🌹🌹 *"నిన్ను నీవు తెలుసుకో"* 🌹🌹
🪷🌹🪷🌹🪷🌹🪷
🪷💖🕉️💖🪷
🪷💖🪷
🪷
*"నువ్వు ఎవరివి?*
*నువ్వు నీ శరీరానివా?*
*లేక మనసు వా?*
*అంతకన్నా ఉత్తమమైనదా?"*
*"నువ్వు ఎవరో నీకు తెలుసా? లేకపోతే ఊరికే తెలుసు అనుకుంటున్నావా?తెలుసుకోవడం అంత అవసరమా...."*
*"చాలా చాలా అవసరం. లేకపోతే మానవ జన్మే వృధా అవుతుంది. భౌతికవాద సమాజం, ఉన్నతమైన మన ఆత్మ గురించి అన్వేషించడం దోషంగా భావిస్తుంది.* *అందుచేత అందరూ ఆత్మను మరచి శరీరాన్ని పోషించుకోవడానికి, సమాజంలో గుర్తింపు పొందడానికి తాపత్రయ పడిపోతున్నారు."*
*"ఆధ్యాత్మికత మృత్యువు నుంచి మానవ సమాజాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. "*
*"కొందరు మానవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మన ఆత్మను మనము సందర్శించడం లేదా భగవంతునితో మనం కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి నెలకొల్పు కోవడము మానవ జీవిత పరమార్థమని మర్చిపోయారు. అందుకే మనం ఆ విషయాన్ని తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం మానవులే కాక సమస్త జీవరాశులూ భగవంతుడు లోని అంశలే అని భగవద్గీత మనకు తెలియజేస్తుంది."*
*"మన అవయవాలన్నీ మన అవసరాలకు అనుగుణంగా మనకు ఉపయోగపడు తున్నట్లు గానే మన మందరము ఆయన లోని అంశాలను కనుక ఆయనను సేవించడమే మన కర్తవ్యం. వాస్తవ పరిస్థితి ఏమిటంటే- మానవులు ఎప్పుడు ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉంటారు. కుటుంబానికో దేశానికో,"*
*"సమాజానికో ఎవరూ దొరక్కపోతే కుక్కలు పల్లులు పెంచుకుంటారు.శక్తివంచన లేకుండా సేవను వృధా చేయటం కంటే ఆ పరమాత్ముడి సేవ చేసినట్లయితే, భౌతికంగా మనకు ఏ లోటు రాదన్న విషయం విస్మరిస్తున్నారు. దీనికి కారణం మనం, మన సేవలకు సరైన లక్ష్యాన్ని ఎంచుకోకపోవడమే."*
*"ఉదాహరణకి చెట్టుకు సేవ చేయాలంటే దాన్ని వేర్లకు నీరు పెట్టాలి అంతేకాని ఆకులను కొమ్మలను నీళ్లతో కడిగితే లాభం ఏముంటుంది."*
*"భగవంతుని సేవించినట్లైతే ఆయన లోని అంశాలు అన్నీ వాటంతట అవే సంతుష్టి చెందుతాయి. భగవంతునితో మనకుగల అసలైన సంబంధాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా నడుచుకోవడం మానవుని కర్తవ్యం."*
*"భగవంతునికి ఎదురుతిరిగి దేవుడు లేడని, దేవుడంటే నాకేం భయం లేదు, దేవుని నేను లెక్క చేయను. ఇలాంటి వాదనలు కూడా వింటూనే ఉంటాం. ప్రత్యామ్నాయంగా భయంకరమైన రోగాలు, భయాలు ఆందోళనలు, మనశ్శాంతి లేని జీవితాలు, క్రూరమైన మృత్యు రూపంలో మన ముందు నిలుస్తాయి."*
*"ఒక రూపంలో ఆయనను చూడడానికి మనం నిరాకరిస్తే, మరొక రూపంలో ఆయన మన ముందు ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే మొత్తం జగత్తు అభివ్యక్తికి ఆయన మూల కారణం.ఆయనను తప్పించు కోవడం మన తరం కాదు. ఆధ్యాత్మికం దేవదేవుడైన భగవంతునితో మనకు గల సంబంధం దృష్ట్యా మన నిత్య అవసరాన్ని తీర్చే ఒకప్రామాణిక మైన శాస్త్రీయమైన మార్గం."*
