Friday, November 4, 2022

 ['సమన్వయ సరస్వతి', 'వాగ్దేవి వరపుత్ర', 'ధార్మిక తపస్వి' - "బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం]

🌷మన కంటే గొప్ప కష్టాలు సీతవి, ధర్మరాజువి; ఐనా.....
🌷ఒక సమస్య కలిగినా, ఒక హోదా లభించినా మన సాంగత్యం ప్రభావం వాటిపై ఉంటుంది. మన చుట్టూ ఉండే వారి స్వభావాలు, మన కాలక్షేపాల లక్షణాలు మన ఆలోచనలను మలచుతాయి. ఆవేదననో, ఆనందాన్నో పెంచుతాయి. 

🌷ఒక దుఃఖం, అనుకోని ప్రతికూలఘటన ఎదురైనప్పుడు మనస్సు క్రుంగిపోవడం సహజం. అలాంటి తరుణంలో మనం చదివే పుస్తకం, వినే సంగీతం, చూసే దృశ్య కార్యక్రమాలు సరియైనవైతే మనస్సు ధైర్యాన్ని పొందుతుంది. విపరీత భావాలు కలుగకుండా నిలదొక్కుకోగలం.

🌷ధర్మాన్ని బోధించేవీ, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి, జీవిత సత్యాన్ని తాత్వికంగా ఎరుకపరచేవీ, ధీర గుణాన్ని ప్రోది చేసేవీ అయిన 'సాంగత్యాలు' ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. 

🌷ప్రపంచం బహు విస్తారం- జీవితం అనేకావకాశాలమయం. కానీ ఆ విస్తారమూ ఆ అవకాశాలూ మన బుద్ధి విశాలతను సంతరించుకున్నప్పుడే గోచరిస్తాయి. 

🌷ఒక్క చిన్న అవకాశం చేజారగానే దిగులు పడిపోయి, బ్రతుకంతా శూన్యమనుకొనే వారు ఎందరో! ఒక్క కష్టానుభవానికే చతికిలబడి 'ఇంకేముంది! అంతా అయిపోయింది' అనుకునే వారు ఎందరో!

🌷అలాంటి స్థితిలో ఆత్మహత్యలకి పాల్పడే వారెందరో! 

🌷అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక ఋషిగ్రంథాల వాక్యమో, గురూపదేశ నిర్దేశమో, వివేకానందుని వంటి మహావ్యక్తుల మాటలో, మహాత్ముల జీవిత ఘట్టాలో మన ఆలోచనల్లో ప్రవేశిస్తే కొత్త ఉత్తేజం, బలం సమకూరతాయి. కొండంత సమస్యనైనా దూదిపింజలా తీసుకోగలిగే దిటవు ఏర్పడుతుంది. 

🌷'కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్ఛతి ధీమతాం' 
 - కావ్యశాస్త్ర చర్చలే వినోదంగా బుద్ధిమంతులు కాలం గడుస్తుందంటుంది ఈ సుభాషితం.

🌷మంచి సాహిత్య సంగీతాలు ఒక మాధుర్యాన్ని, ఉపశమనాన్ని కలిగించడమే కాక, అంతరంగానికి నూత్న కోణాల ఆలోచనల్నీ, ఆశావాదాన్నీ, జీవిత ప్రయోజనాన్నీ ప్రబుద్ధం చేస్తాయి. 

🌷అలాంటి గ్రంథాలను, కళలను, ధార్మికోపదేశాలను నిరంతరం ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ, ఆచరణలో పది మందికీ పనికొచ్చేలా మసలుకొనేవాడు నిత్యోత్సాహి - చైతన్యశీలుడు. అలా ఆస్వాదించే పరిస్థితులనే 'సత్సంగం' అనాలి.

🌷అలా కాకుండా వ్యర్ధంగా కాలం గడుపుతూ, వ్యసనాలతో, ప్రతికూల భావం కలిగిన వారితో తిరిగేవాడు ప్రత్యంశాన్నీ ప్రతికూలంగానే చూస్తాడు. ఎవరినీ క్షమించలేడు, ఆదరించలేడు. సందేహాలతో జీవిస్తాడు. స్వార్ధం కోసమే చూస్తాడు. కేవలం ధనార్జనే లక్ష్యంగా ఉన్న వారంతా ఆ సత్సంగాన్నీ, జీవన మాధుర్యాన్ని కోల్పోతారు.

🌷రోజులో కొంతసేపైనా ఏ మంచి పుస్తకాన్నో వ్యక్తిత్వ నిర్మాణం చేసే వాటినో చదువుకోవాలి. ధర్మం కోసం స్వార్ధాన్ని త్యాగం చేయగలిగే వ్యక్తిత్వ వికాసాన్నిచ్చే సంప్రదాయ గ్రంథాలనే అధ్యయనం చేయాలి. 

🌷అలా వికసించిన వ్యక్తిత్వం ఎలాంటి సంఘటనాంశానైనా ఎదుర్కోగలిగే పటుత్వాన్నిస్తుంది. 

🌷గొప్ప వ్యక్తిత్వమున్న మహాత్ముల మాట విన్నా, వారితో మసలినా అవి కూడా మన ఆలోచనలపై, జీవిత దృక్పథంపై ప్రభావం చూపిస్తాయి. 

🌷అందుకే మనం సర్వకాల సర్వావస్థలలోనూ 
1. గొప్ప వ్యక్తిత్వాలతో,
 2. గొప్ప గ్రంథాలతో,
 3. గొప్ప ప్రసంగాలతో,
 4. సాత్విక కళలతో 'సత్సంగాన్ని' సాధిస్తూనే వుండాలి. 

🌷వనవాస సమయంలో మార్కండేయ, బృహదశ్వ, నారద, వ్యాసాది మహర్షుల సాంగత్యం లభించడం చేత ధర్మరాజు ధీరంగా, ధర్మబద్ధంగా దృఢంగా ఉండగలిగాడు, సత్కర్మానుష్ఠానంతో, సోమరితనం లేకుండా, ప్రతికూల ధోరణులు లేని విధంగా వ్యక్తిత్వాన్ని పదిలపరచుకున్నాడు. చివరగా విజయం ఆయన్నే వరించింది. ఇదే రీతి మన ధార్మికగాథలన్నిటిలో గోచరిస్తుంది. 

🌷అశోక వనంలో సీతమ్మ నిరాశకులోనై నిరాసక్తతలో మునిగినప్పుడు మహాసత్పురుషుడైన హనుమరాక, ఆయన మాటలలోని ధార్మికత, సత్యదర్శనం, తత్త్వవివేచన, ధైర్యం బలాన్నిచ్చాయి. ఓదార్పునిచ్చాయి. సమస్యనెదుర్కొనగలిగే స్థిమితాన్ని ప్రసాదించాయి. 

🌷'సత్సంగత్వేనిస్సంగత్వం' అనే మాట ఆధ్యాత్మిక వాణియే కాదు నిత్య జీవననాదం కూడా. 'సత్సంగాన్నే సమకూర్చుకోవాలి' అంటూ నారదుడు - 'తదేవ సాధ్యతామ్' అనే రెండు మార్లు నొక్కి చెప్పాడు. అంతేకాదు దుస్సంగాన్ని విడిచి పెట్టాలి అని స్ఫుటంగా బోధించాడు. 

🌷దుర్జన, దుర్విషలు, సాంగత్యాలు (దుస్సాంగత్యం) విడిచి పెట్టడం ప్రధాన సాధన. చెడును విడిచిపెడితే ఆ ప్రాంతంలో, ఆ కాలంలో - మరో మంచి విషయాన్ని వినడమో, చదవడమో, గ్రహించడమో చేయగలం. సత్సాంగత్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు, దుస్సాంగత్యాన్ని కూడా వదులుకోమని గీతాచార్యుడే గీతలో సెలవిచ్చాడు. 

🌷ఒక్కమంచి మాటతో మంచి బాటలోకి మలుపు తిరిగిన జీవితాలెన్నో! వాటిని గమనిస్తే జీవితం కంటే, గొప్ప అద్భుతం లేదని స్పష్టమౌతుంది!

🌼🌼🌼🦋🦋🌼🌼🌼
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment