[4/24, 07:00] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 26🌹
👌హృదయ స్పందనే తొలి దైవానుగ్రహం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
🌈 26. హృదయ స్పందనే తొలి దైవానుగహ్రం 🌹
✳️ మనం *‘నాశరీరం, నాగుండె, నా చేతులు, నామనస్సు'* అంటూ ఉంటాం. కానీ మనలో నుండి ‘నా’ అంటున్నది ఎవరో ఎప్పుడూ ఆలోచన చేయడంలేదు. గడియారంలో సెకన్లముల్లు టిక్ టిక్ మంటూ తిరుగుతుంది. గడియారం ఆడుతుంది అనటానికి అదే గుర్తు. గడియారంలోని పెద్దముల్లు, చిన్నముల్లు తిరగాలంటే సెకన్లముల్లు తిరుగుతుండాలి. మరి ఆ సెకన్లముల్లును తిప్పేది ఎవరు? మనం గడియారంలో అమర్చే బ్యాటరీశక్తి ఆ సెకన్లముల్లును తిప్పుతుంది. మన దేహంలో కూడా అలాంటి సెకన్లముల్లు ఒకటి ఉంది. అదే మన గుండె. అది 'లబ్‌డబ్' అని నిరంతరం కొట్టుకుంటేనే మనం జీవించి ఉంటాం. అది ఆగిన రోజు ఈ దేహాన్ని శవం అంటారు.
✳️ సెకన్ల ముల్లుకి బ్యాటరీ నుండి శక్తి అందినట్లుగానే ఈ గుండెకు శక్తి ఎవరు అందిస్తున్నారు? ఈ శక్తి అందించేవాడే దైవం. రూపంలేని చైతన్యం ఒకటి మనలో ఉంది. దానికి ఉనికి మాత్రమే ఉంది. అది నిరంతరాయంగా గుండెను ఆడించి మనని బ్రతికిస్తుంది. గుండె కొట్టుకుంటేనే మనలో శ్వాస, రక్తశుద్ధి, అన్నం తినటం, నీరు త్రాగడం వంటి జీవనక్రియ జరుగుతుంది. ఆ చైతన్య స్రవంతి ఒక్కక్షణం ఆగినా నీ దేహం ఇవేవీ చేయలేదు. గాలి, నీరు, ఆహారం శరీరాన్ని పోషిస్తున్నాయి. ఆ పనులు జరగాలంటే ముందు నీలో చైతన్యం ఉండాలి. భగవంతుడు నిరంతరం చైతన్య స్వరూపుడిగా మనలో ఉండి ఈ జీవితాన్ని వరంగా ఇస్తున్నాడు. కానీ మనం ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నాం. పైగా ఆ కోర్కెల కోసమే విలువైన భక్తిని వాడుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే దేవుడిని ప్రార్థించాలి. ఆధ్యాత్మిక సాధనలో మనకు ఆ సంస్కారం రావాలి. జీవితాన్ని ఇచ్చిన దైవంపై కృతజ్ఞతతో మనలో భక్తిభావం కలగాలి. ఇచ్చింది చాలక ఇంకా ఏదో కావాలన్న వెంపర్లాటకు భక్తి అని పేరు పెట్టుకోకూడదు.
✳️ ఈ లోకాన్ని పోషించే దైవం ఫలానా రూపంలోనే ఉంటాడని కొందరు అంటూ ఉంటారు. అది కేవలం సంకుచితత్వం మాత్రమే. నీకు నచ్చిన రూపంలో దేవుడ్ని చూసుకోవచ్చు. కానీ ఆ రూపం మాత్రమే దేవుడి రూపమని చెప్పటం అజ్ఞానం. మేము పూజించే దేవుడు మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తాడని చెప్పేవారిని సూటిగా ఒక్క ప్రశ్న అడగాలి. రెండు నిముషాలు వాళ్ళు ముక్కు మూసుకుని కూర్చుంటే వారు చెప్పే దైవం వచ్చి రక్షిస్తాడేమో అడగాలి. దైవం అంటే ఏమిటో మనకు తెలియకముందే శ్వాసించే గాలిగా, దాహంతీర్చే నీటిగా, ఆకలితీర్చే ఆహారంగా, మన జీవనానికి అవసరమైన అన్నిటిగా ఆయనే సిద్దంగా ఉన్నారు. ఈ ప్రాణికోటిని పోషించడంలో దైవానికి ఏ బేధాలు లేవు. అలాంటి దైవాన్ని మన విశ్వాసం కోసం రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. కానీ దైవాన్ని కూడా పేర్లు, రూపాలతో విడగొట్టి వైషమ్యాలు పెంచడం ఆధ్యాత్మికత కానేకాదు.
✳️ నాస్తికుడిలో కూడా దైవమే ఉన్నాడు. ఆ విశ్వాసం ఉన్నవాడే నిజమైన ఆస్తికుడు. మనం ఏ రూపంలోనైనా దైవాన్ని పూజించవచ్చు. కానీ ఆ రూపం కన్నా ముందే దైవం మనలో ఉంది. ప్రాణరూపంలో అన్ని జీవరాసుల్లోనూ సమానంగా ఆ దైవం ఉందని తెలుసుకొని పూజించాలి. దైవమే మనకోసం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలుగా ఏర్పడ్డాడని తెలుసుకోవాలి. అప్పుడే వాటి ఎడల మనకు పూజ్య భావం ఏర్పడుతుంది. మన మహర్షులు చెప్పిన ఆదర్శ మార్గం అది. ఎవరో మిడిమిడి జ్ఞానంతో దీన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి వాళ్ళు చెప్పారని మహానుభావులు సూచించిన మార్గాన్ని మార్చుకోవడం నేటి సమాజంలో పెరుగుతున్న అజ్ఞానం.
✳️ మనలోని చైతన్యం మనని కదిలిస్తుంది. కనుకనే దానికి కాళ్ళు ఉన్నాయని ఊహిస్తున్నాం. మనతో అది పనులు చేయిస్తుంది. కనుక ఆ చైతన్యానికి కూడా చేతులు ఉన్నాయని భావిస్తున్నాం. అందుకే దైవానికి ఒక రూపాన్ని ఆపాదించకుండా ఉండలేకపోతున్నాం. దైవాన్ని ఎన్ని రూపాలతో కొలిచినా ఆ దైవానికి మొదటి ప్రతిరూపానివి నీవే. నీ జీవితమే భగవంతుని ఉనికి, కేవలం జీవించి ఉన్నందుకే ఆ దైవానికి నమస్కారం చేయడం నిజమైన భక్తి. దైవాన్ని బయట వెదికే ఆస్తికుడు దైవాన్ని చూడలేని నాస్తికుడితో సమానం. ఎందుకంటే నాస్తికులు వస్తువులను చూసినట్లు దేవుడిని కూడా తాము కళ్ళతో చూస్తేనే నమ్ముతామని వితండవాదం చేస్తారు. బాహ్యంగా కళ్ళకు కనిపించడు కనుక దేవుడు లేడని అంటారు. దైవాన్ని బయట దర్శించాలనుకునే ఆస్తికుడి పరిస్థితి కూడా అంతే. తాను దైవాన్ని బయట చూడలేడు. క్షణకాలం చూసినా అది ఇతరులకు చూపలేడు. కనుక ఆ ఇద్దరూ సమానమే.
✳️ మనలో ఉన్న చైతన్య స్రవంతిని మనం మరిచిపోతున్నాం. దానితో పనిచేసే ఈ శరీరాన్ని, మనసును పట్టుకుని వ్రేలాడుతున్నాం. మన గుండె కొట్టుకోవడం మనకి తెలుస్తుంది. ఆ గుండెను కొట్టించే చైతన్యం తెలియడం లేదు. దాన్ని తెలుసుకోడానికే మన సాధనంతా. మన గుండెను నడిపించే నిరంతర శక్తి ప్రవాహమే మనసుగా వ్యక్తం అవుతుంది. కాకపోతే అది ప్రస్తుతం ఆలోచనలతో కలుషితంగా ఉంది. శ్రద్ధతో చేసే దైవనామస్మరణ, మంత్రజపం మనసును పరిశుద్ధం చేస్తాయి.