*"భగవంతునితో మనకు గల శాశ్విత సంబంధాన్ని, ఆయన పట్ల మనము నెరవేర్చవలసిన విధులను మనకు గుర్తు చేస్తుంది. మానవ జన్మలో మనం పరిపూర్ణతను సాధించేందుకు తోడ్పడుతుంది."*
*"(ఇంకా ఉంది)"*
🌹🌹 *"నిన్ను నీవు తెలుసుకో- 2"* 🌹
🪷🌹🪷🌹🪷🌹🪷
🪷💖🕉️💖🪷
🪷💖🪷
🪷
*"మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మన ఆత్మకు ఈ మానవ జన్మ లభించడానికి జనన మరణ చక్రంలో అనేక లక్షల సంవత్సరాల పరిణామం జరిగిందనే విషయం."*
*"మానవుడికి సమస్యలను పరిష్కరించుకోవడం ఇతర జీవుల కంటే ఎక్కువగా సాధ్యమవుతుంది. ఇతర జీవుల అవసరాలన్నీ ప్రాకృతిక పద్ధతిలో పరిష్కార మవుతాయి. కానీ మనిషికి ఆర్థిక రూపంలో పరిష్కృతం అవుతున్నాయి. మానవుని సుఖజీవనానికి ప్రకృతి నియమాలు అన్ని సౌకర్యాలను కల్పించాయి."*
*"మానవుడు ఇతర జీవులకన్నా బాగా బ్రతికే అవకాశం ఎలాపొందగలిగాడు? ఉన్నత పదవిలో నియమితుడైన అధికారికి మామూలు గుమస్తాల కంటే సుఖమైన జీవితం గడిపే సౌకర్యాలు ఎందుకు కల్పిస్తారు? ఎక్కువ బాధ్యతాయుతమైన విధులు నిర్వహించవలసి ఉంటుంది కనుక. అదేవిధంగా మానవుడు కూడా నిరంతరం తన ఆకలి తీర్చుకునే ప్రయత్నం లో నిమగ్నమై ఉంటే, ఉత్తమ కర్తవ్యాలు నెరవేర్చవలసిన సమయము ఉండదు కనుక. అయితే ప్రస్తుతం మానవుడు తన కర్తవ్యాలు ఏమిటో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అనాగరిక మానవుడే కాదు, ఆధునికులు కూడా స్వార్థపూరితమైన కార్యక్రమాల్లోనే నిమగ్నమై జీవిస్తున్నారు, నరరూప పశువుల దగ్గరికి ఆధ్యాత్మిక తెలియ చేయడానికి వెళ్ళినప్పుడు, భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని, మీరు సమయం వృధా చేస్తున్నారని మాతో అన్నారు.ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి వారి మనసులు సహకరించడం లేదు పరమాత్ముని గ్రహించవలసిన అవసరం లేదంటున్నారు."*
*"జీవితంలో పరిపూర్ణతను సాధించడం కోసం మానవ జన్మ ఎత్తాము. అలాంటి పరిపూర్ణతను మనం కోరుకోకపోతే ప్రకృతి నియమాలు మనలను నానా యాతనలు పాలు అయ్యేటట్లు చేస్తాయి.మనసా వాచా చేసే కర్మలకు కూడా ప్రతిఫలం అనుభవించక తప్పదు. జీవాత్మ ప్రకృతి నియమాలను అనుసరించి తనకు తగిన దేహాన్ని ఇంద్రియాలను పొంది పునర్జన్మ ఎత్తి భౌతిక జగత్తు లోని సుఖాలు అనుభవించ గలదని భగవద్గీత విస్పష్టంగా చెబుతుంది. భగవంతుని చేరుకునే మార్గంలో సంపూర్ణ ప్రగతిని సాధించని వారు, విఫలమైన వారు మరలా తిరిగి జన్మిస్తారు. ఉత్తమమైన పునర్జన్మ కోసం ప్రస్తుతం మన పరిస్థితిని గ్రహించాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి."*
*"పూర్వజన్మలో తమ సాధన ఎక్కడ నిలిపివేశారో, మరుజన్మలో అచట నుండి ప్రారంభించి కైవల్య దిశగా ప్రయాణిస్తారు. దురదృష్ట వశాత్తు మాయా వశులైన వారు వీటన్నింటిని గ్రహించ లేకున్నారు. అట్టి కుటుంబాలలో జన్మించినవారు భగవద్గీతను పఠించుట లేదు. పూర్వ జన్మ సుకృతం వలన సంపన్న కుటుంబంలో పుట్టుట చేత, ఆహారం కోసం శ్రమ పడవలసిన అవసరం ఉండదు. ఏ ఆర్థిక అవసరాలైన ఇట్టే తీసుకోగలరు. కానీ తాము ఎందుకు జన్మించారో గ్రహించ లేకపోవడము వలన సుఖమయ జీవితానికి అలవాటు పడి, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశమును మరచి ఒక జీవిత కాలాన్ని వృధా చేస్తున్నారు. దురదృష్టవశాత్తు యాంత్రిక జీవనాన్ని గడుపుతూ, సంపన్నుల సంతానం ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షించబడి, ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి తమకు గల అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు. తత్ఫలితంగా ప్రకృతి తన శాసనాలతో బంగారు లోగిళ్ళలో చిచ్చు పెడుతుంది. సువర్ణ నగరమైన లంక భస్మము అయినట్లు."*
*"జీవితంలోని ఆర్థిక సమస్యలను అస్థిరమైన వేదికమీద పరిష్కరించుకోవడం కాదు మన కర్తవ్యం. ప్రకృతి శాసనాలను అనుసరించే మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం మన కర్తవ్యం. ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే నాగరికత స్థబ్ధం అవుతుంది.ఆత్మ దేహాన్ని కదిలిస్తుంది. ప్రాణం తో కూడిన దేహం ప్రపంచాన్ని కదిలిస్తుంది. అయితే మనము దేహం గురించి ఆలోచిస్తున్నాము. ఆ దేహాన్ని కదిలించే ఆత్మను గురించిన జ్ఞానం మనకు లేదు. ఆత్మ లేకపోతే దేహం మృత ప్రాయం. అమర జీవితాన్ని పొందడానికి మానవదేహం అత్యద్భుతమైన సాధనం. ఐహిక జీవితం అనే అజ్ఞాన సాగరాన్ని దాటడానికి అది ఒక అరుదైన మిక్కిలి ప్రధానమైన నౌక. ఆ నౌక మీద ఆధ్యాత్మిక గురువు అనే ఆరితేరిన కళాసు మనకు దారి చూపిస్తాడు. భగవంతుని కృప వలన అనుకూల వాతావరణంలో నౌక ముందుకు పయనిస్తుంది. పరిస్థితులన్నీ శుభప్రధంగా ఉండగా అజ్ఞాన సాగరాన్ని దాటే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? సదవకాశాన్ని వదులుకునే వారిని ఎలాంటి వారిని గ్రహించవలసి ఉంటుంది."*
*"ఒక రైలు పెట్టెలో సుఖ ప్రయాణము చేయు అనేక సౌకర్యములు ఉన్నా, ఆ రైలు మన గమ్యం చేరకపోతే ఉపయోగమేమిటి?"*
*"ప్రస్తుత నాగరికత మన భౌతిక దేహాన్ని సుఖవంతం చేయడంలోనే నిమగ్నం అవుతుంది. కానీ మన అసలైన గమ్యమైన పరమాత్ముని పరమపదాన్ని చేరుకోవడానికి ఉపయోగ పడడం లేదు. ఆలోచించాలి బాగా ఆలోచించాలి... లేకుంటే మన గమ్యం అగమ్యగోచరం."*
*"(ఇంకా ఉంది)"*
🌹 *"నిన్ను నీవు తెలుసుకో- 3"* 🌹
🪷🌹🪷🌹🪷🌹🪷
🪷💖🕉️💖🪷
🪷💖🪷
🪷
*"మనము జన్మించిన కారణము, జీవిత అవశ్యకత, కోల్పోయిన ఆధ్యాత్మిక స్థితిని తిరిగి పొందాలి అనే అంశాలను మర్చిపోయి దేహానికి సర్వ రోగాలు సమకూర్చుకోవడం వలన నిజమైన పరమార్ధాన్ని మనం సాధించలేము.మానవ జీవితం అనే నౌక ఆధ్యాత్మిక జీవిత గమ్యం వైపు పయనించడానికి వీలుగా నిర్మించబడింది. అయితే దురదృష్టవశాత్తు మన శరీరం ఈ క్రింది ఐదు బలమైన గొలుసులతో ఐహిక చైతన్యంతో బంధింపబడి ఉంది. అవి ఏమిటంటే.."*
*"1. ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం లేకుండా మన భౌతిక దేహానికి మనం అంటిపెట్టుకుని ఉండడం."*
*"2 .శరీర సంబంధాలు అనగా బంధువులతో అనుబంధం పెంచుకోవడం."*
*"3.జన్మభూమి, సంపదలు, ఐశ్వర్యము ఇళ్లు, వాకిళ్లు మొదలైన వాటి పైన మమకారం పెంచుకోవడం."*
*"4. ఆధ్యాత్మిక ప్రకాశం లోపించడం వల్ల భౌతిక శాస్త్రాల మీద, పదవుల మీద విశ్వాసాన్ని పెంచుకోవటం."*
*"5. పరమాత్ముని, ఆయన నిజ భక్తులను గుర్తించలేక ఆచార వ్యవహారాలు పాటిస్తూ దొంగ స్వామీజీల వైపు మొగ్గు చూపడం."*
*"మానవ దేహాన్ని బంధించే బంధనాలను గూర్చి భగవద్గీత లోని 15 వ అధ్యాయం లో బాగా వివరించబడింది."*
*"గీతాకారుడు ఏమన్నాడంటే దృఢంగా భూమిలోకి ఊడలు నాటుకున్న వటవృక్షం తో పోల్చాడు. అలాంటి బలమైన వృక్షాన్ని పెకలించడం మిక్కిలి కష్టము. కానీ భగవానుడు దానిని ఛేదించడానికి ఈ క్రింది సూచనలు ఇచ్చాడు."*
*"ఈ వృక్షం యొక్క పూర్తి స్వరూపం జగత్తులో కనిపించదు. అది ఎక్కడ ఆరంభమవుతుందో, ఎక్కడ అంతమవుతుందో దాన్ని తల్లివేరు ఎక్కడో ఎవరికీ తెలియదు. అయితే దృఢ సంకల్పంతో, వైరాగ్యమను శాస్త్రంతో ఈ వృక్షాన్ని ఛేదించాలి. అలా ఛేదిస్తూ మనము మరలా ఈ జగత్తుకు తిరిగి రాకుండా ఎక్కడికి చేరాలో ఆ పరమ పదాన్ని అన్వేషించాలి. ఇక్కడ మనము ఈ సృష్టికి కారణ భూతుడైన ఆ పరమాత్మకు మనం ఆత్మార్పణ చేసుకోవాలి."*
*"ఆధునిక శాస్త్రవేత్తలు కానీ, తర్కం ఆధారంగా తత్వాన్వేషణ చేసే దార్శనికులు గాని ఈ విశ్వాన్ని గురించి ఎట్టి నిర్ణయాలకు రాలేకపోతున్నారు."*
*"అందుచేత వారు వేరు వేరు వాదాలను ప్రతిపాదిస్తున్నారు. ప్రతి సిద్ధాంతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కానీ, తార్కికుడు కానీ ,దార్శనికుడు కానీ ఈ విశ్వం గురించి, దీని పరిధుల గురించి తేల్చి చెప్ప లేకపోయారు. ఈ విశ్వం ఎప్పుడు ప్రారంభమైందో ఆకాశంలో ఎలా తేలుతుందో ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు.పరమార్థం తెలియక ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రతిపాదనను చేసి, పేరు గడించడం చేస్తున్నారు."*
*"వీటివలన మానవుల దుఃఖాన్ని ఎవరు పోగొట్టలేరు. ఈ సృష్టిని గూర్చి సర్వ విషయాలు ఎరిగిన వాడు ఆ దేవ దేవుడు మాత్రమే. కనుక సర్వ భౌతిక విషయాల నుండి, భవబంధాలు నుండి మనం విడుదల పొంది ఆ పరమాత్ముని చేరాలి. మన జీవితాన్ని మనం నూటికి నూరుపాళ్ళు ఆధ్యాత్మిీకరించు కోవాలి.ఇనుము నిప్పు కాదు."*
*"కానీ నిప్పుతో నిరంతర సాహచర్యం వలన అది నిప్పుగా పరిణమించవచ్చు. అలానే భౌతిక కార్యకలాపాల నుండి విడుదల పొందాలి అంటే ఆధ్యాత్మిక కార్య కలాపాల్లో నిమగ్నం కావడం వల్లనే మనం సాధించగలము. భౌతిక జడత్వం వలన పారమార్థికత సాధించలేము. పరతత్వం అయిన పరబ్రహ్మ యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం లోనే మనం అమర జీవితాన్ని అన్వేషించు కోవాలి. అప్పుడే మన అసలైన జీవితం ప్రారంభం అవుతుంది."*
*(ఇంకా ఉంది)*
🌹 *"నిన్ను నీవు తెలుసుకో- 4"* 🌹
🪷🌹🪷🌹🪷🌹🪷
🪷💖🕉️💖🪷
🪷💖🪷
🪷
*"మనము ప్రస్తుతము జీవిస్తున్న జగత్తులో ప్రారంభాన్ని గుర్తించలేము. ఏ విధంగా మనం బద్ద జీవులము అయ్యామో ఆ సంగతి మనం తెలుసుకో నవసరం లేదు. ఏదో ఒక విధంగా భౌతిక బధ్ద జీవితం ఆరంభమైందని, అనాది కాలంగా ఇది కొనసాగుతోందని తెలుసుకోవడంతో మనం సంతృప్తి పడాలి. తిరిగి పరమాత్మను చేరుకోవాలి. అలా దేవదేవుని చేరుకొనుటకు భగవద్గీత 15:5 లో ఇలా చెప్పబడింది - " మాయ నుండి, దురహంకారం నుండి దుస్సాంగత్యం నుండి విముక్తి పొంది ఎవరు అమృతత్వాన్ని తెలుసుకుంటారో, ఎవరు కామాన్ని జయించి సుఖదుఃఖాది ద్వందాల నుండి విముక్తి సాధిస్తారో పరమాత్ముని చేరుకునే నేర్పు ఎవరికి ఉంటుందో అట్టివారే పరంపదం చేరుకుంటారు."*
*"ఎవరు తమ ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించి, భౌతిక భావన నుండి విముక్తి పొందుతారో, ఎవరు మాయ నుండి విముక్తులై మూడు ప్రకృతి గుణాలకు అతీతులుగా ఉంటారో నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానం ఇంద్రియ భోగాల పట్ల పూర్తిగా విరక్తి వహిస్తారు అట్టి వారు తిరిగి దేవదేవుని చేరుకుంటారు.పరమపదము ఎలా ఉంటుంది?*
*భగవద్గీత 15:6 - " ఆ నా పరమధామము లో సూర్యుడు కాని, చంద్రుడు కాని, విద్యుత్తు కానీ ప్రకాశించడం జరగదు. ఆ ధామం చేరుకున్న వారె వరూ ఈ భౌతిక జగత్తుకు తిరిగిరారు."*
*"భగవంతుడే సర్వసృష్టికి అధిపతి కనుక, ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరూ, ప్రదేశాలు పరమపదములోని భాగాలే. ఆ పరమాత్ముడు నివసించే లోకం ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఈ జగత్తుకు కంటే అది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ విషయంలో భూలోకం ఒక్కటే కాక, అనేక ఇతర లోకాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఊర్ధ్వలోకాలు, కొన్ని అధోలోకాలు . బాహ్య శక్తి ఆధీనంలో ఉండే లోకాల అన్నింటికీ సూర్యకిరణాలు, అగ్ని, వెలుతురూ అవసరం.*
*ఇవన్నీ కూడా పరిమితులు ఉన్నాయి. బ్రహ్మ సంహిత లో కూడా ఇవి ధృవీకరించబడిన ఉన్నాయి. రోదసి యానాల వల్ల పరంపదం చేసుకోగలమని భావింప రాదు. అయితే కృష్ణుడు వసించే ఆ పరమపదము చేరుకుంటే నిరంతరాయంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవించగలం అనే మాటమాత్రం నిశ్చయం."*
*"దోష సహితులైన మనకు అస్తిత్వంలో 2 దశలు ఉన్నాయి. ఒకటి - జనన మరణ జరా వ్యాధి భౌతిక అస్తిత్వం. రెండవది - సత్ చిత్ ఆనందంతో కూడిన ఆధ్యాత్మిక అస్తిత్వం . భౌతిక అస్తిత్వం లో దేహము మనస్సు మొదలైన భౌతిక భావనలు మనలనుస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక తత్వం లో నిరంతరం దేవదేవుని సాన్నిధ్యం వల్ల కలిగే దివ్య ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక అస్తిత్వంలలో భగవంతునికి మనకు ఎన్నటికీ ఎడబాటు ఉండదు."*
*"(అయిపోయింది)"*
🪷🌹🪷🌹🪷
🪷🕉️🪷
No comments:
Post a Comment