అవసరమైనది అనుగ్రహమే భగవాన్ శ్రీరమణ మహర్షి అనుగ్రహమూర్తులు. ఆ అనుగ్రహం పరిపూర్ణం. కానీ భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నవారిలో, ఆయనను దర్శించడానికి వచ్చినవారిలో చాలా మంది ఆయన నిరంతర అనుగ్రహ ప్రవాహాన్ని అందుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. గంగానదీ జీవ ప్రవాహం లాంటి భగవాన్ అనుగ్రహాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే... అశరీరంగా ఆయన అందించే రహస్య మార్గదర్శకత్వాన్నీ, కొన్నిసార్లు బాహ్యమైన సాయాన్నీ గ్రహించలేనివారు... తమ హృదయాల్లో ఉన్న ఆ సద్గురువు సన్నిధిని ఉపేక్షించినవారు అవుతారు.
‘రమణుల సంభాషణలు’, ‘అనుదినము భగవాన్’ సంకలనాలను చదువుతున్నప్పుడు... ఆయన వద్దకు వచ్చిన భక్తులు, సాధకులు, జిజ్ఞాసువులు, ఇతరులు... కోరుకున్నదీ, ప్రార్థించినదీ భగవాన్ రమణుల అనుగ్రహాన్నే అని స్పష్టమవుతుంది. తన అనుగ్రహాన్ని ఏదో గదిలో ఉంచి, తాళం వెయ్యలేదని శ్రీ రమణులు చాలాసార్లు చెప్పారు. ఒక జీవనది దగ్గరకు చిన్న గ్లాసును తీసుకువెళ్ళి, ఇంకొకరు పెద్ద బిందెతో నీరు తీసుకుపోతున్నారని ఫిర్యాదు చేయడం సబబు కాదు కదా! అలాగే మహాత్ముల అనుగ్రహం సదా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అది అందరికీ సమానంగా, ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎవరు ఎంత అందుకోగలరు అనేది... గ్రహించేవారి మీద ఆధారపడి ఉంటుంది.
జిడ్డు కృష్ణమూర్తికీ, భగవాన్ రమణులకూ జరిగిన సంభాషణను మహేశ్‌భట్ అనే భక్తుడు గ్రంథస్తం చేశారు. ఆ సంభాషణ ప్రశ్నోత్తరాల రూపంలో సాగింది. ‘‘ముక్తి సిద్ధాంతం నిజంగా సత్యమేనా?’’ అని కృష్ణమూర్తి ప్రశ్నించగా, ‘‘అవును’’ అన్నారు భగవాన్. ‘‘దానిలో వివిధ దశలు ఉన్నాయా?’’ అనే ప్రశ్నకు... ‘‘లేవు. అదొక స్థితి. అంటే తన సహజ స్థితిలోనే నిలిచి ఉండడం’’ అని బదులిచ్చారు. ‘‘తమరు నన్ను విముక్తుణ్ణి చేయగలరా?’’ అని కృష్ణమూర్తి ప్రశ్నించగా, భగవాన్ మౌనం వహించారు. ‘‘కనీసం మీ అనుభవాలు వేటినైనా నాకు ఇవ్వగలరా?’’ అని చిరాకుగా అడిగారు కృష్ణమూర్తి. అప్పుడు భగవాన్ ఆయనవైపు తీక్షణంగా చూస్తూ... ‘‘అవును నేను ఇవ్వగలను. మరి నువ్వు తీసుకోగలవా?’’ అని ప్రశ్నించారు. ఆ సంభాషణే
కృష్ణమూర్తిని సత్యాన్వేషణవైపు పురికొల్పిన మొదటి సంఘటన. ఎవరైనా సాధకుడు భగవంతుడి శరణాగతి చెందడానికి సిద్ధమైనప్పటికీ, అతను ఏమేరకు శరణాగతి చెందాడనేదాన్ని బట్టి మాత్రమే జ్ఞాన సారాన్ని గ్రహించగలడు. ఈ విషయంలో ఎన్నో రకాల వాదాలు ఉన్నాయి. వాటిలో మార్జాల కిశోర న్యాయం ఒకటి. పిల్లి తన పిల్లలను తానే కరచి పట్టుకుపోతుంది. పిల్లలు వేచి ఉంటే చాలు. అయితే ఈ పద్దతిని భగవాన్ అంగీకరించలేదు. సాధకుడిలో అహంకారం మిగిలి ఉన్నప్పుడు, ‘‘నేనే కర్తను’’ అనే భావన ఉన్నప్పుడు... ఆధ్యాత్మిక సాధనలో అతను విజయం సాధించడం సద్గురు బాధ్యతే అంటే... అది ఎలా జరుగుతుంది? ఎవరికైతే వ్యక్తిత్వం, అహంకారం ఉన్నదో వారే ఆత్మ విచారణ చేయాలి, అన్వేషణ సాగించాలి. సత్యమైన తన సహజ స్వరూపాన్ని తెలుసుకోడానికి తీవ్రంగా తపించాలి. అలా తపించి, అన్వేషిస్తూ... సద్గురువు అనుగ్రహం మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆ అనుగ్రహం వల్లనే అన్వేషించాలనే తపన మొదలవుతుంది. ఆ అనుగ్రహం వల్లనే సాధనలో స్థిరంగా నిలుస్తారు. ప్రయత్నం అనేది తప్పదు. సాధన, అనుగ్రహం... ఒకదానిమీద ఒకటి ఆధారపడి నడుస్తాయి. ప్రయత్నం తాలూకు అంతిమ విజయం మాత్రం కేవలం సద్గురువు అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది. దాన్ని గ్రహించడం... సాధకుడి తపన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో విజయం... తీవ్రమైన సాధన ద్వారా మాత్రమే లభించదు. సద్గురువు అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని భగవాన్ రమణులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
(‘నిన్ను నీవు తెలుసుకో’ సంకలనం నుంచి)
No comments:
Post a Comment