రమణమహర్షి చెప్పిన సత్యం!!
【హృత్ స్థలే మనః స్వస్థతా క్రియా|
భక్తియోగ బోధాశ్చనిశ్చితం ॥
భావం: కర్మయోగమైనా, భక్తి యోగమైనా, రాజయోగమైనా, జ్ఞానయోగమైనా అన్నీకూడా మనస్సును శుద్ధం చేసి హృదయము నందు నిలుపుట కొరకే అనువిషయం నిశ్చయం. దీనికి తిరుగులేదు.】
అధ్యాత్మిక రంగంలో ఉన్న చాలామందికి తమ లక్ష్యం ఏమిటో తెలియదు. అలా లక్ష్యం తెలియకుండా, గమ్యస్థానం ఏదో తెలియకుండా ప్రయాణం చేసేవారు ఎంతకాలం ప్రయాణించినా ప్రయాణిస్తూ ఉండటమే తప్ప గమ్యస్థానాన్ని చేరి శాంతించటం ఉండదు. "తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కటం దిగటమే సరిపోయింది" అని సామెత. ఆధ్యాత్మిక సాధనలన్నీ ఎందుకోసం నిర్దేశించబడ్డాయో మహర్షి ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. మనస్సు హృదయంలో చేరి స్వస్థత పొందటమే కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గములన్నింటి యొక్క లక్ష్యము అని ఇక్కడ తెలియజేస్తున్నారు.
అంటే అన్ని ఆధ్యాత్మిక సాధనల యొక్క లక్ష్యం మనస్సు హృదయము నందు స్వస్థత చెందడమే.. ఇక్కడ హృదయము అంటే ప్రత్యగాత్మయే. అంటే జీవునియొక్క నిజ స్వరూపం. జీవుని నిజ స్వరూపమైన ప్రత్యగాత్మ పరమాత్మే. అక్కడ మనస్సు స్వస్థత చెందటమే లక్ష్యం. స్వస్థత అనే పదాన్ని చక్కగా అర్ధం చేసుకోవాలి. మనస్సు అనే ఒక కిరణం ఆత్మ నుండి వచ్చినది. ప్రపంచంలో విహరిస్తుంది. కష్టాలు, సుఖాలు అనుభవిస్తుంది. ఎంతకాలమైనా అంతే. ఎప్పుడైతే తనపుట్టిన చోటును, జన్మస్థలాన్ని తెలుసుకొని అటువైపుకు తిరిగి ప్రయాణించి ఆ చోటును (ఆత్మను) చేరి అందులో కలిసిపోతుందో ఇకదాని కష్టాలు, బాధలు అన్నీ అంతం, పరమశాంతి.
అన్ని నదుల యొక్క పరిస్థితి కూడా ఇంతే. నదుల యొక్క జన్మస్థానం సముద్రం. సముద్ర జలం ఆవిరై మేఘాలుగా మారి, చల్లబడి వర్షాన్నిస్తే, ఆ జలం వాగులుగా వంకలుగా మారి, నదులను చేరి ఎన్నో వంపులు తిరుగుతూ ప్రయాణించి, ప్రయాణించి చివరకు సముద్రాన్ని చేరి, అందులో కలిసిపోయి, సముద్రాకారంగా మారిపోతాయి. దానితో పరుగులు అంతం. ప్రశాంతి.
ఉప్పుగల్లు సముద్రం నుండే వస్తుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంది. రోళ్ళల్లో వేసి రోకళ్ళు దంచుతుంటే ఎగిరెగిరి పడుతుంది. ఎన్నోకష్టాలు పడి చివరకు తనజన్మస్థానమైన నీటిని చేరితే శాంతి. ప్రశాంతి. అలాగే మనస్సు ఆత్మనుండి బయటకెళ్లి ప్రపంచమంతా తిరిగి ప్రాపంచిక వాసనలతో, ఆలోచనలతో, కర్మలతో అనేక దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు చెంది, చివరకు ఆత్మవైపుకు ప్రయాణించి ఆత్మలో కలిసి పోయి, ఆత్మాకారంగా మారితే ప్రశాంతి. ఆనందం.
కనుక హృదయం (ఆత్మ) నుండి కదిలిన మనస్సు ఎంతకాలం ప్రపంచంలో తిరిగినా చివరకు హృదయాన్ని చేరి అందులో నిలిచిపోవాలి. మనస్సు బహిర్ముఖమైతే దుఃఖం. అంతర్ముఖమైతే ఆనందం. ఇలా మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు ప్రయాణింపచేసి ఆత్మలో నిలిపి వేయటానికే అన్ని సాధనలు, అన్ని మార్గాలు, అన్ని యోగాలు.
కాబట్టి మనిషి సాధన అనేది మనసును అంతర్ముఖంగా తీసుకెళ్లాలి. అప్పుడే చేస్తున్న ఆధ్యాత్మిక సాధనకు పలితం ఉంటుంది. అలా కాకుండా ఆధ్యాత్మికత పేరుతో ఏదేదో అవలంభిస్తే ఎన్నటికీ ఆ ఆధ్యాత్మిక సంపూర్ణ పలితాన్ని సరైన విధంగా పొందలేరు.
అంతరంగం లోకి ప్రవేశించ గల మార్గం, అంతరాత్మ సందేశాలు వినే మార్గం, ఆత్మ శక్తి పొందే విధానం ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
సేకరణ
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616
No comments:
Post a Comment