Sunday, November 13, 2022

కోపం ఉండాలా ?వద్దా ?ఆ కోపం ఎలా ఉండాలి ఈ విషయాల గురించి....

 ఈరోజు కోపం ఉండాలా ?వద్దా ?ఆ కోపం ఎలా ఉండాలి ఈ విషయాల గురించి తెలుసుకుందాం.

  విశ్వామిత్రుడికి కోపం ఆయన స్వభావంలోనే ఉంది. వసిష్ఠుడికి మాత్రం పిలిచినప్పుడే వచ్చేది. ఇది రామాయణం చెబుతున్న మాట, పైకి ఎంతో ఆసహనంగా, ధుమధుమలాడుతూ కనిపించే వారు లోలోపల పరమ శాంతమూర్తి గా ఉంటారు.ప్రతి మనిషిలోనూ ఈ స్వభావాలు రెండూ ఉంటాయి.

 పైకి కోపిష్టులుగా కనిపించే పరమ శాంతమూర్తుల వల్ల లోకానికి ఏ రకమైన అపకారమూ జరగదు. గుండెలో నిండుగా ప్రశాంతత గూడు కట్టిన శాంతస్వభావులు చాలా సందర్భాల్లో వాస్తవానికి కోపాన్ని నటిస్తారు. అవసరమైన సందర్భాల్లో కావాలని కోపం తెచ్చుకొంటారు. 

అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడు ధర్మరాజు అలిగిన నాడు ఏం జరుగుతుందో కృష్ణుడు వివరించాడు. పరమ శాంత స్వభావి సీతమ్మ కావాలని ఆగ్రహాన్ని ఆవాహన చేసుకొంటే, అంత గొప్ప దశకంఠ రావణుడు. ఆమె ముందు గడ్డిపోచ అయిపోయాడని వాల్మీకి వర్ణించారు. అలాంటివారికి కోపం రానీయకుండా మనం చూసుకోవాలని అర్ధం. రామాయణం తొలి శ్లోకాల్లో రాముడు జితక్రోధుడు' అన్నారు. వాల్మీకి. అంటే కోపాన్ని జయించినవాడు అని .ఆ రాక్ష సంహార వేళ మాత్రం. రాముడికి కోపం అవసరమయ్యేది. అప్పుడు క్రోధ మహారయామాస... పనిగట్టుకుని కోపాన్ని పిలిచేవాడట.

మనిషి ఉండవలసిన తీరు అదే. వాల్మీకి రామాయణం మనిషికి నేర్పుతున్నది అదే. లోపల, బయట విశ్వామిత్రుడి మాదిరిగానో... దుర్వాసుడి తరహాలోనే అనుక్షణం కోపంతో కుతకుతలాడిపోయే మనుషుల వల్ల అటు వారికి, ఇటు సమాజానికి తీరని అపకారం జరుగుతుంది. అలాగే, లోపల అంతులేని కుళ్ళును, అమితమైన కోపాన్ని దాచిపెట్టుకొని మరీ పైకి పరమ శాంతస్వభావులుగా నటించేవారివల్లా మానవ సమాజానికి ఎంతో హాని జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులనే 'తేనెపూసిన కత్తులు అన్నారు మన పెద్దలు. స్వభావరీత్యా దుర్మార్గులై ఉండి, వారు పైకి మాత్రం మంచితనం ప్రదర్శిస్తారు... అతి వినయం చూపిస్తారు... అది ధూర్తుల లక్షణం.. దానికి 'నక్క వినయం' అని పేరు. వాళ్లు సమాజానికి ప్రమాదకారులు.

ఇదికాక 'ధర్మాగ్రహం' అనేది మరో తరహా కోపం . మగపక్షిని నిషాదుడు బాణంతో కొట్టి చంపాడు. ఆడపక్షి దయనీయంగా రోదిస్తోంది. ఈ దృశ్యం చూసిన వాల్మీకి మహర్షికి కోపం పిలవకుండానే వచ్చేసింది. 'ఆదర్మోయం' అని ఆయన గట్టిగా అరిచాడట. ఆది ధర్మాగ్రహం అంటే! మహర్షి కోపం లోంచే శ్రీమద్రామాయణ సార భూతం, సర్వలౌకిక ఛందస్సులకూ ఆధారభూతం అయిన మాని.. శ్లోకం ఆవిర్భవించింది. ధర్మానికి హాని కలిగినప్పుడు సజ్జనుల - గుండెల్లోంచి ఉప్పొంగేది ధర్మాగ్రహ జ్వాల. అది అధర్మాన్ని శిక్షిస్తుంది.

- ఎర్రాప్రగడ రామకృష్ణ .
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment