Saturday, November 19, 2022

హృదయంలో ఉన్న నిధిని దర్శించండి

 *హృదయంలో ఉన్న నిధిని దర్శించండి*

ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడున్నాడు. ఒక్కడే కుమారుడు. అతడు పెరిగి పెద్దవాడు కాగానే దురలవాట్లకు లోనయ్యాడు. త్రాగుడు, జూదం మొ॥న వాటికి విచ్చలవిడిగ డబ్బు ఖర్చుచేస్తున్నాడు. తండ్రి ఎంతో ఆలోచించి, కుమారుని హయాంలో తమ కుటుంబం పేదకుటుంబం కారాదనే భావంతో తనకున్న పొలాలు, స్థలాలు అమ్మి, ఆ మొత్తాన్ని బంగారంగా మార్చి, ఆ మొత్తాన్ని ఒక బిందెలో ఉంచి, అందరూ నిద్రపోయే అర్ధరాత్రి సమయంలో ఇంటి గర్భంలో నేలను త్రవ్వి, ఆ బిందెను అందులో పెట్టి, పూడ్చివేసి బండలు పరిచాడు. కుమారునికి డబ్బుగాని, అమ్ముకునేందుకు పొలాలు, స్థలాలు గాని అందుబాటులో లేకుండా చేశాడు. 
 ఆ తండ్రి వృద్ధాప్యంలో ఒకనాటి అర్ధరాత్రి చనిపోయాడు. నిధి రహస్యం కుమారునికి చెప్పనేలేదు. కుమారుడు తండ్రి ఉత్తరక్రియలు జరిపించాడు. చేతిలో చిల్లిగవ్వలేదు గనుక అప్పులలో కాలం గడుపుతున్నాడు. చేసిన అప్పులు తీర్చకపోవటంతో వారు వత్తిడి చేస్తున్నారు. కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేకుండా పోయింది. దానితో భుక్తి కోసం యాచన చేస్తూ 'భవతీ భిక్షాం దేహి' అనే స్థితిలోకి వచ్చాడు. 
 ఒకనాడు తన తండ్రి మిత్రుడు తటస్థపడి ఇతడితో, "మీ నాన్న ఆస్తినంతా బంగారంగా మార్చి ఇంటిలో పాతి పెడతాను అన్నాడు. ఆ విషయం నీకు చెప్పలేదా" అన్నాడు. చెప్పలేదన్నాడు కుమారుడు. మీ ఇంట్లో త్రవ్వి చూద్దాం. ఒకవేళ బిందె దొరికితే నీ దరిద్రం అంతా తీరిపోతుంది. హాయిగా బ్రతకవచ్చు - అని, ఇంటికివచ్చి ఇద్దరూ త్రవ్వి చూచారు. మధ్య ఇంటిలోనే బిందె దొరికింది. దానితో అందరి అప్పులు తీర్చి, తనకు సహాయపడిన వారికి అవసర సమయాల్లో సహాయపడుతూ సుఖంగా జీవనం సాగించాడు. దరిద్రుడు కాస్తా కోటీశ్వరుడయ్యాడు. 
 అతడు కోటీశ్వరుడుగా మారలేదు. నిజంగా అతడు కోటీశ్వరుడే. కాకపోతే ఆ నిధి విషయం తెలియనంత వరకు దరిద్రుడుగా జీవించాడు, కష్టాలు అనుభవించాడు. నిధి విషయం తెలియటంతో దానిని త్రవ్వి తీసుకొని కోటీశ్వరుడయ్యాడు. కష్టాలు తీరినవి. ఆనందం కలిగింది. 
 అలాగే మనం కూడా ఆత్మఅనే నిధిని కలిగే ఉన్నాం. అయితే ఆ నిధిని తెలుసుకోలేక జడమైన దేహమే నేను అనుకొని, జీవుడిగా దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తున్నాం. ఇదే భ్రమ - సమ్మోహం. ఎప్పుడైతే ఆ తండ్రి మిత్రునిలాగ ఒక సద్గురువు మనకు లభించినప్పుడు, "నాయనా! నీవు జీవుడివి గాదు, ఆత్మస్వరూపుడివి; నీ హృదయంలోనే ఆత్మ అనే నిధి ఉన్నది." అని తెలియజెప్పి ఆ నిధిని అందుకొనే మార్గాన్ని తెలియజెప్పినప్పుడు, మన స్వరూపంలో మనం నిలిచిపోతాం. ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉండిపోతాం. దానితో సమస్తదుఃఖాల నుండి విముక్తికలిగి, పరమానందం లభిస్తుంది*.
 కోట్ల కొద్దీ నిధి ఉండి కూడా దరిద్రుడై, బిచ్చగాడై ఆకలితో అలమటించిన ఆ కోటీశ్వరుని పుత్రునిలాగా - మనం కూడా భగవంతుడనే నిధిని మన హృదయంలోనే పెట్టుకొని, తెలుసుకోలేక జీవుడిగా, హీనుడిగా, దరిద్రుడిగా, బిచ్చగాడిలా జీవిస్తున్నాం. కష్టాలతో,దుఃఖాలతో అలమటిస్తున్నాం. ఆ నిధిని తెలుసుకొని నేను జీవుణ్ణి అనే భ్రమను - సమ్మోహాన్ని తొలగించు కుంటే సమస్త దుఃఖాలు తొలగి బ్రహ్మానందంలో ఓలలాడుతాం.

No comments:

Post a Comment