*🧘♂️70 - శ్రీ రమణ మార్గము🧘♀️*
*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*
*అహానికి చావు పుట్టుకలుంటాయి.*
పృచ్ఛకుడు :- మనిషిలో జన్మ జన్మలకూ కొనసాగే ఆత్మపదార్థమంటూ ఏదీ లేదు అంటారు బౌద్ధులు. ఈ దృష్టి సరియైనదా కాదా? హిందూమతమేమో జన్మ తర్వాత జన్మనెత్తే అహం వున్నదంటుంది. ఈ లెక్కన ఆత్మ అనేది కొనసాగుతున్నట్టా, ఇదే జన్మ తర్వాత జన్మనెత్తుతూ వున్నదా, లేక కేవలం కొన్ని సంస్కారాలు మాత్రం ఒకటిగా కూడి, మళ్లీ మళ్లీ జన్మనెత్తుతుంటాయా?
రమణుడు :- అసలు ఆత్మ అనుస్యూతమైనదే. ఏవిధంగానూ చెక్కు చెదరకుండా కొనసాగుతూనే వుంటుంది. మళ్లీ మళ్లీ జన్మలెత్తే అహం, కిందిస్థాయికి చెందినటువంటిది. అంటే ఆలోచనా పరిధికి చెందినదన్న మాట. ఆత్మని వాస్తవం చేసుకున్నప్పుడు, మళ్లీ మళ్లీ జన్మనెత్తే ఈ అహాన్ని దాటడ మవుతుంది.
పునర్జన్మలనేవి వేరొక కొమ్మ రెమ్మ వల్ల సంభవిస్తున్నాయి కాబట్టి బౌద్ధులు వాటిని తిరస్కరిస్తున్నారు. చిత్ చైతన్యం, జడపదార్థమైన దేహంతో మమేకమైన కారణంగా ఈ అజ్ఞానం సంభవిస్తున్నది.
పృచ్ఛకుడు తన చివరి ప్రశ్న వేగిరంగా వేసేశాడు :- 'మనం ఇక్కడ ఆచరించే పుణ్యకర్మల ఫలితంగా స్వర్గానికి వెళతామంటారా?
అందుకు రమణులు, 'ఇప్పుడీ బ్రతుకు ఎంత సత్యమో, అదీ అంతే సత్యం. దానిని వదిలేసి, ఆత్మ విచారణతో మనమెవరో కనుక్కోగలిగితే, స్వర్గాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరమేముంటుంది?’
ఒక విషయం నుండి మరొక విషయానికి గెంతుతూ, దేనినీ సాకల్యంగా పరీక్షించక, అనేక ప్రశ్నలను కురిపించిన ఈ పృచ్ఛకుడు తానేమి ప్రయోజనం సాధించాడో కానీ, మహర్షి చేత చెప్పించిన సమాధానాలకు మనము కృతజ్ఞులమై వుండాలి; మనకైనా మహర్షి మాటలు ఉపయోగపడి వుంటే ధన్యులమే.
వాంఛల విస్పోటన:-
దూరశ్రవణం, దూరదర్శనం వంటి సిద్దులు మనిషికి ఉపయోగపడేవే కదా అని శ్రీ రమణుల వారిని అడిగాడు ఒక భక్తుడు. “టెలిపతీ అనేది దూరాన జరిగే విషయాలను, సంభాషణలను మనిషి కళ్లముందు ప్రదర్శిస్తుంది. అయితే దూరాన జరిగేవి విన్నామా, లేక సమీపంగా జరిగే వాటిని విన్నామా అనేది మనిషికి తెచ్చే తేడా ఏమీ వుండదు. మౌలికమైన సత్యమేమిటంటే, ఇవి వినీ కనేటువంటివాడు, అనగా ఈ 'నేను' లేకపోయినప్పుడు వినేది లేదు, కనేది లేదు. ఈ వినడం, కనడం మనసు యొక్క విధులు.
అందువల్ల ఈ సిద్ధులు మనసులో మాత్రమే వున్నాయి. అవి ఆత్మకు సహజ మైనవి కాదు. సహజమైనది కాక, విడిగా ఆర్జించినదేదైనప్పటికీ, అది శాశ్వతంగా వుండేది కాదు; దానికై కృషి సల్ప బూనుకోడం వ్యర్థం.
మనిషి శక్తి కొద్దిపాటిదైన ఈ స్థితిలోనే ఇంత దుఃఖితమై వున్నాడు. సిద్ధుల ద్వారా తన శక్తిని పెంచుకోబూనుకున్నాడనుకుందాం; అప్పుడైతే తను ఆనందంగా వుండగలననుకోవచ్చు. పరిమితమైన ఈ శక్తితోనే ఇంత దుఃఖం పెనవేసు కొంటుండగా, అపరిమితమైన శక్తితో ఎంతెంత దుఃఖం అలము కుంటుందో ఆలోచించండి. సిద్ధుల ద్వారా దుఃఖం ఇబ్బడి ముబ్బడి కావచ్చు.
