అడ్డుపడే మనసు ప్రపంచంలో దేవుడు అనే విషయం మీద జరిగినన్ని చర్చలు, వాదోపవాదాలు, తర్కాలు ఇంకే విషయం మీదా జరిగి ఉండవు. ఎందుకంటే దేవుడు అనేది అంతుపట్టని, అనంతమైన భావం. ముగింపు లేని నిత్యనూతన సనాతన చారిత్రక సత్యం. ఏ మనసు ఉంటే ఆ దైవం అనే సత్యం అవగాహనకు రాదో, ఆ మనసును పట్టుకుని వేలాడుతూ దైవం మీద వ్యాఖ్యానాలు, ప్రవచనాలు చేస్తుంటారు. తాము దేవుడిని చూశామంటారు కొందరు. ‘నేనే దేవుడిని’ అంటారు మరికొందరు.
మనసు ఎప్పుడు అణిగిపోతుందో అప్పుడే, లోపల ఉన్న దైవం జాగృతమవుతుంటాడు. మనసు ఎప్పుడు సాధకుణ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో, అప్పుడు అతడు నడిచే దైవమే... సందేహం లేదు అంటారు రమణ మహర్షి. మనసు అద్దం. అది నీకు ఏది చూపిస్తుందో ఆ ప్రతిబింబంలోనే జగత్తు, దేవుడు కనిపిస్తారు. ప్రతిబింబం సత్యం కాదు. బింబం సత్యం. మనసు లేకుండా చేసుకుంటే జగత్తు, దాని యథార్థ స్వరూపం బోధపడతాయి. చితిలో కట్టెను తీసుకుని చితిని తగలబెట్టినట్లు, మనసు సహాయంతోనే మనసును లేకుండా చేసుకోవాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
మనిషిలో మనసును పెట్టి దైవం మనల్ని భూమి మీదకు పంపించాడు. ఎందుకంటే ఆయనను తెలుసుకొమ్మని. కళ్లు, ముక్కు, చెవులు, శిరసులా మనసు ఒక పరికరం. ఇంద్రియాలను నడిపించే మహా పరికరం. అది తెలియక మనసుకు, శరీరం వశమై పోవడం వల్ల మనం దారి తప్పిపో తున్నాం. రంగురంగుల ప్రపం చంలో ఆకర్షణల వెంటపడి, వచ్చిన పని మరిచిపోయి మనసు మాయా జాలంలో పడిపోయి దేవుడి గురించి మరిచిపోతున్నాం.
దేవుడు ప్రధానం. మిగతావి అప్రధానం అని మనకు తెలియడం లేదు. మావితో శిశువును కప్పేసినట్లు మనసు మన కళ్లముందర జలతారు పరదాలు పరుస్తోంది. ఎండమావులను నీటి చెలమలుగా చూపిస్తోంది. ఆకాశంలో పుష్పాలు పూయిస్తోంది. కుందేళ్లకు కొమ్ములు మొలిపిస్తోంది. తాడును పాముగా చూపించి భయపెడుతోంది... అర్ధరాత్రి చీకటిలో, నల్లపిల్లిని గుడ్డివాడు వెదికినట్లుంటుంది ఈ ఆధ్యాత్మికత, ఈ భగవంతుడు అనే అంశం అంటారు ఓషో. మనసుతో వెదికితే దైవం ఎన్నటికీ కానరాడు. తర్కానికి అందడు. మనసుకు తర్పణాలు ఇచ్చి, హృదయ సముద్రంలో ప్రేమతో మునకలు వేసేవాణ్ని అనుభూతి రూపంలో ఆనంద తరంగాలతో దేవుడు ఆలింగనం చేసుకుంటాడు.
దైవం నీకు తెలిసిన మరుక్షణం నీ నుంచే, పని చెయ్యడం ప్రారంభిస్తాడు. తన ప్రణాళికను అమలుపరచడానికి నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. మనసు మారడం, ఆచరణలో దయ, ధర్మం, భావంలో పరిపక్వత, దైవం వైపు మన అడుగులు పడుతున్నాయనడానికి నిదర్శనం. వెదికినా కనిపించని మనసు కలిగి... రాయికి, బంగారానికి తేడా చూపని మహానుభావులు లోకాన్ని మంచి వైపు నడిపిస్తారు. వారికి మనసు ఉన్నా లేనిదై, వైశాఖమాసపు ఎండలో సూర్యుడి ముందు పెట్టిన దీపంలా వెలాతెలాపోతుంది. ఉనికిని కోల్పోయిన మనసు, దైవ కాంతితో కలిసి దేదీప్యమానంగా వెలుగుతూ వారి రూపురేఖలు, నడవడిక మార్చి చీకటిలో ఉన్నవారిని వెలుగు వైపు నడిపిస్తుంది.
అందుకే మనసును ప్రార్థించాలి. పూజ చెయ్యాలి. దైవాన్ని చూడనివ్వకుండా అడ్డుపడవద్దని వేడుకోవాలి. మనసు కరిగితే, దైవరూపం తెలుస్తుంది. సత్యరూప దర్శనం కలుగుతుంది.
- ఆనందసాయి స్వామి
No comments:
Post a Comment