[4/24, 07:00] +91 73963 92086: రూపంలేని చైతన్యం యొక్క ఉనికిని మనకి తెలియజేస్తాయి. చైతన్యాన్ని చూడలేము కనుక దాన్ని శుద్ద మనసుతో అనుభవించడమే సాధ్యం. ఏ నామం (మంత్రం) అయినా మనసును దాని మూలస్థానమైన చైతన్యం వద్దకు తీసుకువెళ్ళేందుకే. మన గుండెను నడిపే ఆ చైతన్యశక్తికే గ్రహింపు, స్పందన, ప్రేరణ, ఆలోచన, తెలివితేటలు అలవడ్డాయి. వాటికి ఉనికిగా ఉన్న చైతన్యాన్ని మరిచి ఈ లక్షణాలే మనం అనుకుంటున్నాం.
✳️ దైవం ప్రాణంగా ఇప్పటికే మనలో ఉంది. ఆ సత్యాన్ని గ్రహిస్తే శాంతి, సౌఖ్యం కోసం వేరే వెంపర్లాటలు ఉండవు. పక్క వాడితో పోల్చుకుని అలంకరణలు, ఆర్భాటాల కోసం పరుగులు పెడుతూ ఉంటాం. అదే నీలో భేదాన్ని, బాధను పెంచుతుంది. ఈ సృష్టిలోని ప్రతిప్రాణి అవసరాన్ని తీర్చే బాధ్యత దైవం వహిస్తుంది. అవసరానికి మించిన కోర్కెలు రావడం, అవి తీర్చుకునేందుకు అనేక జన్మలు తీసుకోవాల్సిరావడం మనం నిర్ణయించుకున్న ప్రారబ్దమే. పశుపక్ష్యాదులను సైతం పోషించే దైవం నీ అవసరాలు తీర్చలేడా? అని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఈ సృష్టి ధర్మాన్ని పరికించడంలేదు. అందుకే భగవంతునిపై విశ్వాసం రావడంలేదు. అందుకే వెంపర్లాటతో మనం అనవసర విషయలనూ, భోగాలను కూడా కోరుకుంటున్నాం.
✳️ ధర్మం అంటే సకల ప్రాణికోటి జీవనంలోని సమానత్వాన్ని గుర్తించడమే. నీకున్న అవసరాలు, ప్రతిస్పందనలే అన్ని జీవరాసులకూ ఉంటాయి. ఆ ధర్మం తెలిస్తే వాటి జీవనానికి ఆటంకం కలిగించే అధర్మము మనం చేయలేము. శ్వాస, ఆకలి, దాహం, శీతోష్ణ బాధలు ఏ ప్రాణికైనా ఉన్నాయి. గాలి, ఆహారం, నీరు, ఆచ్ఛాదన, రక్షణను అన్ని ప్రాణులు కోరుకుంటున్నాయి. అదే సృష్టి ధర్మం. అదే మనం అర్థంచేసుకోవాల్సిన పరమ ధర్మం. *నా గుండె కొట్టు కోవాలని అనుకోవచ్చుగానీ, అందుకు ఏ గుండె ఆగినా పరవాలేదని అనుకోకూడదు.
✳️ దైవంకోసం వెతికే వారికి ఆయన తన గుండెలోనే ఉన్నాడన్న సత్యం తెలిస్తే స్వాంతన వస్తుంది. వెతుకులాట తగ్గుతుంది. దైవం ఉండే స్థానం హృదయమేనని తెలిసినా మనం అక్కడ శోధించకుండా ఇంకా ఎక్కడో వెతుకుతున్నాం. అంటే ఇంకా దేనికోసమో మనం వెంపర్లాడుతున్నామని అర్థం. దైవం ఉండేస్థానం తెలియగానే సరిపోదు. మనలోనే ఉన్న దైవాన్ని అనుభవించాలి. నిరంతరం ఆ దైవభావనలో ఉండాలి. దైవ భావన అంటే అర్థం మనం దేవుడితో సమానం అని కాదు. మనం దైవంలో ఒక భాగం అనే భావన ఉండాలి. *శివోహం* అన్న భావన మనల్ని శివుడిలో భాగంగా చేస్తుంది. గరుడ అహం భావన వల్ల నీవు గ్రద్దవి కాలేక పోవచ్చుగానీ పాము విషం నుండి రక్షణ ఉంటుందని శ్రీరమణ భగవాన్ అన్నారు. అలాగే శివోహం అన్న భావన మనని నేరుగా శివుడిగా మార్చదు. అహంభావ రహితమైన శివస్థితిని కల్పిస్తుంది.
✳️ సృష్టిలో ప్రతిప్రాణి తన ఉనికి కాపాడుకొటానికి ఆహారం, నీరు, గాలి వంటి అవసరాల కోసం వెతుకుతుంది. మనిషిమాత్రం వాటితో ఆగకుండా అదనంగా తన అహంకారాన్ని కాపాడుకోవడానికి దారులు వెతుకుతుంటాడు, గుండెను నడిపేది చైతన్యమే అయినా దానికి తగులుకున్న జీవలక్షణం వల్ల నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు అంటూ ఉంటాం. కానీ అసలు నా అంటే ఏమిటో మర్చిపోతున్నాం. ఈ శరీరంలోని ఏ అవయవాన్నైనా తెలుసుకోగలిగే శక్తి మనసుకి ఉంది. అలాగే తనను తాను తెలుసుకునే శక్తికూడా దానికి ఉంది. తనను తాను తెలుసుకోవడమే ఆత్మానుభవమంటే. నిత్య జీవితంలో ఏ పని శ్రద్ధగా చేయాలన్నా ఇతర పనులు పక్కన పెట్టాలి. మనకి గ్రహింపు శక్తిని ఇచ్చింది చైతన్యమే. దాంతోనే మనం అన్నీ తెలుసుకో గలుగుతున్నాం. కానీ ఆ గ్రహింపుశక్తిని ఇచ్చిన చైతన్యాన్ని మాత్రం తెలుసుకోవడంలేదు. తనను తాను గుర్తించాలనే ధ్యాస మనసుకి వచ్చిన రోజు ఒక్కటొక్కటిగా బయటి విషయాలపై ఆసక్తి పోతుంది. మన కష్టాన్ని, అవసరాన్ని దేవుడు చూస్తూ ఏదో ఒక వ్యక్తి రూపంలో తీరుస్తూనే ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించడంలేదు. అందరూ మన కష్టాన్ని, అవసరాలను గుర్తించి తీర్చాలని, ఓదార్చాలని ఆశిస్తున్నాం. అనవసరమైన వెంపర్లాటే మనసుకి అదనపు ఆలోచన. నిరంతరం ఏదో ఒక పవిత్ర నామస్మరణతో దీన్ని నియంత్రించాలి. గుండె కదలిక ప్రాణాన్ని తెలిపినట్లే మంత్రజపం మనలో చైతన్యాన్ని తెలుపుతుంది. బయటి విషయాల కోసం మన తెలివిని ఉపయోగించడం వల్ల అది ఆలోచనగా మారుతుంది. ఓపిక, సహనం లేకనే తెలివిని అధికంగా ఉపయోగించి మనసుని మనమే కలుషితం చేస్తున్నాం. బయటి వస్తువుల కోసం ఆలోచన అవసరం. లోపలి వస్తువును వెతికేటప్పుడు ఏ ఆలోచనా అవసరం ఉండదు. ఈ ఆలోచనలను వదిలించుకోవడానికే పెద్దలు పవిత్ర మంత్రజపాన్ని నిర్దేశించారు. మంత్రజపం చేసేటప్పుడు కూడా ఆలోచిస్తూనేఉంటే మనసాధన వృధా అవుతుంది. అనవసర ఆలోచనల మధ్య దైవంపై శ్రద్ధ ఎలా నిలబడుతుంది?
