసుమా!, ఏనాడూ వట్టిపోదు. నిన్ను రక్షించే తీరుతాను* అని అన్నాడు, శ్రీకృష్ణుడు

       ఈ విధంగా శ్రీకృష్ణుడు స్త్రీజనసంరక్షకుడై, సకలాత్ములకు రక్షకుడై, " *నమ్ కణ్ణల్లదు ఇల్లై ఓర్ కణ్ణే* ( మన శ్రీకృష్ణుడు తప్ప వేరొకడు ఎవరూ రక్షకుడు కాడు) అని  ఆళ్వారులు పలికినట్లుగా, మన శ్రీకృష్ణుడే స్త్రీజనమాన సంరక్షకుడు, మనకు అందరికీ రక్షకుడు. వేరొకరు ఎవ్వరూ రక్షకులు కానే కారు. ఈ సత్యాన్ని గుర్తిద్దాం. అందరికీ తెలియజేద్దాం. అందరం ఆ శ్రీకృష్ణుని ఆశ్రయిద్దాం.
తరిద్ధాం.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment