శివనామ స్మరణం సర్వపాపహరం
नमश्शशिकला कोटि कल्प्यमानांकुरश्रिये |
प्रसन्नजन संकल्प कल्पवृक्षाय शम्भवे ||
తనను ఆశ్రయించేవారి కోరికలను తీర్చుతూ వారికి ఆనందాన్ని పంచి ఇచ్చే జన సంకల్ప కల్పవృక్షమయిన శంభువుకు నా నమస్కారములు అని ఈ శ్లోకం యొక్క అర్ధం.
పరమేశ్వరుని మహత్తు, శివపూజ, శివక్షేత్ర విశేషాలు, శివలీలలు, శివభక్తుల గాథలు మొదలైన విషయాలు విపులంగా శివపురాణంలో వివరించబడ్డాయి. శివక్షేత్రాలలో కాశీ క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యముంది. దానిని అవిముక్త క్షేత్రమంటారు. మహర్షులెందరో ఆ క్షేత్రంలో శివుని ఉపాసించి ముక్తిని సాధించారు. పరమశివుని కృపాకటాక్షం కారణంగానే మార్కండేయ మహర్షి చిరంజీవి అయ్యాడు. శివనామమే అత్యంత పవిత్రమైనది.
शिवनामनि भावितेन्तरंगे महतिज्योतिषि मानिनीमयार्थे |
दुरित्यान्यपयान्ति दूरदूरे मुहुरायान्ति महान्ति मंगलानि ||
శివనామాన్ని స్మరించినంతమాత్రానే సర్వపాపాలు నశించి, శుభం జరుగుతుందని శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో విరించారు. భగవత్పాదులు రచించిన స్తోత్రాలను ముఖ్యంగా శివానందలహరిని, శివభుజంగ సోత్రాన్ని, శివపంచాక్షరి స్తోత్రాన్ని భక్తులు పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శివపూజకు తగినరోజులలో కార్తిక మాసం, మహాశివరాత్రి చాలా ప్రాముఖ్యం. శివరాత్రి నాడు జాగారణ చేసి శివపూజలో నిమగ్నులై ఉండేవారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివపూజకు బిల్వదళాలు ప్రశస్త్యం. శ్రద్ధగా భక్తితో చేసే పూజ భక్తుని కోరికలను తప్పక తీరుస్తుంది. కార్తిక మాసంలో కార్తిక పురాణాన్ని, శివమహాత్మాన్ని వివరించే శివపురాణాన్ని పఠించి భక్తులందరూ తరింతురుగాక.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment