*స్వయంకృతాపరాధం*
ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషినీ ఎవరూ నాశనం చేయరు. అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఇది రమణ మహర్షి మహితోక్తి.
సృష్టిలో మనిషి ఉత్కృష్టజీవి, తెలివిగల ప్రాణి. అటువంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి వెదకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడు.
జీవిత గమనంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రాతిపదిక. వాటికి క్షేత్రం మనసు. నేలలో వేప విత్తనం నాటితే వేపమొక్క మొలుస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టుగా తయారవుతుంది. మనిషి జీవన సాఫల్యవైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి.
ఏ మనిషినైనా శిఖరాగ్రం మీద నిలబెెట్టాలన్నా, అధఃపాతాళానికి తొక్కేయాలన్నా - ఆ పని ఎవరో పని కట్టుకుని చేయనక్కర్లేదు. అతడి ఆలోచనా విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది.
గౌతమబుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గంలో ఒకటి ‘సమ్యక్ ఆలోచన’. మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావం.
మన మనసు ఒక ఇల్లనుకుంటే ఇంటి దొంగలు ఆరుగురు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అందరికీ తెలిసినవారే. తెలిసినా అప్రమత్తంగా ఉండం. చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టపోయాక విచారిస్తే ఏం లాభం?
అందరికంటే అధికంగా సంపాదించాలి... ఎలాగైనా, ఏం చేసైనా సంపాదించాలి... అందులోనే ఆనందం ఉంది... అదే జీవిత పరమార్థం- ఇలా సాగుతుంది ఒకడి ఆలోచన.
అందరికీ నేనే పెద్దగా ఉండాలి. అందరిపైనా పెత్తనం చలాయించాలి. పెద్దరికంకోసం, అధికారం కోసం వంచన, కుట్ర, కుతంత్రం... ఏం చేసినా తప్పుకాదు- ఇలా ఆలోచించేవాళ్లు నేడు చాలామంది కనిపిస్తున్నారు.
తనకంటే మంచి స్థితిలో ఉన్నవాణ్ని చూసి, సమర్థుణ్ని, ప్రతిభావంతుణ్ని చూసి అసూయపడటం, వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచించడం చాలా మందికి అలవాటు.
చూసినదల్లా నాకు దక్కాలి - అది దేశసంపదైనా, పరాయివాడి భార్య అయినా- నేనాశించింది అందాల్సిందేనని తపనపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు.
వీరంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే. కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే.
రావణుడు వేదవేదాంగ పారంగతుడు, శివపూజాతత్పరుడు, వరదాన బలాన్వితుడు. మహాబలసంపన్నుడు, శత్రుజన భయంకరుడు. యుద్ధతంత్రకోవిదుడు... ఇన్ని మేలిమిగుణాలు గల వ్యక్తిలో రెండే రెండు బలహీనతలు. స్వాతిశయం, కాముకత. రజస్తమోగుణాలు వాటి మూలకందాలు.
స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచీ రగుల్కొన్నది. మధ్యలో మొలకెత్తింది, ముదిరింది - కాముకత. మొత్తానికి రెండూ విషపు కోరలతో అతణ్ని కాటువేశాయి. దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి.
భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణుడు చేసిన మహాపాపం.
అసూయ, క్రోధం, దురభిమానం మనసునిండా నింపుకొన్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. అతడు సుయోధనుడు అభిమాన ధనుడు. ‘ధర్మమేమిటో నాకు తెలుసు కాని నా మనసు ధర్మమార్గంలో వెళ్లలేదు. అధర్మమార్గమంటే ఏమిటో కూడా తెలుసు. అది నన్ను విడిచిపెట్టడం లేదు, అని ఒక దశలో అతడే చెబుతాడు.
ఎన్ని ప్రజ్ఞలున్నా ఎంత అర్థఅంగ బలమున్నా మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే, అధర్మమార్గంలో ప్రవర్తిస్తే- ఎంతటివారికైనా... పతనం తప్పదు.
- డాక్టర్ దామెర వేంకటసూర్యారావు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పిద్దాం
No comments:
Post a Comment