🪔🪔అంతర్యామి🪔🪔
🌹కాలచక్రంలో జీవితాన్ని అలరించే రుతువుల్లో ఏకాంతం ఒక వసంతం. ఇతరులతో ప్రమేయంలేని ఒక స్వేచ్ఛాయుత కాల విభాగం. నిజానికది మనసు తోటకు పట్టిన పూల ఋతువు. ఎప్పుడూ ప్రపంచంవైపే చూస్తూ మనసుకు బూజు పట్టించుకునే దుర్గతినుంచి బూజు దులుపుకొని శుద్ధ
జలాలతో శుభ్రం చేసుకుని అలంకరించుకునే
ఆనందమయ అద్భుత కాలం.
🌹లోకాన్ని విమర్శనాత్మక దృష్టితో చూస్తూ చంచల దృక్పథంతో అశాంతిగా జీవించే మనిషి మనసుకు ప్రశాంత పవనాలు వీచే సమయం. సున్నిత సమీరాలు సోకే సమయం. ఏకాంతం 'ఏకాకితనం' కాదు. అందర్నీ తనలో కలుపుకొనే కలుపుగోలుతనం. అందరితో తాను కలిసిపోయే విడివడని కలివిడితనం.
🌹ఏకాత్మగా ఉంటూ ప్రతి ఆత్మనూ తనదిగానే భావించే సర్వమానవ సౌభ్రాతృత్వం. అది సర్వాత్మ ఏకీభావం. సర్వ జీవరాశినీ తన ఆత్మలో విలీనం చేసుకునే సర్వ జీవ స్నేహ సూత్రం. అది ప్రేమ సూత్రం!
🌹మన ఏకాంతం మన ఒక్కరిదే కాదు. దాన్ని భంగం చేసినవారిని విసుక్కుని, కసురుకుని బీభత్సం సృష్టించే అనాగరిక ప్రతిస్పందన కాదు. అదో శాంతి మంత్రం. మన చుట్టూ ఉన్నవారిని ఆ ఆరాలోకి ఆహ్వానించేది. మనల్ని సమీపించి ఉపశమించిన గాలికి సైతం ఏకాంతపు వాసనలను పులిమేది.
🌹 అవును... ఏకాంతం మనలోకి మనల్ని ఆహ్వానించేది. ఆసనం పరచి మనసును పద్మాసనం వేయించేది, ధ్యానావశిష్టం చేసేది, ఆందోళనలను ఉపశమింపజేసి ఆనందాన్ని పంచిపెట్టేది - ఏకాంతమే.
🌹ఏకాంతం అంటే మనం దాన్ని వెదుక్కుంటూ ఎక్కడికో వెళ్ళేది కాదు. ఏర్పాటు చేసుకునేది కాదు.. మనం అనుభూతి చెందేది. కోటిమందిలో ఉన్నా ఆ తిరుణాళ్లను మన 'మనసు దృష్టికోణం'లోకి రానివ్వనిది. వేలమంది మాట్లాడుతున్నా మనల్ని మాత్రం ఓంకార నాదంతో తాదాత్మ్యం చెందనిచ్చేది. ఏ ఏకాంతం అని పదేపదే అనుకుంటే ఏకాంతంలో ఉండిపోము. మనసులోకి ఏమీ రానివ్వని ఆత్మభావనే ఏకాంతం.
🌹నిజానికి ఆత్మభావన పొందడానికే మనకు ఏకాంతం కావాలి. అనుభూతిలోకి రావాలి. మనమేమిటో మనకు తెలియాలంటే ఏకాంతం కావాలి. అందులో తప్ప మన నిజస్వరూపం మనకర్ధం కాదు. ఆలోచనల, అలజడుల ఉద్ధృతం అంతం కాదు. మనకు మనం పరిశీలించుకునేందుకు, మనల్ని మనం ప్రశ్నించుకునేందుకు ఏకాంతం కావాలి.
🌹సాధనకు, స్వవిమర్శకు ఏకాంతంలో ఉండమంటారు. అప్పుడప్పుడూ ఏకాంతంలోకి వెళ్ళమంటారు. నిన్ను నీవులో నీకు అప్పగించుకొమ్మంటారు. ఎంత కాలం ఈ 'పరాధీన’తని తెలుసుకొమ్మంటారు. నీవు నీ | మనసులోకి వెళ్ళగలిగినప్పుడే నీవు స్వతంత్రుడివి. స్వేచ్ఛాజీవివి. వీటికి ఆ అవకాశం ఏకాంతం మాత్రమే ఇవ్వగలదు. ఆ ఏకాంతాన్ని నీవు మాత్రమే సృష్టించుకోగలవు. ప్రపంచంలో అతి సాన్నిహిత్యాన్ని పీడకలగా మరచిపోదాం.
🌹అతి అనుబంధాన్ని అనర్ధదాయకంగా తోసిరాజందాం. భగవంతుడికి సూటిబాట అయిన, రాచబాట అయిన ఏకాంతం తోడుగా- పరమపదానికి పయనమవుదాము. ఏ బాదరబందీ లేని ఏకాంతంలో ఉన్న నిన్నే భగవంతుడు ఇష్టపడతాడు!
- ✍️చక్కిలం విజయలక్ష్మి
No comments:
Post a Comment