పోతే ఈ సిద్దులు దేనికట? అవి ప్రదర్శించినప్పుడు, ఇతర్లు తనని చూసి మెచ్చు కోవాలనేనా? ఆ మెప్పు రాకపోతే ఆశాభంగం, విచారం తప్పవు కదా; ఇతర్ల మెప్పుపై ఆధారపడాలి. తనకన్నా మరిన్ని సిద్దులున్నవారు తటస్థపడినా పడవచ్చు.
అప్పుడు ఈర్ష్యపడతాడు, దుఃఖితుడవుతాడు. మరిన్ని సిద్ధులున్నవాడు తార సిల్లితే, అతడు అన్నిటినీ చిటికెలో ధ్వంసం చేయవచ్చు. అతడు అందరి కన్నా గొప్ప సిద్ధుడు. అతడ్నే దేవుడనవచ్చు, అతడినే ఆత్మ అని కూడా అనవచ్చు.
ఏది నిజమైన శక్తో ఆలోచించండి. భాగ్యాన్ని పెంచెడిదా లేక శాంతిని నెలకొల్పేడిదా? ఏదైతే శాంతిని సుప్రతిష్ఠితం చేయగలదో అదే అన్నిటికన్నా గొప్ప పరిపూర్ణత్వం" అన్నాడు శ్రీరమణుడు.
భాగ్యం కన్నా మనిషికి శాంతియే అభిలషణీయం అని తేల్చాడు మహర్షి అర్థం భాగ్యం కోసమై మనుషులు కృషి సల్పరాదనీ, రమణుడు అభివృద్ధిని నిరోధిస్తున్నాడనీ, కాదు. మనిషి, మున్ముందు తనలో తాను శాంతిని నెలకొల్పుకోగలిగి వుండాలి. మానవుడిలో ఈ శాంతి అనే పునాదిరాయి సరిగా పడితే, ఆ తర్వాత తగిన సంపదకై ప్రయత్నించవచ్చు. అలాంటి బాహ్య సంపద అందరికీ కలగాలని కూడా ఆశించవచ్చు.
కానీ నేటి కాలంలో వాంఛలు అనంతంగా పెరుగుతున్నై. 'కోరికలు తీర్చుకో డానికే ఈ జీవితం, అనుభవించరా సోదరా, వెరపేల' అని బోధించే వర్గాలు బలపడు తున్నాయి. అంటే మనిషి కోర్కెల సముదాయం, విస్ఫోటనం చెందుతున్నది. ఈ తరుణంలో ప్రపంచం ఎలా రూపొందుతున్నదో ఒకసారి చూద్దాం.
ప్రపంచంలోని ప్రకృతి సంపదను సంరక్షించడానికి ఏర్పడిన సంస్థకు డైరెక్టర్ జనరల్ జేమ్స్ లీప్, ఆ మధ్య మాట్లాడుతూ, “అమెరికాలో జీవిస్తున్న వారి తీరుగా మిగతా ప్రపంచ వాసులు జీవించనారంభిస్తే, మన కోర్కెలు తీర్చడానికి ఈ భూగ్రహ సహజ సంపదేకాక మరో నాలుగు గ్రహాల సహజ సంపద అవసరం పడుతుంది. కానీ ఈ విషయంలో ఒక్క అమెరికా దేశస్తులనే అనక్కరలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజ, అమెరికా వాసులకన్నా, కోర్కెలు తీర్చుకోడంలో మరింత ముందడుగు వేసి వున్నారు.
ఫిన్లాండ్, కెనడా దేశవాసులు ఈ విషయంలో అమెరికా దేశీయులకన్నా కాస్త కింద వున్నారు.
ఆస్ట్రేలియన్లు కూడా, ఈ విషయంలో మరికాస్త కింది స్థాయిలో వున్నప్పటికీ, తమకున్న సాధన సంపత్తికన్నా ఎక్కువే వినియోగిస్తున్నారు. తమకు అందుబాట్లో వున్న వనరులను మహావేగంగా వ్యర్థపరుస్తున్నారు; వ్యర్థపదార్థాలను మానవ వనరులుగా తయారు చేయడానికి ప్రకృతికి ఎంతోకాలం పడుతుంది. కుప్పలు తిప్పలుగా వచ్చిపడే ఈ వ్యర్థపదార్థాలను స్వీకరించడానికి ఈ ఒక్క భూ గ్రహం చాలదు.
No comments:
Post a Comment