✳️ మన జ్ఞాపకాలే మనను ఆలోచనలుగా మారి వేధిస్తుంటాయి. జ్ఞాపకం అంటే తిరిగి అనుభవాన్ని కోరుకోవడం. లేదంటే.. ఫలానా అనుభవాన్ని వద్దనుకోవడం. జ్ఞాపకాలు మితంగా ఉంటే ఆలోచనలుకూడా మితంగా ఉంటాయి. జ్ఞాపకాలు, ఆలోచనలు తగ్గిస్తూ పోతే మిగిలేది ధ్యానమే. ధ్యానం సిద్దించడమే దైవ దర్శనం. దానికి వయసుతో నిమిత్తంలేదు. ఎందుకంటే కడుపులో పిండంగా ఉండగానే నీవు భగవంతుని చిహ్నంగా ఉన్నావు. చైతన్య స్వరూపంతో దేహంగా కనిపించే మనకి ఆ ఉన్నది తెలియడానికి వయసుతో పనేముంది.
[4/24, 07:00] +91 73963 92086: ఆత్మగా ఉన్న దైవం తెలియడమే ఆత్మ దర్శనం. అందుకు కృషితో తప్ప వయసుతో నిమిత్తం లేదు. ఆత్మదర్శనం అంటే వ్యక్తిభావన నశించటమే. అప్పుడు 'నేను శరీరాన్ని' అన్న పరిధి పోతుంది. వాస్తవానికి నీ గుండెను నడిపేది చైతన్యం. కానీ భార్య, పిల్లలు, సంసారం వంటి జీవలక్షణాలు నీగుండెను నడుపు తున్నాయని అనుకుంటున్నావు. అదే మన అజ్ఞానం. ఆత్మ శక్తిగా ఉన్న ( నీ ) ఉనికితోనే ఈ శరీరం చైతన్యమైంది. ఆ విషయం మరిచి) నేను అంటే ఈ శరీరం అనుకొంటున్నాం. చైతన్యం వేరే ఉందని అనుకుంటున్నాం. *అన్నింటినీ నాది, నాది అనుకునేముందు అసలు 'ఆ నువ్వు' ఎవరో విచారించమని భగవాన్ చెప్తున్నారు.* వ్యాపారంలో లాభం రావాలంటే పెట్టుబడి పెట్టాలి. కానీ నీ పెట్టుబడి ఏదీ లేకుండానే నీకు దేవుడు జీవితం అనేలాభాన్ని ఇచ్చేశాడు. తల్లి గర్భంలోనుండి బయటకు వచ్చేనాటికే నీకు అవసరమైనవన్నీ సమకూర్చే ఉంచాడు. నీవు తెలుసుకునేవి, చూసేవి, అనుభవించేవి నీ పెట్టుబడి లేకుండానే ఆయన ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచినవే. దైవం ఇచ్చిన జీవితాన్ని నువ్వు కష్టసుఖాలతో కొలవకూడదు. కష్టానికి, సుఖానికి కారణం మన దేహభావన. ఆ భావన తీసేయకుండా చివరికి దేహం చాలించినా ఫలితం లేదు. ఆత్మహత్య చేసుకున్నా దేహం పోతుంది కానీ అహంభావన పోదు. అది అంత బలంగా ఉంది. కష్టసుఖాలకు దేహమే కారణం అని భావిస్తున్నాం. ఆ దేహం నుండి విముక్తిని కోరుకుంటున్నాం. అంటే నువ్వు దేహానివి కావనే భావన కూడా అప్పటికే అంతర్లీనంగా ఉంది.
🙏 మనలో మనుసుగా మారి అన్నింటినీ గుర్తించేది చైతన్యం. కానీ, అది తనను తాను గుర్తించడంలేదు. శరీరానికి ఆధారమైన గుండెను నడిపే ఆ చైతన్యమే నీ జీవితాన్ని నడిపే దైవమని తెలుసుకోవటమే ఆత్మసాధన.
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment