Monday, November 7, 2022

ఋతంబర ప్రజ్ఞ

 సద్గురు పరబ్రహ్మణేనమః

     ఋతంబర ప్రజ్ఞ

తాను తానుగా వుండి తన భావములను తననుండి వ్యక్తమగుతున్న క్రీడగా దర్శించువాడు స్థిరుడై నిలబడును. అట్టి స్థిరత్వమును ఋతంబర ప్రజ్ఞగా పేర్కొన్నారు. తాను తానుగా వుండుటయే గాని తనకన్న వేరుగా ఊహించుట ఈ స్థితి యందు ఉండదు. తను వుండుటయేగాని తనను గురించిన భావనగాని అవగాహనగాని వుండదు, ఇంద్రియపరముగా వినుట చూచుట స్పర్శించుట రుచి వాసన చూచుట వుండదు.
తనకన్న వేరుగా ఏదియు గ్రహింపబడదు. ఇతరములు లేని తానుండును. 
ఇది అనుభవైక విషయమే కాని ప్రత్యేకముగా అర్ధము చేసుకొను విషయము కాదు.
ఈ అనుభవము పొందిన వ్యక్తి దీనిని గురించి విశేషముగా వర్తించును గాని దీనిని వర్ణింపలేడు.
వివరణ : సత్యాన్వేషికి మార్గమున ఎన్నియో ధర్మములు, సృష్టిరహస్యములు, శాశ్వత సత్యములు తెలియుచుండును.
ఇవన్నియు తానుండుటవలన వానిని గ్రహించుట జరుగుచున్నది. 
కావున ధర్మములు, సత్యములు, సృష్టి రహస్యములకన్న తానున్నాడను సత్యము మిన్నగా గోచరించును. 
తానుండుటవలననే భావించుట, గ్రహించుట, జరుగుచున్నది. తాను తానుగా వున్నప్పుడు భావనలు, గ్రహణము కూడ అదృశ్యమగును.
తాను తప్ప ఇతరములు లేని సంస్కారమున జీవించుట అట్టి స్థితియందు ధీర్ఝకాలముండుటను ఋతంబర ప్రజ్ఞ అందురు

మాస్టర్ E.K. యోగప్రసంగములు నుండి సేకరణ

     సద్గురుభ్యోనమః

No comments:

Post a Comment